గ్యాస్‌ డెలి‘వర్రీ’ | Cooking Gas Distributing Delayed in Hyderabad | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ డెలి‘వర్రీ’

Dec 10 2018 9:38 AM | Updated on Jan 3 2019 12:17 PM

Cooking Gas Distributing Delayed in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో మళ్లీ వంట గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్‌ బుక్‌ చేసి పది రోజులు దాటినా రీఫిల్‌ ఇంటికి చేరడం లేదు. ప్రధాన చమురు సంస్థలైన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) డిస్ట్రిబ్యూటర్ల వద్ద సుమారు రెండున్నర లక్షలకు పైగా కాల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. మొబైల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రెండు పర్యాయాలు సిలిండర్‌ బుక్‌ చేస్తే తప్ప.. రీఫిల్‌ ఇంటికి చేరే పరిస్థితి లేదు. గ్యాస్‌ డిస్టిబ్యూటర్ల చేతివాటమో.. లేక డెలివరీ బాయ్స్‌ జమ్మిక్కులో  తెలియదు కానీ ‘డోర్‌లాక్‌’ లేకున్నా వంట గ్యాస్‌ సిలిండర్‌ మాత్రం సకాలంలో ఇంటికి రాని పరిస్థితి. కొన్ని సార్లు బుకింగ్‌ రద్దయింది మళ్లీ బుక్‌ చేయమని సంక్షిప్త సందేశం వస్తుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. డిస్టిబ్యూటర్‌కు ఫోన్‌ చేసి నిలదీస్తేగానీ సిలిండర్‌ ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. వాస్తవానికి గ్యాస్‌ సరఫరా కొరత లేనప్పటికీ పంపిణీదారులే కృతిమ కొరత సృష్టిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నగదు బదిలీ పథకం కింద వినియోగదారులకు ఏడాదికి 12 ఎల్పీజీ సిలిండర్లు సబ్సిడీపై సరఫరా చేయాలి. ఆపై తీసుకుంటే మాత్రం సబ్సిడీ వర్తించదు. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండడంతో నెల రోజుల నుంచి కాల్స్‌ పెండింగ్‌లో పడిపోవడం, బిల్లు జనరేట్‌ తర్వాత బుకింగ్‌ అటోమెటిక్‌గా రద్దు కావడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి.  

వాణిజ్య అవసరాలకు ఫుల్‌  
ప్రస్తుతం ఇంటి గ్యాస్‌ కొరత ఉన్నా.. వాణిజ్య అవసరాలకు మాత్రం సరఫరా భేషుగ్గా ఉంది. అడిగిందే తడవుగా రీఫిల్స్‌ హోటళ్లకు చేరుతున్నాయి. దీన్నిబట్టి గృహావసరాల సిలిండర్లు దారి మళ్లుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి వసరాలకు ఉపయోగపడాల్సిన గ్యాస్‌.. హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్ధల అవసరాలను తీరుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన వాణిజ్య కనెక్షన్లు 50 వేలకు మించిలేవు. నగరంలో పెద్ద హోటల్స్‌ 5 వేలకు పైగా ఉండగా, చిన్న చితకా హోటళ్లు టీ, టీఫిన్‌ సెంటర్లు సుమారు లక్షల వరకు ఉంటాయని అంచనా. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్‌లో వాణిజ్య పరమైన సిలిండర్లు వినియోగమవుతుండగా, చిన్నవాటిలో మాత్రం డొమెస్టిక్‌ సిలిండర్లే వినియోగిస్తున్నారు. దీంతో ప్రతిరోజు లక్షకు పైగా డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు  చిన్న సిలిండర్లలో సైతం డొమెస్టిక్‌ ఎల్పీజీ అక్రమంగా రీఫిల్లింగ్‌ అవుతోంది.

గ్యాస్‌ కొరత లేదు
ప్రస్తుతం గ్రేటర్‌లో వంట గ్యాస్‌ కొరత లేదు. బుక్‌ చేసిన రెండు, మూడు రోజుల్లో సిలిండర్లను డెలివరీ చేస్తున్నాం. డోర్‌లాక్, ఇతర సాంకేతిక కారణాలతో కొన్నిసార్లు బుకింగ్‌ రద్దవుతోంది. డిస్టిబ్యూటర్‌ దృష్టికి తీసుకొచ్చి తిరిగి బుక్‌ చేస్తే వెంటనే సిలిండర్‌ డెలివరీ చేస్తున్నాం.– అశోక్‌ కుమార్, అధ్యక్షుడు,వంట గ్యాస్‌ డీలర్ల సంఘం

Advertisement
 
Advertisement
Advertisement