ఎక్కడ ఎవరు పోటీ...?

Congress Confident Of Winning Next Election Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా కేంద్రీకృతమై ఉన్న పార్టీ కమిటీ (డీసీసీ)లను కొత్త జిల్లాల స్థాయిలో విస్తరించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు కమిటీలు ఏర్పాటు చేయాల్సిన జిల్లాల జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఈనెల 4న అధికారికంగా ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 13, 14 తేదీల్లో జరిపే రాష్ట్ర పర్యటన ముగిసిన వెంటనే పార్టీ కమిటీలను కొత్త జిల్లాల వారీగా ప్రకటించేందుకు పీసీసీ స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలోని నాలుగు జిల్లాలకు కూడా డీసీసీలను ఏర్పాటు చేయనున్నారు.  ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడుగా నిర్మల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.

రెండు గ్రూపులు... అధ్యక్షుల కోసం పోటాపోటీ
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క వర్గంగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఉమ్మడి జిల్లా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల నుంచే డీసీసీ పదవుల కోసం రెండు వర్గాలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలో నిర్మల్‌ జిల్లా ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డికి పెట్టనికోటగా ఉందనడంలో సందేహం లేదు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన నిర్మల్‌కు ప్రాతినిథ్యం వహిస్తారా అనేది అనుమానమే. ఒకవేళ ఆయన డీసీసీ అధ్యక్ష పదవిని కాదనుకుంటే ఆయన ఎవరి పేరు చెపితే వారికే ఆ పదవి వస్తుందనడంలో సందేహం లేదు. అయితే మిగతా మూడు జిల్లాల్లో ఆ పరిస్థితి లేదు. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, పీసీసీ స్థాయిలో వర్గాలు అధ్యక్ష పదవి విషయంలో ప్రభావం చూపే అవకాశం ఉంది.

మంచిర్యాలలో అధ్యక్ష పదవికి హోరాహోరీ
మంచిర్యాలలో డీసీసీ అధ్యక్ష పదవికి రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వానికి ముడిపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డితో పాటు భట్టి వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఈ పరిస్థితిల్లో డీసీసీ అధ్యక్ష పదవిని అరవింద్‌రెడ్డికే ఇవ్వాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి కూడా మంచిర్యాల విషయంలో అరవింద్‌రెడ్డికే డీసీసీ పీఠం దక్కేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

అదే సమయంలో ప్రేంసాగర్‌రావు తన సతీమణి కొక్కిరాల సురేఖను తెరపైకి తెస్తున్నారు. డీసీసీ పదవిని మహిళకు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆయన వర్గీయులు సురేఖను డీసీసీ అధ్యక్షురాలిగా నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకునే పక్షంలో బీసీ అభ్యర్థిగా బెల్లంపల్లి జెడ్పీటీసీ కె.రాంచందర్‌కు ఆ పదవిని ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. సురేఖ లేదా రాంచందర్‌ లలో ఒకరు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అవుతారని ఆయన వర్గం బాహాటంగానే ప్రచారం సాగిస్తోంది.
 
ఆదిలాబాద్‌లో అదే తీరు
ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన భార్గవ్‌ దేశ్‌పాండే ప్రస్తుతం మహేశ్వర్‌రెడ్డి శిబిరంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి టిక్కెట్టు ఆశిస్తున్న ఆయన డీసీసీ పీఠంపై కన్నేశారు. ఆయనకు మహేశ్వర్‌రెడ్డి మద్దతు పుష్కలంగా ఉంది. అదే సమయంలో గతంలో పోటీచేసి ఓడిపోయిన గండ్రాత్‌ సుజాత కూడా ఈసారి పోటీకి సిద్ధపడుతున్నారు. భట్టి వర్గంలో ఉన్న ఆమెకు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మద్దతిస్తున్నారు. మహిళ కోటాలో మంచిర్యాలలో సురేఖతో పాటు ఆదిలాబాద్‌లో సుజాతకు డీసీసీ పీఠం దక్కేలా పావులు కదుపుతున్న ఆయన ఈ రెంటిలో ఒక చోటైనా తన మాటను చెల్లుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూడా టిక్కెట్టు కోసం పోటీపడుతున్నప్పటికీ, డీసీసీ పోరులో లేరని సమాచారం.

కుమురంభీంలో బహుముఖ పోటీ
కుమురంభీం జిల్లాలో డీసీసీ పీఠంపై ఆసిఫాబాద్, సిర్పూర్‌ నియోజకవర్గాల నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న నలుగురు నాయకులు కన్నేశారు. ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టిక్కెట్టు రేసులో ముందున్న ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు మద్దతుతో డీసీసీ పీఠం దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన కాని పక్షంలో గిరిజనేతరుడి కోటాలో సిర్పూర్‌కు చెందిన రావి శ్రీనివాస్‌కు పదవి ఇప్పించేందుకు ప్రేంసాగర్‌రావు ప్రయత్నిస్తున్నారు.

అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ వర్గంలో ఉన్న సిర్పూర్‌ నాయకుడు బీసీ కోటాలో గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్‌ సిడాం గణపతి ఎస్టీ కోటాలో డీసీసీ పీఠంపై కన్నేశారు. వీరిద్దరికి మహేశ్వర్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ఉండడం గమనార్హం. కొత్త జిల్లాల వారీగా డీసీసీల నియామకం ఉమ్మడి జిల్లాలో వర్గాల ఆధిపత్యాన్ని తేటతెల్లం చేయనున్నాయి. దీంతో రాజకీయ వర్గాలన్నీ డీసీసీల ఏర్పాటుపైనే దృష్టి కేంద్రీకరించాయి. 

  • ఆదిలాబాద్‌ : భార్గవ్‌ దేశ్‌పాండే, గండ్రత్‌ సుజాత
  • మంచిర్యాల : గడ్డం అరవిందరెడ్డి, కె.ప్రేంసాగర్‌రావు
  • కుమురం భీం : ఆత్రం సక్కు, రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస యాదవ్, సిడాం గణపతి
  • నిర్మల్‌ : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి లేదా ఆయన సూచించిన వారు
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top