అంచెలంచెలుగా ఎదిగాడు

Common Man Life Story In Sakshi

కష్టాలు శాశ్వతం కావని  నమ్మకంతో ముందుకెళ్లాడు. ఇంటర్‌ ఫెయిలైనా డోంట్‌కేర్‌ అని.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వస్త్రవ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆదాయం అంతంతే ఉండడంతో పౌల్ట్రీఫాంలో గుమాస్తాగా చేరి.. యజమాని స్థాయికి ఎదిగాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లాడు. తాను ఉపాధి పొందడమే కాకుండా పలువురికి జీవనోపాధి చూపుతున్నాడు నుస్తులాపూర్‌కు చెందిన బుదారపు శ్రీనివాస్‌.

 అమానకొండూర్‌: మా అమ్మనాన్నలకు మేము ఐదుగురు సంతానం. నేను అందరికంటే చిన్నవాడిని. మా నాన్న లక్ష్మయ్య నిత్యం సైకిల్‌పై బట్టల మూట పెట్టుకొని గ్రామాలకు వెళ్లి అమ్మివస్తేనే మా కుటుంబం గడిచేది. 1985లో పదోతరగతి పాసైన తర్వాత నాన్నకు తోడుగా నేను కూడా వస్త్ర వ్యాపారం చేశాను. ఈక్రమంలో ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యాను. తర్వాత చదువును వదిలేసిన. బట్టల వ్యాపారంలో పెద్దగా ఆదాయం లేకపోవడంతో పౌల్ట్రీఫాంలో గుమాస్తాగా చేరిన. ఇక్కడే ఫాం ఎలా నిర్వహించాలోఅవగాహనకు వచ్చిన. తర్వాత తిమ్మాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఓ చిన్న పౌల్ట్రీఫాంను లీజుకు తీసుకున్న. అందులో వచ్చిన ఆదాయంతో పర్లపల్లి శివారులో స్థలం కొని సొంతంగా పౌల్ట్రీఫాం ప్రారంభించిన.

ఐదు వేల కోడి పిల్లలతో.. 
ఐదు వేల కోడి పిల్లలతో ప్రారంభించిన ఫాంలో నేడు 50 వేల కోళ్లు పెంచుతున్న. నా భార్య ప్రేమలత కూడా ఫాం నిర్వహణలో సహాయం చేస్తుంటుంది. ప్రస్తుతం ఫాంలో 25 మంది కూలీలు రోజు పనికి వస్తుంటారు. వీరికి నెలకు రూ.లక్ష వరకు వేతనం చెల్లిస్తున్న.
  
వ్యవసాయంలోనూ ఆదర్శం  
ప్రకృతి సహకరించక పౌల్ట్రీఫాంలో ఒకవేళ నష్టాలు వస్తే పరిస్థితి తారుమారు కావద్దనే ముందుచూపుతో ఎనిమిదెకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టిన. వరి, కూరగాయాలు సాగుచేస్తున్న. మరో 20 మంది కూలీలకు నిత్యం ఉపాధి కల్పించిన.
  
ఫెయిల్యూర్‌తో బాధపడొద్దు 
చదువులోనైన, జీవితంలోనైన ఒక్కసారి ఫెయిల్‌ అయితేనే బాధపడి కూర్చోవద్దు. మనవంతుగా ప్రయత్నిస్తూనే ఉండాలి. సాధించాలనే తపనతో ముందుకెళ్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాం.  
– బుదారపు శ్రీనివాస్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top