బినామీల పేరిట నిధుల భోజ్యం | corruption in national family benefit scheme | Sakshi
Sakshi News home page

బినామీల పేరిట నిధుల భోజ్యం

Sep 24 2014 11:20 PM | Updated on Mar 28 2018 11:05 AM

జాతీయ కుటుంబ లబ్ధి పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) అమలులో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌పై వేటు పడింది.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  జాతీయ కుటుంబ లబ్ధి పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) అమలులో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌పై వేటు పడింది. పథకం కింద అర్హులకు ఇవ్వాల్సిన సాయాన్ని బినామీల ఖాతాలోకి మళ్లించిన ధారూరు మండల తహసీల్దార్ ఎం.శ్రీనివాస్‌రావును కలెక్టర్ ఎన్.శ్రీధర్ బుధవారం సస్పెండ్ చేశారు. శ్రీనివాసరావు గతంలో శామీర్‌పేట్ తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఎన్‌ఎఫ్‌బీఎస్ కింద మండలానికి రూ.ఐదు లక్షలు మంజూరయ్యాయి. వీటిని లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉండగా.. కేవలం 13 మంది లబ్ధిదారులకు రూ.65వేలు చెక్కుల రూపంలో అందించారు.

మిగతా లబ్ధిదారులకు ఈ నిధులు ఇవ్వకుండా బినామీ పేర్లతో ప్రభుత్వ ఖాతా నుంచి దారిమళ్లించారు. రూ.4.35లక్షలు అక్రమంగా డ్రా చేశారు. ఈ అంశంపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులందడంతో మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి ప్రభాకర్‌రెడ్డితో విచారణ చేయించారు. ఆర్డీఓ విచారణ అనంతరం నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం అమలులో అక్రమాలు రుజువు కావడంతో కలెక్టర్ ఎన్.శ్రీధర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రావును సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
పది రోజుల వ్యవధిలో ఇద్దరు..
 జిల్లా రెవెన్యూ శాఖలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు తహసీల్దార్లు సస్పెన్షన్‌కు గురికావడం రెవెన్యూ వర్గాలను కలవరపెడుతోంది. మల్కాజిగిరి మండలంలోని ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే వ్యవహారంలో అప్పటి తహసీల్దార్ నరసింహరావును గత ఆదివారం సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. రూ.కోట్లు విలువ చేసే సర్కారు భూమిని ప్రైవేటు పర్వం చేయడంలో కీలకభూమిక పోషించిన అంశంపై పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో మల్కాజిగిరి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డితో విచారణ జరిపించిన కలెక్టర్.. ఆదివారం సస్పెన్షన్ ఉత్తర్వులిచ్చారు.

తాజాగా శామీర్‌పేట మండలంలో ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకానికి సంబంధించి నిధులను అక్రమంగా బొక్కిన అప్పటి తహసీల్దార్ శ్రీనివాస్‌రావును సస్పెండ్ చేశారు. తాజా విచారణ కూడా మల్కాజిగిరి ఆర్డీఓ నేతృత్వంలోనే జరిగింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు తహసీల్దార్ల అక్ర మభాగోతం బట్టబయలు కావడం రెవెన్యూ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. అక్రమాలకు కేంద్రంగా మారిన జిల్లా రెవెన్యూ శాఖలో తాజా పరిణామాలు అధికారులకు మింగుడు పడడం లేదు. వరుసగా అధికారుల లీలలు ఒ క్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమం లో అక్రమాలకు పాల్పడిన మరికొందరు అధికారుల భాగోతం త్వరలో వెలుగుచూడనుందని ఆ శాఖలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement