పైసా మే పట్వారీ!

Corruption In Revenue Department Karimnagar - Sakshi

ముస్తాబాద్‌ మండలంలోని పోత్గల్‌ గ్రామంలో వీఆర్‌ఓ అవినీతి, అక్రమాల వల్ల 200 మంది రైతులకు చెందిన భూములు కొత్త పట్టా పుస్తకాలలోకి ఎంట్రీ కాలేదు. డబ్బులు ఇచ్చిన వారి పేర్లనే నమోదు చేశారు. గ్రామ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, వీఆర్‌ఓ బాపురెడ్డిని సస్పెండ్‌ చేశారు. అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో మండల కేంద్రంలోని ముస్తాబాద్‌ వీఆర్‌ఓ హరికిషోర్‌ను బదిలీ చేశారు. నామాపూర్, మొర్రాయిపల్లి వీఆర్‌ఓలను సిరిసిల్ల కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి సస్పెండ్‌ చేశారు. ముస్తాబాద్‌ తహసీల్దార్‌ను కూడా అవినీతి ఆరోపణలతోనే బదిలీ చేశారు. 

బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన గుడి రాజిరెడ్డికి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి కుమారులు. వీరిలో రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి గతంలో మరణించారు. వారి పేరున ఉన్న వ్యవసాయ భూమి వారసులు గుడి మల్లారెడ్డి, గుడి దేవేంద్రల పేరిట విరాసత్‌ చేయాల్సి ఉంది. దేవేంద్ర కుమారుడు గుడి మనోజ్‌ తన తాతకు సంబంధించిన భూమి విరాసత్‌ చేయాలని యల్‌ఆర్‌యూపీఎస్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. జనార్దన్‌ తడగొండ వీఆర్వోగా ఉన్న సమయంలో 30 గుంటల భూమి విరాసత్‌ చేయకుండా ఆపాడు. దీంతో ఆ యువకుడు 30 గుంటల భూమిని తన తల్లి పేరున ఆన్‌లైన్‌ చేయాలని వీఆర్వోను కోరాడు. రూ.5వేలు ఇస్తే ఆన్‌లైన్‌ చేస్తానని వీఆర్వో చెప్పగా.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బోయినపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో 2018 మే 2న ఏసీబీ అధికారులు దాడి చేసి మనోజ్‌ నుంచి రూ.ఐదు వేలు తీసుకున్న వీఆర్వో జనార్దన్‌ను పట్టుకున్నారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: వీఆర్‌వోల లీలలు కేవలం ముస్తాబాద్, బోయినపల్లి మండలాలకే పరిమితం కాలేదు.  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అదే పరిస్థితి నెలకొంది. ముస్తాబాద్‌ మండలంలో వీఆర్‌ఓల అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి తక్షణ చర్యలు చేపట్టారు. కానీ మిగతా జిల్లాల్లో ఏళ్లకేళ్లుగా గ్రామాల్లో రైతులను శాసిస్తూ, పట్టా పాసు పుస్తకాలు, పహానీలకు తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వీఆర్వో నాలుగైదు గ్రామాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అడిగేవారు లేరనే అహంతో అవినీతి, అక్రమాలతో కోట్లు వెనుకేసుకుంటున్న వీఆర్‌ఓలు కూడా కరీంనగర్‌ పూర్వ జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూ రికార్డుల ప్రక్షాళన వీఆర్‌వోలకు కాసుల వర్షం కురిపించే కామధేనువుగా మారింది. అదే సమయంలో భూమి హక్కులు గల యజమానులకు అన్యాయం జరిగింది.

కాసుల గలగలతో మారిన రాతలు
గ్రామాల్లో ఆధార్‌కార్డులో అడ్రస్‌ మార్పుకు సర్టిఫై చేసే పని నుంచి ప్రభుత్వ అసైన్డ్‌ భూమిని అక్రమంగా కొనుగోలు చేసిన వారికి పట్టా చేసేంత వరకు వీఆర్‌ఓలే కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఒక్కో పనికి ఒక్కో రేటును నిర్ణయించి మరీ లక్షల్లో వసూలు చేసిన సంఘటనలు ఎన్నో. రైతు తన పని కావాలని డబ్బులిస్తే, ఇతర భూములు, సర్కారు భూములను ఆక్రమించుకున్న అక్రమార్కులకు అండగా నిలిచి, వారికి ‘రాసిచ్చినందుకు’ లక్షల్లో పోగేసుకున్నారు.

భూములను ఇష్టానుసారంగా విరాసత్‌ చేయడం, మ్యుటేషన్‌లతోపాటు సంబంధం లేని సాకులు చూపి పాసుపుస్తకాల్లో పేర్లు ఎంట్రీ చేయకపోవడం వంటి అంశాలన్నీ వీఆర్‌వోలకు కాసులు కురిపించేవిగానే తయారయ్యాయి. దూరప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ కరీంనగర్‌లో విలాసవంతమైన జీవితాలు గడిపే వీఆర్‌ఓలు ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. కాగా వీఆర్‌ఓగా కేవలం ఆదాయం వచ్చే రెవెన్యూ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తూ అందిన కాడికి దండుకోవడంతోపాటు కొందరు తహసీల్దార్లకు కూడా వాటాలు ఇచ్చే సంస్కృతికి బీజం వేశారు. వీఆర్‌ఓల మీద ఆరోపణలు వస్తున్నా, తమకు అందుతున్న తాయిలాలతో తహసీల్దార్లు సైతం మిన్నకుండి పోతున్నారు.

ఇసుక, ఇటుక, మట్టి... అన్నీ ఆదాయ మార్గాలే!
కరీంనగర్‌ పూర్వ జిల్లాలోని మానేరు వాగులు, గోదావరి, దాని అనుబంధ నదుల్లో లభించే ఇసుకకు రాష్ట్రంలో మంచి డిమాండ్‌ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నేపథ్యంలో జిల్లాల్లో ఉన్న ప్రైవేటు, టీఎస్‌ఎండీసీ ఆధీనంలోని ఇసుక రీచ్‌లను మూసేశారు. ప్రభుత్వ పనులకైనా, ప్రైవేటు పనులకైనా కాళేశ్వరం నుంచే ఇసుకను తీసుకోవాలనే నిబంధనలు విధించారు. నిర్ధేశించిన మొత్తానికి చలానా చెల్లించి ఇసుకను తెప్పించుకోవడం కష్టమవుతుండడంతో గ్రామాల్లోని ట్రాక్టరు యజమానులకు డిమాండ్‌ పెరిగింది. ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకకు రూ.2000 నుంచి 2,500 వరకు పలుకుతుండడంతో ట్రాక్టర్‌ యజమానులు రోజుకు పది ట్రిప్పుల వరకు ఇసుకను తోడేస్తున్నారు.

దీనికి సహకరించినందుకు వీఆర్వోలకు రోజు వారీ మొత్తాలను సమర్పిస్తున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది. కరీంనగర్‌ శివార్లలోని ఇరుకుల్ల వాగులో రాత్రి వేళల్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తోడేస్తున్నాయి. ఇసుక తవ్వడం కోసం ప్లొక్లెయినర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది రోడ్డున పోయే వారికి కనిపిస్తున్నా, స్థానిక వీఆర్‌వోలకు కాసులు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఘోరం ఏంటంటే ఇసుకను నింపుకున్న ట్రాక్టర్లు రాజీవ్‌ రహదారి మీద రాంగ్‌ రూట్లలో వస్తుండడం. కాగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో విచ్చలవిడిగా వెలిసిన ఇటుక బట్టీలకు మట్టిని సమకూర్చే దందాల్లో కూడా వీఆర్‌వోలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అడ్డగోలు దందాలకు అండగా ఉంటున్నారు. 
మరికొందరు వీఆర్‌ఓల లీలలు

  • రామగిరి మండలం బుధవారం పేట(రామయ్య పల్లి)కు చెందిన దండ శ్రీనివాస్‌రెడ్డి, కొండపర్తి రాజమ్మలకు కలిపి ఆదివారంపేట శివారు సర్వే నెంబర్‌ 178లో 3.35 ఎకరాల భూమి ఉంది. కానీ వీరికి కొత్త పట్టా పాస్‌ పుస్తకాలు ఇవ్వడంలో వీఆర్‌ఓల కిరికిరితో రైతుబంధు లబ్ధి రావడం లేదు. దీంతో ఆందోళనకు గురైన శ్రీనివాస్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి మృతిచెందారు. ఇప్పటికీ వీఆర్‌ఓ గానీ, తహసీల్దార్‌ గానీ కనికరించలేదు.
     
  • కథలాపూర్‌ మండలం పెగ్గెర్ల గ్రామస్తుడు పాలెపు బాలయ్య అనే రైతుకు పెగ్గెర్ల గ్రామ రెవెన్యూ పరిధిలో 4.15 ఎకరాల భూమి ఉంది. పాసుబుక్కుల్లో మాత్రం 1.04 ఎకరాలు అని ఉంది. తన భూమిని కొత్త పాసుబుక్కుల్లో ఎక్కించాలని ఏడాదిగా తిరుగుతున్న పట్టించుకునేవారు లేరని వాపోయారు. గ్రామంలోని అధికారులను అడిగితే సరిగా స్పందించలేదని, మండల కార్యాలయాలకు వెళ్లిన లాభం లేకుండా పోయిందన్నారు. అధికారుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయా. భూమి సమస్యలు ఎప్పుడు పరిష్కారిస్తారో నిరీక్షించాల్సి వస్తుందని వాపోయారు. 

ఏసీబీకి పట్టుబడిన ఇల్లందకుంట తహసీల్దార్‌
జమ్మికుంట పట్టణానికి చెందిన కొత్తూరి సమ్మిరెడ్డి ఇల్లందకుంట మండల కేంద్రంలో ఎకరం భూమి కొనుగోలు చేశాడు. సాదాబైనామా చేసేందుకు తహసీల్దార్‌ రవిరాజాకుమార్‌రావ్‌ రూ.2లక్షలు డిమాండ్‌ చేయగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 8న వీఆర్‌ఏ రామకృష్ణతోపాటు తహసీల్దార్‌ను పట్టుకున్నారు.

2015లో 
ఉమ్మడి జమ్మికుంట అప్పటి తహసీల్దార్‌ రజిని, వీఆర్‌ఓ శ్రీనివాస్‌ దాదాపు 25 మంది రైతుల నుంచి రూ.కోటి పైగా డబ్బులు వసూలు చేశారని మాజీ మార్కెట్‌ చైర్మన్‌ తుమ్మేటి సమ్మిరెడ్డి అప్పటి ఏసీబీ సుదర్శన్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. విరాసత్‌లు, పట్టాదారు పాసుపుస్తకాలు, మ్యూటేషన్లు చేయడానికి కనగర్తి, మాచనపల్లి, జగ్గయ్యపల్లి, గడ్డివానిపల్లితోపాటు పలు గ్రామాలకు చెందిన రైతుల నుంచి వీఆర్‌ఓ శ్రీనివాస్‌తో కలిసి తహసీల్దార్‌ రజని డబ్బులు తీసుకున్నారు. 2015 మే 31న ఏసీబీ డీఎస్‌పీ సుదర్శన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సోదాలు చేయగా నేరం అంగీకరించారు. రెండేళ్లపాటు శిక్ష అనుభవించడంతోపాటు విధుల నుంచి తొలగించారు.

ఏడాదిగా తిరుగుతున్నా..
వేములవాడ రూరల్‌: నా పాస్‌బుక్‌పై నా ఫొటోకు బదులు మా అన్న ఫొటో వచ్చింది. దీనిని మార్చాలని గత సంవత్సరంగా తిరుగుతున్నా. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి అధికారులను వేడుకున్నా కనికరించడం లేదు. నాలాంటి వారు ప్రతిరోజు చాలా మంది వస్తున్నారు. – ఎడపెల్లి పర్శరాం, రైతు, గ్రామం: చెక్కపల్లి, మం: వేములవాడ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top