ఇక పంటల సర్వే 

Crops Land Survey In Warangal - Sakshi

సంగెం: రాష్ట్ర ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన చేసిన విధంగానే మరో సమగ్ర సర్వేకు సిద్ధమవుతోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో వారు సాగు చేస్తున్న పంటల వివరాలు, సాగునీటి వసతి, భూ వివరాల వంటివి మొత్తం 30 అంశాలకు సంబంధించిన వివరాలను రైతుల నుంచి సేకరించనున్నారు. ఈనెల మొదటివారంలో ప్రారంభం కానున్న ఈ సమగ్ర సర్వేలో రైతుల వివరాలను సేకరించేందుకు అవసరమైన ఏర్పాట్లలన్నింటిని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సంయుక్తంగా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా పంటకాలనీలు, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తెలుసుకునేందుకు ఈ సర్వేను ప్రభుత్వం చేపట్టనుంది. దీని ఆధారంగా ఏ గ్రామంలో పంటకాలనీలు నెలకొల్పాలి, ఏ పంటలు పండించాలనేది నిర్ధారించనున్నారు. దీంతో పాటు స్థానికంగా పండిన పంటలతో ఆహారశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
 
జిల్లాలో 1,88,890 మంది రైతులు..
జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన ప్రకారం 3,87,629 ఎకరాల భూమి ఉండగా వ్యవసాయ యోగ్యమైన భూమి 1,72,463 ఎకరాలు ఉంది. ఇందులో రెండున్నర ఎకరాల కంటే తక్కువగా ఉన్న రైతులు 1,38,108 మందికి 1,39,457 ఎకరాలు, ఐదెకరాల లోపు 35,510 మందికి 1,21, 365 ఎకరాలు, 10 ఎకరాల వరకు ఉన్న రైతులు 12,035 మందికి 78,009 ఎకరాలు, 25 ఎకరాల వరకు ఉన్న రైతులు 3,027 మందికి 40,437 ఎకరాలు, 25 ఎకరాలకు పైబడిన రైతులు 210 మందికి 8,360 ఎకరాల భూమి ఉన్నది. జిల్లాలో ముఖ్యమైన పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, పసుపు, జొన్న, కందులు, పెసర్లు, మిర్చి వంటి పంటలు అధికంగా పండిస్తారు.

మెరుగు పడనున్న ఉపాధి అవకాశాలు..
ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభించనున్న ఈ సర్వే మార్చి వరకు కొనసాగనుంది. ఈ సర్వేలో రైతుల నుంచి పలు అంశాలపైన అధికారులు వివరాలను సేకరించి ప్రింటెడ్‌ ఫార్మాట్‌లో నమో దు చేసుకుంటారు. ఈ సర్వే ఆధారంగా చేసుకుని ప్రభుత్వం భవిష్యత్‌లో ప్రజలకు, వారి అవసరాలను తీర్చే పంటలనే స్థానికంగా పండించాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. పంట కాలనీలు నెలకొల్పి రైతుకు వ్యవసాయంపైన నిత్యం అవగాహన కల్పిస్తూ పంటలకు సాగు చేయించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఆహారశుద్ది కేంద్రాల ద్వారా రైతులు పండించిన పంటలను ప్రాసెసింగ్‌ చేసి, అధిక ధరలకు విక్రయించేలా చర్యలు చేపట్టనున్నారు. దీని ద్వారా రైతులకు ఆదాయంలో అభివృద్ధి, నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

సర్వేలో సేకరించనున్న అంశాలు ఇవే..
పంటకాలనీల ఏర్పాటుకు సంబంధించి రైతుల నుంచి అధికారులు పలు వివకాలను సేకరించనున్నారు. రైతు పట్టాదారు పాసు పుస్తకం నంబర్, రైతు పేరు, తండ్రి పేరు, పురుషుడు, లేదా స్త్రీ, అనే వివరాలు, ధరణి పోర్టర్‌లో ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేశారా అనే వివరాలు, పుట్టిన తేది, సెల్‌ ఫోన్‌ నంబర్, బ్యాంకు అకౌంట్‌ నంబర్, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్‌ఎస్‌ సీ కోడ్, సామాజిక స్థితి వివరాలు, రైతుకు ఉన్న మొత్తం భూమి, సర్వే నంబర్ల వివరాలు పార్ట్‌ ఏ మొదటి పేజీలో నమోదు చేయనున్నారు. భూమి వ్యవసాయానికి అనువుగా ఉందా లేదా అనే వివరాలు, సాగు చేయడానికి నీటికి దేనిపైన ఆధారపడుతున్నారనే వివరాలు సేకరించనున్నారు. సాగుచేయడానికి బోర్లు, బావి, కాల్వ, చెరువు, వర్షాధారంగా పంటలను సాగుచేస్తున్నారా అనే విషయాలను తెలుసుకోనున్నారు. 

రైతులు సహకరించాలి..
రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర పంటల సర్వేకు జిల్లాలోని రైతులంతా సహకరించాలి. ప్రభుత్వం పంట కాలనీల ఏర్పాటులో భాగంగా పంటల సమ గ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటివారం నుంచి సర్వేను ప్రారంభి స్తాం. ఇప్పటికే ఒక ఫార్మట్‌ను అందించారు. దాని ఆధారంగా రైతుల వివరాలను నమోదు చేయాలని సూచించాం. ఇంకా మార్పులు చేర్పులపైన చర్చలు కొనసాగుతున్నాయి. రైతులు అధికారులతో సహకరించి సర్వేలో పాల్గొని తమ భూములకు సంబంధించి సమగ్రంగా సమాచారం అందించాలి. దీని ద్వారా ప్రభుత్వం పంట కాలనీల ఏర్పాటు, ఆహారశుద్ధి కేంద్రాలను నెలకొల్పాలని భావిస్తోంది.  రైతులు పథకాలను వినియోగించుకోవాలి. – ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయశాఖాధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top