‘కోడ్’ దెబ్బ | 'Code' blow | Sakshi
Sakshi News home page

‘కోడ్’ దెబ్బ

Apr 13 2014 4:13 AM | Updated on Oct 17 2018 5:43 PM

‘కోడ్’ దెబ్బ - Sakshi

‘కోడ్’ దెబ్బ

ఓ పక్క ఎన్నికల హుషారు.. ప్రచార హోరు... మరోపక్క మండే ఎండలు.. కోతలు.. ఉక్కపోతలు.. వడదెబ్బలతో సామాన్యుడి బేజారు.. ఇదీ ప్రస్తుతం న‘గరం’ తీరు.

  • కానరాని చలివేంద్రాలు
  •      దాహంతో అల్లాడుతున్న బాటసారులు
  •      పెరుగుతున్న వడదెబ్బ మృతులు
  •      నిబంధనలకు జడిసి మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేయని నేతలు
  •      నిలోఫర్‌కు పెరిగిన డయేరియా బాధితుల తాకిడి
  •  సాక్షి, సిటీబ్యూరో: ఓ పక్క ఎన్నికల హుషారు.. ప్రచార హోరు... మరోపక్క మండే ఎండలు.. కోతలు.. ఉక్కపోతలు.. వడదెబ్బలతో సామాన్యుడి బేజారు.. ఇదీ ప్రస్తుతం న‘గరం’ తీరు. ఎండాకాలం వచ్చిందంటే గల్లీకో చలివేంద్రం పెట్టి ఫొటోలకు ఫోజిచ్చే నేతలంతా ఇప్పుడు ‘ఎన్నికల కోడ్’ పుణ్యమా అని ఆ పబ్లిసిటీకి ఫుల్‌స్టాప్ పెట్టారు. మంచినీటి కేంద్రాల మాటే మరిచారు.

    ఫలితంగా సామాన్యులు భగ్గున మండుతున్న ఎండలకు విలవిలాడుతూ.. గుక్కెడు మంచినీళ్లకు నోచక, దాహార్తితో ప్రాణాలు వదులుతున్నారు. రహదారులు, బస్టాపులు, ప్రధాన కూడ ళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చవలసిన ఆయా శాఖల అధికారులు, ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సైతం మానవత్వాన్ని మరిచినట్లుగానే వ్యవహరిస్తున్నాయి.

    గత ఏడాది జలమండలి.. చలివేంద్రాలకు నాలుగువేల ట్యాంకర్ల మంచినీరు సరఫరా చేసింది. ఈ ఏడాది ఐదు నుంచి ఆరు వేల ట్యాంకర్లు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నిర్వాహకుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో తాము కూడా ఏమీ చేయలేక పోతున్నట్లు జలమండలి అధికారులు స్పష ్టం చేస్తున్నారు.
     
    వడదెబ్బతో ఇప్పటికే పదిమంది మృతి


    ఉదయం పది గంటలకే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. మండే ఎండలకు ఉక్కపోత తోడవ్వడంతో సిటీజనులు బెంబేలెత్తిపోతున్నారు. పట్టపగలు కరెంట్ సరఫరా నిలిపివేస్తుండటంతో ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు పనిచేయక ఇరుకైన అపార్ట్‌మెంటుల్లో నివాసం ఉండేవారు ఉక్కపోతకు తట్టుకోలేక పోతున్నారు. వేసవి తాపానికి వృద్ధులు, చిన్నారులు, బాలింతలు డీ హైడ్రేషన్ కు లోనవుతున్నారు.

    గ్రేటర్‌లో ఇటీవల పది మంది అనాథ వృద్ధులు వడదెబ్బతో మృతి చెందగా.. అనేక మంది చిన్నారులు డయేరి యాతో బాధపడుతున్నారు. ఇక టూ వీలర్స్‌పై ప్రయాణించే మార్కెటింగ్ ఉద్యోగులు, యువ తీయువకులు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఉక్కపోత వల్ల   మెడ, కాళ్లు, చేతులపై పొక్కులు వస్తున్నాయి. ముఖం వాడిపోవడంతో పాటు నుదురు, బుగ్గలపై నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయి.   
     
    నిలువ నీడా కరువే..
     
    మరోవైపు నిలువ నీడ లేని వందలాది బస్‌షెల్టర్లు ప్రయాణికుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఏళ్లు గడిచినా బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయకుండా దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న జీహెచ్‌ఎంసీ.. బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయడం తమ పనికాదన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ.. అందుబాటులో లేని చలివేంద్రాలు మొత్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ అందరూ కలిసి ప్రజల ఉసురు తీస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీలు ఉన్న పగటి ఉష్ణోగ్రతలు మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వడ దెబ్బ ప్రమాదాలు ఇంకా రెట్టింపయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వీయ జాగ్రత్తలు ఒక్కటే దీనికి పరిష్కారమని స్పష్టం చేస్తున్నారు.
     
    వడదెబ్బతో వ్యక్తి మృతి

     
    అఫ్జల్‌గంజ్: వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. కోల్సావాడీలోని రామనాద ఆశ్రమం సమీపంలో ఫుట్‌పాత్‌పై శనివారం మధ్యాహ్నం సుమారు 50-55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉంది. ఈ సమాచారం అందుకున్న  అఫ్జల్‌గంజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

    మృతుడు తెలుపు రంగు గీతలు గల నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, అతని పొట్ట ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉందని తెలిపారు. మృతుడు యాచకుడై ఉండవచ్చని, వడదెబ్బతో మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు నేరుగా అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కాని 94906 16248/73822 96638 ఫోన్ నెంబర్లలో కాని సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement