కాంగ్రెస్‌.. వ్యూహాత్మకం!

Congress Party   Strategic  On  Nalgonda  Parliament Seat - Sakshi

నల్లగొండ నుంచి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ పోటీ

ఐదు సార్లు ఎమ్మెల్యేకు అగ్నిపరీక్ష

నల్లగొండ ఎంపీ స్థానంపై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి  

సాక్షిప్రతినిధి, నల్లగొండ : పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ సీనియర్లకే టికెట్లు దక్కాయి. ముందునుంచీ ప్రచారానికి భిన్నంగా పార్టీ నాయకత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. తమకు పట్టున్న జిల్లాలో, ఆ పట్టును కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా తమ అభ్యర్థులను ఎంపిక చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నల్లగొండ నుంచి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యర్థిత్వాలను కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా తమకు బాగా పట్టున్న నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం (పూర్వపు మిర్యాలగూడ నియోజకవర్గంలోని సెగ్మెంట్లు నల్లగొండలో కలిశాయి)లో తమకు గెలుపునకు అవకాశాలు మెండుగా ఉంటాయన్న అంచనాతో అభ్యర్థుల ఖరారు విషయంలో సకల జాగ్రత్తలు తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవడం లేదని, ఇక్కడి స్థానాన్ని దక్కించుకునేందుకు సీరియస్‌గానే ఉన్నామన్న సంకేతాలను పంపించేందుకే ఏకంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని బరిలోకి దింపుతోందని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో నల్లగొండనుంచి కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో గెలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ ఎన్నికల్లో అనుకూలంగా పవనాలు వీచినా, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏకంగా ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు, నల్లగొండ పార్లమెంట్‌ స్థానాన్ని అత్యధికంగా 1.93లక్షల మెజారిటీతో కైవసం చేసుకుంది.

దీంతో తమ ఓటు బ్యాంకు ఎంత బలమైందో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నిరూపించుకుంది. కానీ, 2018 అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం హుజూర్‌నగర్‌ మాత్రమే నిలబెట్టుకుని మిగిలిన ఆరు స్థానాలు కోల్పోయింది. వాటిని టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. కానీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఆ అవకాశం ఇవ్వకుండా గట్టి అభ్యర్థిని పోటీకి పెట్టాలన్న వ్యూహంలో భాగంగానే పీసీసీ సారథిని నిలబెడుతున్నారని పేర్కొంటున్నారు. 

కాంగ్రెస్‌కు... అగ్నిపరీక్ష
ఈ పార్లమెంటు ఎన్నికల్లో వాస్తవానికి కాంగ్రెస్‌కు ఒక విధంగా అగ్నిపరీక్షే కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ గెలవగా, ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చిన  మెజారిటీ 1,07,601 ఓట్లు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించినా.. అక్కడి గెలిచిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కేవలం 7,466 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది.

ఈ మెజారిటీని మినహాయించి చూసినా.. టీఆర్‌ఎస్‌ లక్ష ఓట్ల మెజారిటీని కలిగి ఉంది. అంతే కాకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా ఆరుగురు ఎమ్మెల్యేలు నిలవనుండగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఒక విధంగా ఒంటరి పోరు చేయాల్సిందే. గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. నాటి ఎంపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్ల మెజారిటీని పోలిస్తే.. టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌లు సమ ఉజ్జీలుగా ఉన్నట్టే లెక్క.

 అంతే కాకుండా నాగార్జున సాగర్,  కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌కు స్వల్ప ఆధిక్యమే వచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం తమదే అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరో తేలిపోతే పోటీపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top