‘క్లినికల్‌’ బాధితులు ఎందరో

comprehensive inquiry on Clinical trials - Sakshi

ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న వైనం

తాజాగా హుజూరాబాద్‌లో మరో ఉదంతం

సమగ్ర విచారణకు మంత్రి ఈటల ఆదేశం

పలు కంపెనీలపై మూడు కేసులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  పేదలు, అమాయకుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా జరిగిన ‘ఔషధ ప్రయోగం (క్లినికల్‌ ట్రయల్స్‌)’ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నిబంధనలు, మార్గదర్శకాలను తుంగలో తొక్కి నిర్వహించిన ఔషధ ప్రయోగాల కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన మరో బాధితుడు యెర్ర దేవీప్రసాద్‌ వ్యథ వెలుగుచూసింది.

హైదరాబాద్‌లోని పలు సంస్థల్లో ఔషధ ప్రయోగాలకు అంగీకరించిన ఆయన.. ఇప్పుడు మానసిక వ్యాధి బారిన పడ్డాడు. తనను ఓ ఏజెంట్‌ బాలానగర్‌లోని ఓ ల్యాబొరేటరీకి తీసుకెళ్లాడని.. అక్కడ కొన్ని నొప్పులకు సంబంధించిన గోలీల కోసం ప్రయోగం చేస్తామని వారు చెప్పినట్లు దేవీప్రసాద్‌ పేర్కొన్నాడు. ఇందుకు రూ.6 వేలు ఇస్తామన్నారని, శరీరానికి ఎలాంటి నష్టం ఉండదని చెప్పగా ఒప్పుకున్నట్లు వెల్లడించాడు.

ఇలా క్లినికల్‌ ట్రయల్స్‌ ఉచ్చులో చిక్కిన దేవీప్రసాద్‌ హైదరాబాద్‌లోని మియాపూర్‌లోని ఓ రీసెర్చ్‌ కేంద్రంలో నాలుగేళ్లలో 10 సార్లు ప్రయోగాలకు వెళ్లాడు. గతంలో తార్నాకలోని ఓ ల్యాబ్‌లో ఆరుసార్లు ప్రయోగాలు చేశారని దేవీప్రసాద్‌ వెల్లడించాడు. చివరగా చర్లపల్లిలోని విమ్‌టా క్లినికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు వెళ్లగా అక్కడ జరిపిన ఔషధ ప్రయోగాలతో ఆరోగ్యం క్షీణించిందని, మరో ప్రయోగానికి అర్హుడు కాదని తేల్చినట్టు తెలిపాడు. ఇంటికి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురవడంతో అతడిని తల్లిదండ్రులు వరంగల్‌లోని ఎంజీఎంకు తీసుకెళ్లారు. దేవీప్రసాద్‌ మానసిక వ్యాధికి గురయినట్లు వైద్యులు ధ్రువీకరించారని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

సమగ్ర విచారణకు ఆదేశం
హద్దులు దాటిన ఔషధ ప్రయోగం ఘటనలపై ప్రభుత్వం స్పందించింది. మంత్రి ఈటల రాజేందర్‌ ఈ క్లినికల్‌ ట్రయల్స్‌పై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇప్పటివరకు వెలుగుచూసిన బాధితులంతా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన వారే కావడంతో మంత్రి దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దోషులను శిక్షించాల్సిందేనని ఆదేశించడంతో కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. క్లినికల్‌ ట్రయల్స్‌తో మృతి చెందిన వంగర నాగరాజు, అశోక్‌కుమార్, బోగ సురేశ్‌లపై ఔషధ ప్రయోగం చేసిన లోటస్, విమ్‌టా తదితర సంస్థలపై పోలీసులు మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top