కరోనా: సీఎం సహాయ నిధికి రూ.2 కోట్లు

Corona: Puvvada Ajay Kumar Given Cheque Of 2 Crores For CM Relief Fund - Sakshi

వివిధ రంగాల వారి నుంచి రూ.1.75కోట్లు

స్వచ్ఛందంగా రూ.25లక్షల విరాళం

మంత్రి పువ్వాడ అజయ్‌ను అభినందించిన ముఖ్యమంత్రి

సాక్షి, ఖమ్మం: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలపాలని, సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇచ్చిన పిలుపునకు భారీగా విరాళాలు వచ్చాయి. ఖమ్మం నుంచి వివిధ రంగాల వ్యాపారులు, విద్య, వైద్య సంస్థలు, వర్తక వ్యాపారులు, కాంట్రాక్టర్లు ముందుకొచ్చి రూ.1.75 కోట్లను మంత్రికి అందించారు. మమత వైద్య విద్యాసంస్థ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ భారీ మొత్తంలో రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఆ మొత్తం రూ.2 కోట్లకు సంబంధించి మంత్రి అజయ్‌కుమార్‌ సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను నేరుగా కలిసి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. అనంతరం ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలను మంత్రి సీఎంకు వివరించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం జరిపే పోరాటానికి అండగా నిలవడంలో దాతల సహాయం ఎంతో తోడ్పడగలదన్నారు. సీఎం పిలుపుతో తాను చేసిన విన్నపం మేరకు ఖమ్మం జిల్లాలో ముందుకొచ్చి విరాళాలను అందించిన దాతలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి మార్గ నిర్దేశాలతో కరోనా నియంత్రణకు డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు తెలంగాణ సమాజం మొత్తం హ్యాట్సప్‌ చెబుతోందన్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top