టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటనే రైతు ఆత్మహత్యలను నివారించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు.
మంచాల: టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటనే రైతు ఆత్మహత్యలను నివారించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని శ్రీబుగ్గ రామలింగేశ్వర స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని దుయ్యబట్టారు.
అర్హులకు పింఛన్లు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వరకు సంక్షేమ పథకాలకు కోతపెట్టాలని చూస్తోందని పేరాల చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సర్కార్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించి అన్నదాత బలవన్మరణాలకు నివారించాలని కోరారు. నవంబర్ 30 బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతోందని.. కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా పరిధిలో 2.5 లక్షల మంది సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలమైన శక్తిగా మార్చాలని కార్యకర్తలకు సూచించారు.
బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క నర్సింహా రెడ్డి, రాష్ట్ర మజ్దూర్ మోర్చా ఉపాధ్యక్షుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొప్పు భాషా, మండల వైస్ చైర్మన్ దన్నె భాషయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, ఆరుట్ల సర్పంచ్ యాదయ్య తదితరులు ఉన్నారు.