బకాయిలు ఇప్పించండి | collector meeting background of state bifurcation | Sakshi
Sakshi News home page

బకాయిలు ఇప్పించండి

May 26 2014 2:06 AM | Updated on Sep 2 2017 7:50 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోతున్న నేపథ్యంలో జిల్లాకు రావాల్సిన నిధుల బకాయిలన్నింటిని వెంటనే విడుదల చేయించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోతున్న నేపథ్యంలో జిల్లాకు రావాల్సిన నిధుల బకాయిలన్నింటిని వెంటనే విడుదల చేయించాలని  కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర విభజన కసరత్తుపై చర్చించిన అధికారులు జిల్లాల వారీగా సమీక్ష జరిపారు.

అందులో భాగంగా కలెక్టర్ శ్రీనరేశ్ మన జిల్లాకు రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన రూ.10 కోట్లు, ఆన్‌లైన్‌లో నిలిచిపోయిన రూ.37 కోట్ల మేర హౌసింగ్ నిధులు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి కేటాయించిన రూ.20 కోట్లతో పాటు పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, విద్యుత్‌బిల్లులు, మెడికల్ సర్వీసు డాక్టర్ల వేతనాలను వీలున్నంత త్వరగా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశం అనంతరం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లకు వేడుకగా వీడ్కోలు విందు ఇచ్చారు.  

 శభాష్... ఆనంద్
 జిల్లా కలెక్టర్ల సమావేశం ఎవరెస్టు అధిరోహకులు ఆనంద్, పూర్ణలకు అభినందనలు తెలియజేసింది. సమావేశంలో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రావత్‌లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యంత సాహసోపేతమైన ఎవరెస్టు యాత్రను విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. దీంతో కలెక్టర్లంతా చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. జిల్లా కలెక్టర్ శ్రీనరేశ్ ప్రత్యేకంగా ఆనంద్ గురించి ప్రస్తావించి అభినందనలు తెలిపారు.

 కేసీఆర్‌ను కలిసిన కలెక్టర్...
 తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ కలిశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేసీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. మన కలెక్టర్‌తో పాటు మహబూబ్‌నగర్, కరీంనగర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లు కూడా కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement