
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో పోలీసులు దౌర్జన్యం చేశారు. అర్ధరాత్రి గ్రామంలో చొరబడి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేశారు. జమ్మూ గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇళ్ల నుంచి లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
వివరాల ప్రకారం.. గుర్ల మండలం జమ్మూలో గత రాత్రి దుర్గాదేవి నిమజ్జనంలో చెలరేగిన గొడవలో పోలీసుల లాఠీచార్జ్ చేశారు. దీనికి కొనసాగింపుగా గ్రామంలోకి వచ్చిన పోలీసులు అర్ధరాత్రి దౌర్జన్యం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ అరెస్టులు చేశారు. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇళ్ల నుంచి లాకెళ్లారు. అంతటితో ఆగకుండా.. పోలీసులకు అడ్డుగా వచ్చిన వారికి చితకబాది.. వారిని వాహనాల్లో ఎక్కించారు.
ఈ క్రమంలో వారికి ఎందుకు తీసుకు వెళ్తున్నారని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. అంతేకాకుండగా.. ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసిన వారి సెల్ ఫోన్లు లాక్కొని వాటిని ధ్వంసం చేశారు. అయితే, ఎవరిని ఎక్కడికి తీసుకు వెళ్లారో తెలియక గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి నుంచి భయానక వాతావరణంలో గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.