కనీసం.. పిల్లనివ్వడం లేదు

Constables did not getting women to marry - Sakshi

ఒక కానిస్టేబుల్‌ వ్యథ

మనస్తాపంతో రాజీనామా చేసిన సిటీ కానిస్టేబుల్‌

పెళ్లి సంబంధాలకు ఎవరూ ముందుకు రావడం లేదని వెల్లడి

ఎదుగూబొదుగు లేని జీవితం.. 24 గంటల ఉద్యోగమంటున్నారు

ఆసక్తితో పోలీసు శాఖలో చేరా..ఆవేదనతో వీడుతున్నా

సాక్షి, హైదరాబాద్‌ : జీతాలు పెరిగినా తమ జీవితాలు మారలేదని అంటున్నారు కానిస్టేబుళ్లు. అనేక మంది ఈ స్థాయి నుంచి ఒక్క ప్రమోషనూ లేకుండా పదవీ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు కమిషనరేట్‌లో పని చేసే ఓ కానిస్టేబుల్‌ అనివార్య కారణాల వల్ల తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ ఆంగ్లంలో లేఖ రాశారు. చార్మినార్‌ ఠాణాలో పని చేస్తున్న సిద్ధాంతి ప్రతాప్‌ ఈ నెల7న బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఉన్న ఇన్‌వార్డ్‌ సెక్షన్‌లో రాజీనామా లేఖను అందించారు. నగర పోలీసు కమిషనర్‌ను ఉద్దేశించి రాసిన లేఖ ఇలా...

‘నా పేరు సిద్ధాంతి ప్రతాప్‌ (పీసీ నెం.5662) చార్మినార్‌ పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్నా. కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నా. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత 2014లో కానిస్టేబుల్‌గా చేరా. పోలీసు డిపార్ట్‌మెంట్‌ మీద ఉన్న అమితాసక్తితో అడుగుపెట్టిన నేను నా విధుల్ని త్రికరణ శుద్ధితో నిర్వహిస్తున్నా. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నా. 

కొన్నాళ్లుగా నా సీనియర్లను పరిశీలించిన నేపథ్యంలో అనేక మంది 35 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నా కానిస్టేబుల్‌గానే పదవీ విరమణ చేస్తున్న విషయాన్ని గుర్తించా. ఇలాంటి సర్వీసు ఉన్న వారికి ఇతర విభాగాల్లో స్పెషల్‌ గ్రేడ్‌ ఇంక్రిమెంట్‌ లభిస్తోంది. సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ ఆపై స్థాయి అధికారులకు పదోన్నతులతో పాటు వాహనం, పెట్రోల్‌ అలవెన్సులు వంటి ఇతర సౌకర్యాలు ఉన్నా.. కానిస్టేబుళ్లకు అలాంటివి మచ్చుకైనా లేవు. 

ప్రస్తుతం నా వయస్సు 29 ఏళ్లు కావడంతో వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా. నేను కానిస్టేబుల్‌ అని తెలియడంతో ఓ సంబంధం చెడిపోయింది. ఆ తర్వాత నా బంధువుల ద్వారా ఆ యువతి నన్ను తిరస్కరించడానికి కారణాలు ఏమిటని అడిగా. కానిస్టేబుళ్లు 24 గంటలూ పని చేయాల్సి వస్తుందని, సరైన బాధ్యతలకు ఆస్కారం ఉండదని, అదే హోదాలో పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని, ఆ ఉద్యోగంలో ఎదుగుబొదుగూ ఉండదని యువతి భావించినట్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నేను తీవ్రంగా మనస్తాపం చెందడంతో పాటు నా ఉద్యోగం పట్ల డిప్రెస్‌ అయ్యా. ఈ నేపథ్యంలోనే నా రాజీనామా ఆమోదించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.’అని రాశారు.

ఇబ్బందులు నిజమే...
పోలీసు విభాగంలో కలకలం సృష్టించిన ఈ విషయంపై పోలీసు అధికారుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సిబ్బంది సంఖ్యతో ఉన్న ఇబ్బంది వల్ల వీక్లీ ఆఫ్‌ల విధానం అమలుకావట్లేదని చెప్తున్నారు. మరోపక్క ఎస్సై, డీఎస్పీ ఆపై పోస్టులు రిక్రూట్‌మెంట్‌ ప్రతి బ్యాచ్‌లోనూ గరిష్టంగా 500లోపే జరుగుతుంది. అందుకే వీరి సర్వీసులో పదోన్నతులు తేలిగ్గా లభిస్తాయి. కానిస్టేబుళ్ల ఎంపిక ఒక్కో బ్యాచ్‌కు వేల సంఖ్యలో ఉంటుంది. ఆ స్థాయిలో పై పోస్టులు ఉండవు. అందుకే ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత తయారు చేసిన మెరిట్‌ జాబితా ఆధారంగా పదోన్నతులు వచ్చినా అనేక మంది కానిస్టేబుల్‌గానే రిటైర్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ వారిని ఇబ్బంది పెడుతున్నాయి అని ఓ అధికారి అన్నారు.ప్రస్తుతం పోలీసు విభాగంలో వారికి లభిస్తున్న జీతం ఆధారంగా చూస్తే గరిష్టంగా రూ.1 లక్ష వరకు నెలసరి తీసుకునే కానిస్టేబుళ్లు ఉన్నారని, పదోన్నతులు రాకపోయినా ఇంక్రిమెంట్లు మాత్రం ఆగవన్నారు. ప్రతాప్‌ రాజీనామాను ఆమోదించే ఆలోచన లేదని, అతనికి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top