బెల్టు షాపుల మూసివేతపై 'ఆ' శాఖల మధ్య వివాదం

The Cold Shoulder Between Excise And Police Dept In Nizamabad District After Belt Shops Closed - Sakshi

ఎక్సైజ్‌ వర్సెస్‌ పోలీసు

మద్యం అమ్మకాలకు టార్గెట్‌ విధించిన ప్రభుత్వం

బెల్టుషాపులు కొనసాగించాలంటున్న ఎక్సైజ్‌ అధికారులు!

శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటున్న పోలీసులు

సాక్షి, బాల్కొండ: విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా.. ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా మద్యం అమ్మకాలను ఎక్సైజ్‌ శాఖ ప్రోత్సహిస్తుంది. బెల్టుషాపుల కొనసాగింపుపై ఎక్సైజ్‌ శాఖ సానుకూలంగా వ్యవహరిస్తుండగా, పోలీసులు కఠినంగా ఉన్నారు. దీంతో ఇరుశాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. మూసి ఉన్న బెల్టుషాపులను పునఃప్రారంభించుకోవచ్చని ఎక్సైజ్‌ అధికారులు నిర్వాహకులకు అనధికారికంగా సూచించిగా ఒక రోజు దుకాణాలు తెరిచారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో బెల్టుషాపులకు తాళాలు పడ్డాయి. ఇలా బెల్టుషాపుల నిర్వహణపై ఎక్సైజ్, పోలీసు శాఖలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.  

జిల్లాలో లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలు 95 ఉన్నాయి. నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌ పరిధిలోని మద్యం దుకాణాలను మినహాయించి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లో ఉన్న మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాల్లో రోజుకు రూ.లక్ష మద్యం విక్రయిస్తే బెల్టు షాపులకు తరలించిన మద్యం ద్వారా అదనంగా రూ.రెండు లక్షల గిరాకీ పెరుగుతుంది. బెల్టుషాపుల ద్వారానే అత్యధికంగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.

అనధికార సూచనలు!
ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్‌ ప్రకారం మద్యం అమ్మకాలు జరగడానికి ఐఎంఎల్‌ డిపోల నుంచి వ్యాపారులు మద్యం కొనుగోలు చేసేలా ఎక్సైజ్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరగాలంటే బెల్టుషాపులు ప్రధానం అని భావించిన ఎక్సైజ్‌ అధికారులు లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగించడానికి అనధికార అనుమతి ఇచ్చారు. ‘దిశ’ ఘటన మద్యం మత్తులో జరిగిందనే విషయాన్ని గుర్తించిన పోలీసులు మద్యం అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి సారించారు. లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలను మూయించే అధికారం లేకపోవడంతో పోలీసులు బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని బెల్టుషాపులను మూయించడానికి ఉన్నతాధికారులు ఆయా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌లకు ఆదేశాలు ఇచ్చారు.

సుమారు పదిహేను రోజుల నుంచి బెల్టుషాపులను పోలీసుల ఆదేశాలతో నిర్వాహకులు మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉండటంతో మద్యం అమ్మకాలు అనుకున్నంత సాగడం లేదని వ్యాపారులు ఎక్సైజ్‌ అధికారులకు వివరించారు. తాము పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని ఎక్సైజ్‌ అధికారులు చెప్పడంతో నిర్వాహకులు బుధవారం బెల్టుషాపులను తెరిచారు. దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గురువారం నుంచి మళ్లీ దుకాణాలను మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉంచడంతో ఐఎంఎల్‌ డిపోల నుంచి ఎక్కువ మొత్తం మద్యం కొనుగోలు చేయలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. అటు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు టార్గెట్‌ నిర్ణయించడం, ఇటు బెల్టుషాపులు మూసి ఉండటంతో ఎక్సైజ్‌ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. మద్యం అమ్మకాల విషయంలో రెండు ప్రభుత్వ శాఖల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడటం చర్చనీయాంశం అయింది.

మాకు టార్గెట్‌ ఉంది 
మద్యం దుకాణాల ద్వారా నిర్ణీత లక్ష్యం మేరకు మద్యం అమ్మాలని టార్గెట్‌ నిర్ణయించారు. లైసెన్స్‌డ్‌ వ్యాపారులు ఐఎంఎల్‌ డిపోల నుంచి టార్గెట్‌ ప్రకారం మద్యం కొను గోలు చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో మద్యం అమ్మకాలు తగ్గడం మాకు కొంత ఇబ్బందే.
– శేఖర్, ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, మోర్తాడ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top