కంగారెత్తిస్తున్న కరోనా

COVID 19 Case File in Osmania Hospital Hyderabad - Sakshi

గ్రేటర్‌ వాసుల్లో భయం భయం

రెండో దశకు చేరుకున్న వైరస్‌ విస్తరణ

పెరుగుతున్న అనుమానితుల సంఖ్య

తాజాగా మరో పాజిటివ్‌ కేసు

ఆరోగ్య రాజధాని హైదరాబాద్‌ నగరం అనారోగ్యం బారిన పడింది. గత రెండు వారాలుగా గాంధీలో చికిత్స పొందిన కరోనా పాజిటివ్‌ బాధితుడు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జై ఇంటికి వెళ్లి పన్నెండు గంటలు కూడా గడవక ముందే ఇటలీ నుంచి వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన యువతితో పాటు ఇటీవలే నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన కొత్తపేట వాసవి కాలనీకి చెందిన వ్యక్తి(48)కి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇరుగుపొరుగు సహా బంధువులు, కుటుంబ సభ్యులు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడ తమకు ఈ వైరస్‌ సోకుతుందోనని ఆందోళనచెందుతున్నారు. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టేందుకు జంకుతున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: కరోనా భయం నగరవాసిని వెంటాడుతూనే ఉంది. మహేంద్రహిల్స్‌ వాసికి కరోనా చికిత్స అనంతరం కోలుకోగా..ఇప్పుడు తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన అశ్వరావుపేటకు చెందిన యువతి రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరింది. గాంధీ, పూణే వైరాలజీ ల్యాబ్‌ల్లో నిర్వహించిన వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తపేట వాసవీ కాలనికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం, ఇప్పటికే ఆయనకు క్లోజ్‌కాంటాక్ట్‌లో 12 మంది వరకు ఉన్నట్లు గుర్తించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈయన ఇటీవల నెదర్లాండ్స్‌ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇతడు కూడా గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎంత మంది? ఇప్పటి వరకు ఎక్కడెక్కడ..ఎంత మందితో కలిసి తిరిగాడు? ఏ ఏ ప్రాంతాలు సందర్శించాడు? లక్షణాలు బయట పడిన తర్వాత చికిత్స కోసం స్థానికంగా ఏ ఏ ఆస్పత్రులకు తిరిగాడు? వంటి అంశాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే కాలనీలో కరోనా కలకలం సృష్టించడంతో ఇరుగు పొరుగువారితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు భయంతో వణికిపోతున్నారు. తమకేమైనా వైరస్‌ వ్యాపించి ఉండొచ్చేమోనని ఆందోళన చెందుతున్నారు. గాంధీ, ఫీవర్, ఉస్మానియాలకు పరుగెత్తి వ్యాధినిర్ధాణ పరీక్షలు చేయించుకుంటున్నారు.  

ఉస్మానియాలో మరో కేసు నమోదు
డిమార్ట్‌లో పని చేసే టోలిచౌకికి చెందిన ఓ యువతికి కరోనా సోకినట్లు ప్రచారం జరిగింది. శనివారం రాత్రి ఆగమేఘాల మీద ఆమెను ప్రత్యేక అంబులెన్స్‌లో గాంధీకి తరలించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. అదే విధంగా  బంజారాహిల్స్‌కు చెందిన ఎయిర్‌హోస్టెస్‌కు కూడా వైద్య పరీక్షల్లో నెగటివ్‌ రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ముషీరాబాద్‌ బోలక్‌పూర్‌కు చెందిన మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం ఆదివారం ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. పరీక్షించిన వైద్యులు ఆమెను గాంధీ కరోనా ఐసోలేషన్‌ వార్డుకు తరలించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఇటలీ నుంచి వచ్చిన మరో యువకుడు కూడా కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీరికి సంబం ధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ వైరస్‌ విస్తరణ రెండో దశలో ఉంది.   

కంటోన్మెంట్‌ డిపోలో బస్సులను కెమికల్స్‌తో శుభ్రం చేస్తున్న దృశ్యం  

హైరిస్క్‌ ప్రాంతాల్లో హై అలర్ట్‌..
ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ నగరం విభిన్న సంస్కృతులకు కూడా నిలయం. ఉపాధి అవకాశాలు, ప్రాజెక్ట్‌ వర్క్‌లు కోసం అనేక మంది ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్నారు. ఇదే సమయంలో స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా ఇక్కడికి వస్తుంటారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రపంచ దేశాలకు రోజుకు సగటున 500 విమానాలు ప్రయాణిస్తున్నాయి. వీటిలో 53 వేల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. హైదరాబాద్‌ మెట్రోలో రోజుకు నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో దిగుతుంటారు. వినోదం, విలాసం కోసం క్లబ్బులు, పబ్బుల్లో ఎక్కువగా గడుపుతుంటారు. మల్టీప్లెక్స్‌లు, షాపింగ్‌ మాల్స్‌ సహా నగరంలోని చారిత్రక ప్రదేశాలైన చార్మినార్, నెహ్రూ జూలాజికల్‌ పార్క్, గోల్కొండ కోట, పలు రిసార్ట్స్, మ్యూజియాలను సందర్శిస్తుంటారు. బిర్లా టెంపుల్, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ టెంపుల్, చిలుకూరు బాలాజీని దర్శించుకుంటారు.

సాధారణంగా జనసమూహం ఎక్కువగా ఉంటే ఈ ప్రాంతాల్లో విదేశాల నుంచి వచ్చిన వారు కూడా తిరుగుతుండటం, హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ పుట్టే అవకాశం లేకపోయినప్పటికీ..ఇప్పటి వరకు పాజిటివ్‌ నిర్ధారణ అయిన బాధితులు విదేశాల్లో పర్యటించి వచ్చిన నేపథ్యం ఉండటం భయపెడుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉండటం, వీరంతా రద్దీ ప్రదేశాల్లో తిరుగుతుండటంతో వారి నుంచి ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో ఆయా హైరిస్క్‌ ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్‌ను ప్రకటించింది. సాధ్యమైనంత వరకు ఆయా ప్రాంతాల్లో జనం రద్దీ ఎక్కువగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే వైరస్‌బారి నుంచి కాపాడుకునేందుకు సిటిజనులు మాస్క్‌లు, హ్యాండ్‌వాష్‌ లిక్విడ్, శానిటైజర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతుండటంతో ఇటీవల వాటికి డిమాండ్‌ పెరిగింది. ధరలూ పెరిగిపోయాయి.

వాసవీ కాలనీలో భయాందోళనలు
నగరంలోని జాతీయ రహదారి పక్కన గల కొత్తపేట వాసవీ కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా బయట పడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగత్ర చర్యలకు ఉపక్రమించింది. ఇక టీవీచానళ్ల ద్వారా విషయం తెలుసుకుని కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. సుమారు 15 వేలకు పైగా కుటుంబాలు నివసించే  అతిపెద్ద కాలనీ కావడంతో బహుళ అంతస్తుల భవనాలు, వ్యక్తిగత గృహాలు అధికంగా ఉన్నాయి. ఈ కాలనీ నిరంతర పారిశుధ్య చర్యలతో శుభ్రంగా ఉంటుంది. ఇదే కాలనీలో అతిపెద్ద అష్టలక్ష్మి దేవాలయం ఉండటంతో భక్తుల తాకిడి కూడా అధికంగానే ఉంటుంది. మరోవైపు కాలనీకి అనుకొని జాతీయ రహదారి వెంబడి పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్, వాణిజ్య సముదాయలు ఉండటంతో కిటకిటలాతుంటుంది. వైరస్‌ సోకిన వ్యక్తి ఇంటి వద్దనే కాకుండా..కాలనీలో బయట తిరిగి ఉంటే ఇతరులకు కూడా వ్యాపిస్తోందేమోనని స్థానికులు భయపడుతున్నారు.

జలుబు, దగ్గు బాధితులకు దూరంగా వైద్యులు
గ్రేటర్‌లో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో రోగులకు చికిత్స అందించే వైద్యులకు భయం పట్టుకుంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులకు ఓపీ ఇప్పటికే భారీగా తగ్గిపోయింది.తాజాగా దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలతో బాధపడుతూ బాధితులెవరైనా చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే చాలు వారిని చూసి వైద్యులతో పాటు స్టాఫ్‌నర్సులు, ఇతర పారామెడికల్‌ స్టాఫ్‌ దూరంగా వెళ్తున్నారు. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు..కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. సౌదీ అరేబియా నుంచి ఇటీవల ఓ వ్యక్తి గుల్బర్గా వచ్చి, జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేరి, కొన్ని రోజులు చికిత్స పొందడం, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు చేరుకోవడం, ఇక్కడ మూడు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని వైద్యసిబ్బందితో క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉండటం, ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన గంట వ్యవధిలోనే ఆయన చనిపోవడం, ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడం తెలిసిందే.

అంతకు ముందు ఆయనకు ఎంత మంది వైద్యులు చికిత్స చేశారు? వీరిలో ఎవరెవరున్నారు? ఆ తర్వాత వారు ఎంత మందిని కలిశారు? ఎక్కడెక్కడ ఎంత మందితో కలిసి ప్రయాణించారు? ఇప్పటికే వారి నుంచి మరెంత మందికి వైరస్‌ సోకి ఉంటుంది? వంటి ప్రశ్నలకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద సరైన సమాధానం లేదు. అంతేకాదు ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎవరికి? ఏ వైరస్‌ ఉందో? గుర్తించడం కష్టంగా మారింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top