జబ్బొచ్చినా.. జ్వరమొచ్చినా.. నిలువుదోపిడి! | Seasonal diseases: Hospitals and private labs looty in Vizianagaram district | Sakshi
Sakshi News home page

జబ్బొచ్చినా.. జ్వరమొచ్చినా.. నిలువుదోపిడి!

Jul 14 2025 12:54 PM | Updated on Jul 14 2025 1:18 PM

Seasonal diseases: Hospitals and private labs looty in Vizianagaram district

స్కానింగ్, వైద్య పరీక్షల పేరిట..

రోగికి అవసరం లేకున్నా రాస్తున్న వైనం!

సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ కోసం రూ.వేలల్లో ఖర్చు

అనుమతుల్లేకుండా కొన్ని ల్యాబ్‌ల నిర్వహణ    

విజయనగరం ఫోర్ట్‌:  వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య క్రమేణ పెరుగుతోంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల తో పాటు అటు ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఇక్కడ వరకు ఓకే.. తరువాతే వైద్యులు రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. తలనొప్పి, జ్వరం అని వెళ్లినా... రూ.వేలల్లో ఖర్చయ్యేలా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చేసేది లేక భయంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ రూ.వేలల్లో రోగులను దోచుకుంటున్నారు. సేవకు పరమార్ధంగా ఉండాల్సిన కొందరు వైద్యులు ధనార్జనే ధ్యేయంగా మారడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ పరీక్షలు చేయించుకోలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. వచ్చే రోగాలకు స్కానింగ్, పలు రకాల పరీక్షలు అవసరం లేకున్నా వైద్యులు రాసేస్తుండడంతో చేసేది లేక ఇబ్బందులు పడుతున్నారు. స్కానింగ్‌ వల్ల రోగులు రేడియేషన్‌కు కూడా గురై ఇతర వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అయినా వైద్యులు వెనక్కి తగ్గడం లేదు. ప్రతీదానికి స్కానింగ్, ఎంఆర్‌ఐ అంటూ రాసేస్తున్నారు.   (Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు)

ఆర్‌ఎంపీలే మధ్యవర్తులు: ప్రైవేటు ఆసుపత్రులకు, స్కానింగ్‌ సెంటర్లకు,ల్యాబొరేటరీలకు ఆర్‌ఎంపీలే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.  కేసును బట్టి వారికి కమీషన్‌ అందిస్తున్నారు.   

రిజిస్ట్రషన్‌ లేకుండానే.. 
జిల్లాలో 57 ల్యాబొరేటరీలు మాత్రమే  వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజి్రస్టేషన్‌  అయ్యాయి. రిజిస్ట్రేషన్‌ లేకుండా కొందరు జిల్లాలో ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్న ట్టు సమాచారం. ముఖ్యంగా వైరల్‌ జ్వరాలు, డెంగీ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో ల్యాబొరేటరీలు క్యాష్‌ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరం రాగానే తమకు ఏమవుతుందోనని ఆందోళనలో రోగులు నేరుగా ల్యాబొరేటరీలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా వారు దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఇదీచదవండి: వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు!

 

కనిపించని ఫీజుల బోర్డులు  
ఏ ల్యాబొరేటరీలోగాని, ఆసుపత్రిలోగాని, స్కానింగ్‌ సెంటర్‌లోగాని ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నామో తెలిపే బోర్డు బయట వేలాడదీయాలి. కొన్ని ల్యాబొరేటరీల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. మిగతా వాటిల్లో ఉండడం లేదు. ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు లేని చోట వారు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిన పరిస్థితి.   

అధిక శాతం ల్యాబొరేటరీల్లో కానరాని పెథాలజిస్టులు  
జిల్లాలో ఉన్న ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు కాన రావడం లేదు. నిబంధన ప్రకారం యూరిన్‌ కల్చర్, బ్లడ్‌ కల్చర్, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ వంటి పరీక్షలు పెథాలజిస్టుల పర్యవేక్షణలో జరగాలి. కానీ అధికశాతం ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు లేరు. ఒకటి, రెండు ల్యాబొరేటరీల్లో తప్ప మిగతా వాటిల్లో లేరు.  

గంట్యాడ మండలానికి చెందిన సీహెచ్‌ శ్రీనివాస్‌ తలనొప్పి అని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయించుకోమని చీటి రాసి ఇచ్చాడు. సదరు వ్యక్తి ఓ ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌లో రూ.4వేలు పెట్టి స్కానింగ్‌ తీయించుకున్నాడు.  విజయనగరానికి చెందిన రామారావు జ్వరం వచ్చిందని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు కొన్ని వైద్య పరీక్షలు రాశారు. సదరు వ్యక్తి వైద్య పరీక్షలకు రూ.వెయ్యి బిల్లు చెల్లించాడు.  

జ్వరం అని వెళ్తే.. 
జ్వరం అని ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే...వారికి వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా వైరల్, డెంగీ, మలేరియా, సీబీసీ, హెచ్‌బీ, ఇలా అనేక రకాల వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. దీంతో రోగులకు ఖర్చు తడిసి మోపుడవుతుంది. జ్వరం కోసం  వెళ్లిన వారికి వైద్య పరీక్షలకు కనీసం రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. 

స్కానింగ్‌లకు రూ.వేలల్లో... 
సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌లకు  అయితే రూ.వేల ల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌లో సీటీ స్కాన్‌కు రూ.2500 నుంచి రూ.3 వేలు, ఎంఆర్‌ఐ స్కాన్‌కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో సగం వైద్యుల కమీషన్‌కే పోతుందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. చాలా మంది ప్రైవేటు వైద్యులకు ఆయా స్కానింగ్‌ల్లో షేర్‌ ఉంటుంది. షేర్‌ లేని వైద్యులకు కమీషన్లు ఆఫర్‌ చేస్తున్నారు. దీంతో వారు అవసరం లేకున్నా.. స్కానింగ్‌లు రాస్తున్నారు.

ఆదేశాలిచ్చాం.. 
ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు ల్యాబొటరీ, స్కానింగ్, ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత నిర్వాహకులకు  ఆదేశాలు జారీ చేశాం. అవి ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ల్యాబరేటరీగాని, ఆసుపత్రిలోగాని, స్కానింగ్‌ సెంటర్‌లోగాని బోర్డులు పెట్టకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతాం.  – డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి, డీఎంహెచ్‌వో     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement