breaking news
Private lab technicians
-
జబ్బొచ్చినా.. జ్వరమొచ్చినా.. నిలువుదోపిడి!
విజయనగరం ఫోర్ట్: వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య క్రమేణ పెరుగుతోంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల తో పాటు అటు ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఇక్కడ వరకు ఓకే.. తరువాతే వైద్యులు రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. తలనొప్పి, జ్వరం అని వెళ్లినా... రూ.వేలల్లో ఖర్చయ్యేలా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చేసేది లేక భయంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ రూ.వేలల్లో రోగులను దోచుకుంటున్నారు. సేవకు పరమార్ధంగా ఉండాల్సిన కొందరు వైద్యులు ధనార్జనే ధ్యేయంగా మారడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ పరీక్షలు చేయించుకోలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. వచ్చే రోగాలకు స్కానింగ్, పలు రకాల పరీక్షలు అవసరం లేకున్నా వైద్యులు రాసేస్తుండడంతో చేసేది లేక ఇబ్బందులు పడుతున్నారు. స్కానింగ్ వల్ల రోగులు రేడియేషన్‌కు కూడా గురై ఇతర వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అయినా వైద్యులు వెనక్కి తగ్గడం లేదు. ప్రతీదానికి స్కానింగ్, ఎంఆర్ఐ అంటూ రాసేస్తున్నారు. (Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు)ఆర్ఎంపీలే మధ్యవర్తులు: ప్రైవేటు ఆసుపత్రులకు, స్కానింగ్ సెంటర్లకు,ల్యాబొరేటరీలకు ఆర్ఎంపీలే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. కేసును బట్టి వారికి కమీషన్ అందిస్తున్నారు. రిజిస్ట్రషన్ లేకుండానే.. జిల్లాలో 57 ల్యాబొరేటరీలు మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజి్రస్టేషన్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ లేకుండా కొందరు జిల్లాలో ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్న ట్టు సమాచారం. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో ల్యాబొరేటరీలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరం రాగానే తమకు ఏమవుతుందోనని ఆందోళనలో రోగులు నేరుగా ల్యాబొరేటరీలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా వారు దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీచదవండి: వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు! కనిపించని ఫీజుల బోర్డులు ఏ ల్యాబొరేటరీలోగాని, ఆసుపత్రిలోగాని, స్కానింగ్ సెంటర్లోగాని ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నామో తెలిపే బోర్డు బయట వేలాడదీయాలి. కొన్ని ల్యాబొరేటరీల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. మిగతా వాటిల్లో ఉండడం లేదు. ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు లేని చోట వారు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిన పరిస్థితి. అధిక శాతం ల్యాబొరేటరీల్లో కానరాని పెథాలజిస్టులు జిల్లాలో ఉన్న ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు కాన రావడం లేదు. నిబంధన ప్రకారం యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్, ప్లేట్లెట్ కౌంట్ వంటి పరీక్షలు పెథాలజిస్టుల పర్యవేక్షణలో జరగాలి. కానీ అధికశాతం ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు లేరు. ఒకటి, రెండు ల్యాబొరేటరీల్లో తప్ప మిగతా వాటిల్లో లేరు. గంట్యాడ మండలానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్ తలనొప్పి అని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోమని చీటి రాసి ఇచ్చాడు. సదరు వ్యక్తి ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో రూ.4వేలు పెట్టి స్కానింగ్ తీయించుకున్నాడు. విజయనగరానికి చెందిన రామారావు జ్వరం వచ్చిందని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు కొన్ని వైద్య పరీక్షలు రాశారు. సదరు వ్యక్తి వైద్య పరీక్షలకు రూ.వెయ్యి బిల్లు చెల్లించాడు. జ్వరం అని వెళ్తే.. జ్వరం అని ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే...వారికి వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా వైరల్, డెంగీ, మలేరియా, సీబీసీ, హెచ్‌బీ, ఇలా అనేక రకాల వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. దీంతో రోగులకు ఖర్చు తడిసి మోపుడవుతుంది. జ్వరం కోసం వెళ్లిన వారికి వైద్య పరీక్షలకు కనీసం రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. స్కానింగ్‌లకు రూ.వేలల్లో... సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లకు అయితే రూ.వేల ల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో సీటీ స్కాన్‌కు రూ.2500 నుంచి రూ.3 వేలు, ఎంఆర్ఐ స్కాన్‌కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో సగం వైద్యుల కమీషన్‌కే పోతుందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. చాలా మంది ప్రైవేటు వైద్యులకు ఆయా స్కానింగ్‌ల్లో షేర్ ఉంటుంది. షేర్ లేని వైద్యులకు కమీషన్లు ఆఫర్ చేస్తున్నారు. దీంతో వారు అవసరం లేకున్నా.. స్కానింగ్‌లు రాస్తున్నారు.ఆదేశాలిచ్చాం.. ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు ల్యాబొటరీ, స్కానింగ్, ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. అవి ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ల్యాబరేటరీగాని, ఆసుపత్రిలోగాని, స్కానింగ్ సెంటర్లోగాని బోర్డులు పెట్టకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతాం. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌వో -
ప్లేట్ ‘లేట్’ అవుతోంది!
రెండు రోజుల క్రితం ఒంగోలుకు దగ్గరగా ఉండే అల్లూరులో ఓ బాలిక డెంగీతో మృతిచెందింది. జిల్లాలో 11 మందికి డెంగీ సోకి గుంటూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిని రెండు రోజుల క్రితం డీఎంహెచ్‌వో డాక్టర్ జె.యాస్మిన్ పరిశీలించారు. ఇక యాచవర ం పీహెచ్సీ పరిధిలో ఇరువురికి, పశ్చిమ ప్రాంతంలో మరో ఇరువురికి డెంగీ రావడంతో కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అధికారికంగా ఇలా ఉంటే అనధికారికంగా ప్రైవేట్ వైద్యశాలలో డెంగీతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారని అంచనా. - నాలుగేళ్ల నుంచి జిల్లాకు రాని ప్లేట్లెట్ మిషన్ - రిమ్స్‌లో నిర్వహించే ఎలీసా పరీక్షే దిక్కు - రెండు రోజుల కిందట బాలిక మృతి - ఇంకా నిద్రమత్తు వీడని వైద్య ఆరోగ్య శాఖ ఒంగోలు సెంట్రల్ : నేడు చిన్న పాటి జ్వరం వచ్చినా డెంగీ అని ప్రతి పౌరునిలో భయం కలుగుతోంది. డెంగీ లక్షణాలు లేకున్నా, ఉన్నట్లు కొంత మంది ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. జిల్లాకే పెద్ద దిక్కయిన రిమ్స్ వైద్యశాలలో ప్లేట్లెట్లు ఎక్కించే మిషన్లు లేకపోవడంతో డెంగీ బాధితులు పొరుగు జిల్లాలకు తరలుతున్నారు. గత ఏడాది 499 మలేరియా జ్వరాల కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఇప్పటికే 159 కేసులు నమోదయ్యాయి. డెంగీ అనుమానిత కేసులు గత ఏడాది 91కేసులు కాగా, ప్రస్తుతం 56 కేసులు నమోదయ్యాయి. వీటిలో 15కు పైగా పాజిటివ్ వచ్చాయి. 96 రక్త నమూనాలు ఉంటే ఎలిసా టెస్టును రిమ్స్‌లో చేస్తారు. ఎలీసా టెస్టు కిట్ దాదాపు రూ.15 వేల దాకా ఉంటోంది. దీంతో దాదాపు కనీసం 50 రక్త నమూనాలు ఉంటేనే పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఇక్కడ డెంగీ నిర్దారణ పరీక్షలో పాజిటివ్ అని వస్తే ప్రైవేట్ వైద్యుల పంట పండినట్లే. వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలంటూ రోగులను భయాందోళనకు గురిచేసి ఆర్థికంగా దండుకుంటున్నారు. కొరవడిన అవగాహన డెంగీ నివారణకు ప్రైడేను డ్రై డే గా పాటించాలన్న దిశగా ఆరోగ్యశాఖ ముందడుగు వేయడం లేదు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్‌ను వదలడం, గంబూషియా చేపలను వదిలి దోమల లార్వాలను చంపడం వంటి చర్యలు శూన్యం. సమీక్ష సమావేశాలతోనే ఆరోగ్యశాఖ కాలం వెల్లదీస్తుంది. సీఎం ప్రకటించినా చేరని వైనం 2012 అక్టోబర్ 11న జిల్లాకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి నెల రోజుల్లో పంపిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు మారతున్నాయి కానీ ప్లేట్లెట్ మిషన్ మాత్రం రాలేదు. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలికి గత జిల్లా కలెక్టర్ రెండుసార్లు లేఖలు రాసినా ఫలితం లేదు. వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొన లేదు - డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, ఎండీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వ్యాధికి ఇంతవరకూ ఎటువంటి వాక్సిన్ను కనుగొన లేదు. డెంగీ బారిన పడిన రోగులకు జ్వరం తగ్గడానికి వాడే పారాసిటమాల్ మాత్రమే వాడాలి. ఇష్టం వచ్చినట్లు యాంటిబయాటిక్‌లను. నొప్పి నివారణ మందులు వాడరాదు. యాంటి జెన్, యాంటీ బాడీ, ఎలీసా టెస్టు ద్వారా వ్యాధిని నిర్దారించాలి. ప్లేట్లెట్లు దాదాపు 50 వేల కంటే తగ్గి పోయినపుడు పరిస్థితి విషమం అవుతుంది. ప్లేట్లెట్లు పడిపోతే అంతర్గతంగా రక్త స్రావం జరిగే ప్రమాదం ఉంది.