కౌంటర్‌ అటాక్‌

Counter Attack - Sakshi

ప్రతీకారేచ్ఛతో రగులుతున్న మావోయిస్టులు

తడపలగుట్ట ఘటనతో ప్రతిదాడులకు యత్నాలు

సుక్మా జిల్లాలో అర్ధరాత్రి విధ్వంసం..ఒకరి హత్య 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నాయకులే టార్గెట్‌

భద్రత లేకుండా తిరగొద్దంటున్న పోలీసులు 

సాక్షి, కొత్తగూడెం : తెలంగాణలో తమ కార్యకలాపాలను తిరిగి ముమ్మరం చేయాలనుకున్న మావోయిస్టులు.. తాజా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అలజడి నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్‌ మొదలైంది. ఇందుకు తగినట్టుగానే సోమవారం అర్ధరాత్రి ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా డోర్నపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్‌–2 డిపోకు చెందిన రెండు బస్సులు, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరో ప్రైవేటు బస్సు, మూడు లారీలు, ఒక ట్రాక్టరును దహనం చేశారు. ఒక వ్యక్తిని హతమార్చారు.

ఈ క్రమంలోనే మరిన్ని విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈనెల 2వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ పోలీసులదే కీలక పాత్ర కావడం, టీఆర్‌ఎస్‌ నేతలే లక్ష్యమని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ ప్రకటించడంతో అధికార పార్టీ నాయకుల్లో భయం నెలకొంది. ముఖ్యంగా జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని టీఆర్‌ఎస్‌ నాయకులు టెన్షన్‌ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన రద్దయింది. కింది స్థాయి నాయకులు సైతం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా సరిహద్దు మండలాలైన చర్ల, దుమ్ముగూడెం, భధ్రాచలం, గోదావరి పరీవాహక ప్రాంతంలోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భూపాలపల్లి జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులపై మావోయిస్టులు నజర్‌ పెట్టారు.దీంతో ఆయా నాయకులు మైదాన ప్రాంతాలకు తరలివెళుతున్నారు. తాజా ఎన్‌కౌంటర్‌ బూటకమని, సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరపాలని, దోషులను శిక్షించాలని అధికార ప్రతినిధి జగన్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

అధికార పార్టీ నాయకులను మావోయిస్టులు టార్గెట్‌ చేసుకున్న నేపథ్యంలో తమకు చెప్పకుండా ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కావద్దని పోలీసులు మూడు జిల్లాల నాయకులకు సూచించారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్‌ విభాగం సైతం హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో పర్యటించాలంటే తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ, భయాందోళనలు నెలకొన్నాయి. సరిహద్దు మండలాల్లోని ప్రజల్లోనూ టెన్షన్‌ నెలకొంది. 

 రవాణా వ్యవస్థపైనా ప్రభావం... 
ప్రతీకారేచ్ఛతో ఉన్న మావోయిస్టులు విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో మొదట ఈ ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది. గత అర్ధరాత్రి హైదరాబాద్‌ డిపోకు చెందిన బస్సులను, మూడు లారీలను, ఒక ట్రాక్టరు, ఒడిశాకు చెందిన మరో ప్రైవేటు బస్సును తగులబెట్టడంతో అంతర్రాష్ట్ర రవాణాపై పూర్తిగా ప్రభావం పడింది. టీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులను పరిమితం చేసింది.

రాత్రి సర్వీసులు రద్దు చేశాం 
ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసక చర్యల్లో భాగంగా హైదరాబాద్‌ డిపో బస్సులను తగులబెట్టారు. ఈ నెల 9న బంద్‌కు పిలుపునిచ్చినట్లు సమాచారం వచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సు సర్వీసులను పరిమితం చేశాం. అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేశాం. హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్, బైలడిల్ల వెళ్లే బస్సులను కుంట వరకే నడుపుతున్నాం. పోలీసుల సూచనల మేరకు కొన్ని సర్వీసులను పరిమితం చేయడంతో పాటు, రాత్రి వేళల్లో తిప్పే సర్వీసులను రద్దు చేశాం. ఏటూరునాగారం, వెంకటాపురం రూట్లలో వెళ్లే రాత్రి సర్వీసులు రద్దు చేయడంతో పాటు ఉదయం నడిచే బస్సులకు అవసరాన్ని బట్టి భద్రత తీసుకుంటున్నాం. 
– నామ నరసింహ, 
ఆర్టీసీ భద్రాచలం డిపో మేనేజర్‌

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top