
సరికొత్త వ్యాక్సిన్ ∙
అతి త్వరలో అందుబాటులోకి!
పెద్ద పేగు, బ్రెయిన్, చర్మ క్యాన్సర్లపై దివ్యాస్త్రమే
పరీక్షల్లో 80 శాతం దాకా తగ్గిన క్యాన్సర్ గడ్డలు
మాస్కో: క్యాన్సర్. ఏటా లక్షల మందిని పొట్టన పెట్టుకుంటున్న ప్రపంచవ్యాప్త మహమ్మారి. సరైన చికిత్స లేక జీవితాంతం క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు కోకొల్లలు. అలాంటి ప్రాణాంతక వ్యాధి నివారణకు రష్యా సైంటిస్టులు నూతన టీకా (వ్యాక్సిన్)ను అభివృద్ధి చేశారు. దీనిపై ఇప్పటికే ఏడాదిపాటు పరిశోధనలు, మూడేళ్లపాటు ముందస్తు క్లినికల్ ట్రయల్స్ జరిగాయి.
త్వరలో క్లినికల్ ప్రయోగాలు జరపనున్నట్టు తయారీ సంస్థ ఫెడరల్ మెడికల్, బయోలాజికల్ ఏజెన్సీ (ఎఫ్‌ఎంబీఏ) వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కు ‘ఎంటెరోమిక్స్’ అని పేరుపెట్టారు. కొన్ని రకాల కోవిడ్–19 నివారణ టీకాల తరహాలోనే దీని అభివృద్ధికి ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని వాడారు. వ్యాక్సిన్ల అభివృద్ధికి సాధారణంగా నిర్జీవ వైరస్‌ను ఉపయోగిస్తారు. కానీ ఎంఆర్‌ఎన్‌ఏతో తయారైన టీకాలు మాత్రం శరీర కణాలే ప్రొటీన్లను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి.
అలా రూపొందించిన ఈ కొత్త టీకాతో శరీరంలో ఉత్పత్తయ్యే ప్రొటీన్లే క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసేలా రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు వెల్లడైంది. దీన్ని పలుమార్లు తీసుకున్నా శరీరంలో దు్రష్పభావాలేవీ కనిపించడం లేదని, పైగా అత్యంత ప్రభావవంతంగా పని చేస్తోందని తేలింది.
ఈ వ్యాక్సీన్ పూర్తి సురక్షితమని పరిశోధకులు హామీ ఇస్తున్నారు. పలు కేసుల్లో క్యాన్సర్ గడ్డల పరిమాణాన్ని ఈ వ్యాక్సిన్ ఏకంగా 60 శాతం నుంచి 80 శాతం దాకా తగ్గిస్తున్నట్లు వెల్లడైంది! ప్రధానంగా పెద్ద పేగు, బ్రెయిన్, చర్మ క్యాన్సర్‌కు ఇది రామబాణమేనని అంటున్నారు. రష్యాలోని వ్లాడివోస్తోక్‌లో 10వ తూర్పు ఆర్థిక వేదిక సదస్సులో ‘ఎంటెరోమెక్స్’ టీకా గురించి ప్రకటించారు. 75 దేశాలకు చెందిన 8,400 మంది పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.