
రుచితోపాటు ఆరోగ్యం మట్టి పాత్రలవైపు మళ్లుతున్న ప్రజలు
మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు..
ఖిలా వరంగల్ : పూర్వం రోజుల్లో వంటలకు మట్టి పాత్రలనే వాడే వారు. అన్నం, కూర, పాలు, పెరుగు.. ఇలా ప్రతీ పదార్థం మట్టి కుండలోనే వండేవారు, భద్రపరిచేవారు. ఈ పాత్రల్లో వండిన, భోజనం చేసిన వారు ఎక్కువ కాలం ఆరోగ్యంతో జీవించేవారని పెద్దలు చెబుతుంటారు. అయితే పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి పాత్రలు మాయమయ్యాయి. వాటి స్థానంలో అల్యూమినియం పాత్రలు, పేపర్ పేట్లు ప్రత్యక్షమయ్యాయి. ఫలితంగా వీటిని వినియోగించిన ప్రజలు అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ప్రస్తుత తరం మట్టి పాత్రలపై మక్కువ చూపుతోంది. దీంతో ఏళ్ల క్రితం వదిలేసిన మట్టి పాత్రలు ప్రజలు మళ్లీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఫలితంగా మార్కెట్‌లో మట్టి పాత్రలకు డిమాండ్ కనిపిస్తోంది. అయితే ఈ కాలంలో కూడా మట్టి పాత్రలను ఎవరు వాడతారనుకుంటే పొరపాటే.. వీటిని నేటికీ వినియోగించే వారు ఉన్నత వర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
రుచి..ఆరోగ్యకరం..
మట్టిపాత్రలో వంట రుచిగా ఉంటుంది. అలాగే, ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్‌కు వేడి తగలగానే ఇన్ ఫ్రారెడ్ అనే కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తవుతాయి. ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తిస్థాయిలో శుద్ధి అవుతుంది. ఉదాహరణకు పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుట్టినా.. పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్నా ఇంక్యుబేటర్ అనే పరికరంలో (లైట్ కింద పెడతారు) కొన్ని గంటల పాటు ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లోనే శిశువులకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సరిచేయగల శక్తి ఈ కిరణాలకు ఉంది. ప్రకృతి వైద్యంలో బురద స్నానం (మడ్ బాత్) గురించి తెలిసే ఉంటుంది. శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు. అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయ్యి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే, మట్టి పాత్రల్లో వంట చేస్తే పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్థంలోని పోషక విలువలను ఏమాత్రం వృథా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు శక్తిని కలిగించి ఆహారాన్ని సమతుల్యంగా మారుస్తాయి. అందుకే మట్టి పాత్రల్లో చేసిన వంటలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉంటుంది.
లోహపాత్రల వల్లే రోగాలు..
అల్యూమినియం పాత్రలో వండిన పదార్థాలు విషతుల్యమవుతాయి. ఈ పదార్థలు తిన్న ప్రజలు బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
అందుబాటులో మట్టి టీ గ్లాస్, వాటర్ బాటిళ్లు..
తెలంగాణలోని ఆదిలాబాద్, గుజరాత్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో గృహోపకర పాత్రలను మట్టితోనే తయారు చేస్తారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుమ్మరి కులస్తులు మట్టి పాత్రలు అందుబాటులో ఉంచారు. టీ గ్లాస్, వాటర్ బాటిల్, కంచాలు, స్పూన్లు.. ఇలా అన్ని రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!
మట్టి కడవల్లోనే మంచినీరు..
పూర్వకాలంలో మట్టి పాత్ర(కుండ)ల్లో వంటలు చేసే వారు. మట్టి కడవల్లోనే మంచినీరు తాగే వారు. అందుకే ఆ కాలపు వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే 40 ఏళ్ల నుంచి మట్టి పాత్రలు వాడకం క్రమేనా తగ్గతూ వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న రోగాలతో పాతకాలం నాటి ఆహార పద్ధతులపై ప్రజలు మక్కువ పెంచుకుంటన్నారు. ఇందులో భాగంగా మట్టి కుండలో చికెన్, మట్టి పాత్రలో వంటలకు క్రేజ్ పెరుగుతోంది. మట్టి పాత్రల్లో వంటలు ఆరోగ్యకరం అనగానే ఆ పాత్రలు మార్కెట్‌లో భారీగా అమ్ముడవుతున్నాయి. గతంలో ఇళ్లలో మట్టితో తయారు చేసే వస్తువులు అనేకం ఉండేవి. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే కుండలు తప్ప మరే ఇతర మట్టి పాత్రలు కనిపించడం లేదు.
ఇదీ చదవండి: Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు
మట్టి పాత్రలే ముద్దు : అల్యూమినియం కంటే మట్టి పాత్రలే ముద్దు. తెలంగాణలో ఉగాది పచ్చడి కొత్త మట్టి కుండల్లో చేస్తారు. ఇలా చేయడం వల్ల మట్టి పాత్రల్లో ఉండే పోషకాలు నేరుగా శరీరంలోకి వెళ్తాయి. దీని వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు. పూరి జగన్నాథుడి ఆలయంలో ఇప్పటికీ మట్టి పాత్రల్లోనే ప్రసాదాలు తయారు చేసి పంపణీ చేస్తారు.
-డాక్టర్ నరేశ్‌కుమార్, ఫోర్ట్ రోడ్డు వరంగల్