చేతులెత్తేసిన కాంగ్రెస్‌

Congress Party Is Failed In Telangana Panchayat Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తేరుకోలేక పోతోంది. అసెంబ్లీ ఫలితాల అనంతరం ఓటమిని అంగీకరిస్తూనే... స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పిన పలువురు ఓడిపోయిన అభ్యర్థులు ఆ దిశగా చేసిన ప్రయత్నాలేవీ లేవు. ఒకరిద్దరు నాయకులు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే బలమైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహిస్తున్నారే తప్ప అనేక చోట్ల ఆ పార్టీ  ఉనికి ప్రశ్నార్థకమైంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 1503 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, మొదటి విడత 511 పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ మొదటి విడత ఎన్నికల్లో ఏకంగా 133 పంచాయతీల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీరిలో మెజారిటీ స్థానాలు టీఆర్‌ఎస్‌ బలపరిచిన నాయకులే కావడం గమనార్హం. ఇక ఎన్నికలు జరిగిన 378 పంచాయతీల్లో కూడా టీఆర్‌ఎస్‌ వాటా 80 శాతానికి పైగానే ఉంది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవం, ఎన్నికలు జరిగిన స్థానాలు కలుపుకొని గెలిచింది కేవలం 62 పంచాయతీలే. అంటే మొత్తం పంచాయతీల్లో 12 శాతం మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్‌ కన్నా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ సీట్లలో గెలుపొందడం విశేషం.

ఆసక్తి చూపని కాంగ్రెస్‌ నేతలు
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కచ్చితంగా గెలుస్తుందని భావించిన సీట్లలో కూడా గులాబీ జెండా ఎగరడంతో పలు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు జీర్ణించుకోలేక పోయారు. కోట్లాది రూపాయలు వెచ్చించినా, ఫలితం నిరాశపర్చడంతో తేరుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో కొలువు తీరకముందే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండడంతో పోటీ చేసిన అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు.

కొన్ని గ్రామాల్లో తమకు నమ్మకస్తులని భావించిన నాయకులు, గెలిచే అవకాశం ఉన్న వారికి మాత్ర మే కొంత మేర అందుబాటులో ఉంటున్నారు. మొదటి విడత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం వీయగా, రెండు, మూడవ విడతల్లో సైతం అదే పరిస్థితి పునరావృతం అవుతుందని తెలుస్తోంది. రెండు, మూడు విడతల్లో ఏకగ్రీవం అయిన సర్పంచు స్థానాల్లో 90 శాతం వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఉండడంతో ఎన్నికలు జరిగే గ్రామాల్లో కూడా అదే తీరు ఉండబోతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పంచా యతీ ఎన్నికలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. 

కాంగ్రెస్‌కు బలమైన పంచాయతీల్లో సైతం...

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ ఇచ్చిన స్థానాలపై కూడా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు కన్నేశారు. ఈ మేరకు ఆ పంచాయతీలను కూడా కైవసం చేసుకునేందుకు పావులు కదిపారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ధీటుగా పోటీ ఇచ్చిన కాంగ్రెస్, స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది కూడా. ఇక్కడ అత్రం సక్కు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, రెండు, మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు ఒకటి రెండు మాత్రమే దక్కడం గమనార్హం. ఓడిపోయినప్పటికీ, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పంచాయతీలను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. బలమైన అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ మద్ధతుదారులుగా పోటీలో నిలిపారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన నిర్మల్, బోథ్‌ నియోజకవర్గాలలో సైతం పంచాయతీలు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఎక్కువ దక్కాయి. బెల్లంపల్లిలో బీఎస్‌పీ నామమాత్రంగా మిగిలిపోయింది.

101 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీఎస్‌పీ పేరుతో మాజీ మంత్రి గడ్డం వినోద్‌ మద్దతిచ్చిన 10 మంది మాత్రమే గెలిచారు. మిగతా అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే సర్పంచులుగా గెలిచారు. మూడవ విడత నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత పరిస్థితిని గమనిస్తే 25, 30 తేదీల్లో జరిగే ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ హవానే కొనసాగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కాగా స్వతంత్రులుగా గెలిచిన సర్పంచులు కూడా టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపనుండడం, గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం కాంగ్రెస్‌ సర్పంచులు సైతం తమవైపే వస్తారని ఎమ్మెల్యేలు ఆశాభావంతో ఉండడంతో గ్రామాల్లోని పాలకమండళ్లలో కూడా మరో ఐదేళ్ల వరకు గులాబీ గుబాలింపు తప్పదని అర్థమవుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top