ఒక్క చాన్స్‌!

Congress Leaders  Competition For MLA Tickets Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: బరిలో నిలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల కోసం పోటీ పెరుగుతోంది. నాకంటే నాకు టికెట్‌ కేటాయించాలంటూ రాజధాని స్థాయిలో నాయకులు బలప్రదర్శనకు దిగుతుండటం జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. వివిధ పార్టీలతో కాంగ్రెస్‌ ఏర్పాటు చేయనున్న మహాకూటమి వల్ల తమ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కోల్పోకుండా చూసుకునేందుకు వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్‌ నేతలు ఒక్క చాన్స్‌ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరేందుకు హైదరాబాద్‌ బాట పట్టారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలో పలు పక్షాలు మహాకూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ తరుణంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న నేతలు తమ నియోజకవర్గంలో మరో పార్టీకి టికెట్‌ ఇవ్వొద్దంటూ కాంగ్రెస్‌ అధిష్టానానికి మొరపెట్టుకునేందుకు బారులు తీరుతున్నారు.
 
2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు కుదుర్చుకుని.. జిల్లాలోని పది నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ అభ్యర్థి కె.నారాయణ పోటీ చేసి ఓటమి చెందగా.. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ మద్దతుతో మాజీ మంత్రి బలరాంనాయక్‌ పోటీ చేసి ఓడిపోయారు. ఇక 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు.. వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో సీపీఐ.. కాంగ్రెస్‌ మద్దతుతో పోటీ చేసింది. మిగతా ఏడు నియోజకవర్గాల్లో సీపీఐ మద్దతుతో కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో దిగి ఖమ్మం, పాలేరు, ఇల్లెందు, మధిర నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇదే పద్ధతిలో ఈసారి జరిగే ఎన్నికల్లో సైతం సీపీఐ, కాంగ్రెస్‌ ఎన్నికల మైత్రి కొనసాగుతుందని భావించినా.. రాష్ట్రస్థాయిలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీతో చేయి కలపడానికి ఇటు టీడీపీ, అటు తెలంగాణ జన సమితి సిద్ధం కావడంతో ఏ పార్టీ ఎక్కడి నుంచి టికెట్లు ఆశిస్తుందో.. తమకు పోటీ చేసే అవకాశం ఏ రకంగా కోల్పోవాల్సి వస్తుందోననే ఆందోళన కాంగ్రెస్‌ ఆశావహుల్లో పెల్లుబుకుతోంది.
 
విన్నవించే పనిలో నాయకులు.. 
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను, ఓట్లను ప్రామాణికంగా తీసుకుని ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించవద్దని, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ఏ పార్టీకి బలముంటే ఆ పార్టీకి టికెట్‌ కేటాయిస్తేనే కాంగ్రెస్‌కు జిల్లాలో పునరుజ్జీవం కలుగుతుందని కాంగ్రెస్‌ ఆశావహులు నియోజకవర్గాలవారీగా వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, పలువురు రాష్ట్ర నేతలను కలిసి విన్నవించే పనిలో పడ్డారు. రెండు రోజులుగా అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాలకు చెందిన పలువురు ఆశావహులు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో సహా హైదరాబాద్‌ వెళ్లారు. తమ నియోజకవర్గాలను ఇతర పార్టీలకు కేటాయించకుండా కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలోకి దించితే గెలిపించి తీసుకొస్తామని భరోసా ఇస్తుండడంతో పార్టీ నేతలు ఆశావహులకు ఎలా నచ్చజెప్పాలో పాలుపోక ఆయా అభ్యర్థులను పరిశీలిస్తామని చెబుతున్నారు.

అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలను ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ కోరుతుండడం.. పొత్తు ఉండడంతో ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న కాంగ్రెస్‌ నేతలు ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు గల ఆదరణ, టీడీపీ బలహీనపడిన తీరును ఓట్ల లెక్కలతో సహా పార్టీ నేతల ముందు ఉంచడం విశేషం. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకే అవకాశం ఇవ్వాలని, పొత్తులో టీడీపీకి కేటాయించవద్దని కోరుతూ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆశావహులు సున్నం నాగమణి, కారం శ్రీరాములు, దంజునాయక్‌ తదితరుల నేతృత్వంలో కార్యకర్తలు హైదరాబాద్‌కు వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడికి ఇక్కడి రాజకీయ పరిస్థితులను వివరించారు. గతంతో పోలిస్తే టీడీపీ ఇక్కడ బలహీనపడిందని, ఎక్కువ మంది కార్యకర్తలు మాజీ మంత్రి తుమ్మలను అనుసరిస్తున్నారని, అక్కడ బలమైన పార్టీ కాంగ్రెస్‌ మాత్రమేనని వారు తమ వాదనను వినిపించారు.
 
వైరాపై పట్టు.. 
వైరా నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మిత్రపక్షాల పొత్తులో భాగంగా సీపీఐ పోటీ చేయగా.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కే వైరా సీటు కేటాయించాలంటూ అక్కడి కాంగ్రెస్‌ నేతలు పట్టుపడుతున్నారు. టికెట్‌ ఆశిస్తున్న నేతలతోపాటు పలువురు కార్యకర్తలు తమ మనోభావాలను పార్టీ అధిష్టానానికి తెలియజేసేందుకు వారం రోజుల క్రితం మాజీ పోలీస్‌ అధికారి, వైరా నుంచి టికెట్‌ ఆశిస్తున్న రాములునాయక్‌ నేతృత్వంలో గాంధీ భవన్‌ వద్ద ఆందోళన నిర్వహించగా.. తాజాగా కాంగ్రెస్‌ నుంచి లకావత్‌ గిరిబాబు నాయకత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివెళ్లి.. కాంగ్రెస్‌ పోటీ చేస్తే వైరాలో విజయం సాధించడం ఖాయమంటూ వివరించారు. ఎన్నికల పొత్తులో కాంగ్రెస్‌ సీటు చేజార్చుకోవడం సబబు కాదని, గత ఎన్నికలకు ఇప్పటికి రాజకీయంగా అనేక మార్పులు సంభవించాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని పరిశీలించి కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఉత్తమ్‌ ముందు తమ వాదన వినిపించారు. అలాగే వైరా నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న మంగీలాల్‌ సైతం టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి కాంగ్రెస్‌కు గల సానుకూలతను వివరించారు.
 
ఉత్కంఠ రేపుతున్న కొత్తగూడెం సీటు 
ఇక ఉమ్మడి జిల్లాలో అత్యధిక రాజకీయ ప్రాధాన్యం కలిగిన కొత్తగూడెం నియోజకవర్గంలో ఎన్నికల పొత్తు ఎవరికి మోదం.. మరెవరికి ఖేదం కానుంది.. అనే అంశం రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్‌ కూటమిలోని ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు ఈసారి కొత్తగూడెం స్థానాన్ని తమకంటే తమకు కేటాయించాలని పట్టుపట్టడంతోపాటు తమకున్న రాజకీయ పరిచయాల ద్వారా పార్టీ నేతలపై ఒత్తిడి తేవడంతో ఈస్థానం నుంచి మిత్రపక్షాల అభ్యర్థి ఎవరు అవుతారన్న అంశం ఆసక్తి రేపుతోంది. కొత్త గూడెం అసెంబ్లీ స్థానాన్ని ఈ దఫా కాంగ్రెస్‌కే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్ర, జెడ్పీటీసీ పరం జ్యోతి నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు హైదరాబాద్‌ తరలివెళ్లి కొత్తగూడెంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్‌కు టికెట్‌ లభిస్తే విజయం సునాయాసం అవడానికి గల అవకాశాలను వివరించినట్లు సమాచారం.

నియోజకవర్గాల్లో పార్టీల బలాబలా లను బేరీజు వేసుకుని కాంగ్రెస్‌ నేతలకు న్యాయం చేయాలని, ఈసారి కొత్తగూడెం నుంచి కాంగ్రెస్‌ పోటీ చేయకపోతే పార్టీ శ్రేణులకు నిరాశ నిçస్పృహ కలగడంతోపాటు పనిచేసే వారికి గుర్తింపు లేదన్న సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు వాదించినట్లు తెలుస్తోంది. ఇక ఇల్లెందు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న పార్టీ నాయకుడు దళ్‌సింగ్‌ టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకున్న తనకు ఈసారి అవకాశం కల్పించాలని, కాంగ్రెస్‌ పార్టీ ఇల్లెందులో విజయం సాధించడానికి అనేక సానుకూల పరిస్థితులు దోహదం చేయనున్నాయని, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. దీంతో టీడీపీ, సీపీఐ కోరుతున్న స్థానాలపై కాంగ్రెస్‌ నేతలు సైతం గట్టి పట్టుపట్టడంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం, వారిని విజయపథంలో నడిపించడం మహాకూటమికి కత్తిమీద సామేనన్న ప్రచారంజరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top