అక్కడ ప్రచారం నిర్వహిస్తే సీఎం కావడమే..!

CM  Success Sentiment Junction In Nizamabad - Sakshi

ఏర్గట్లలోని స్థూపం వద్ద ఉన్న రోడ్డు ప్రత్యేకత

1982లో ఏర్గట్లలో ప్రచారం చేసిన ఎన్టీఆర్‌

2004లో ఇక్కడే ప్రచారం నిర్వహించిన వైఎస్సార్‌

సాక్షి,మోర్తాడ్‌(బాల్కొండ): ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నా సెంటిమెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఎంతో మంది ఉంటారు. రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది సెంటిమెంట్‌ను నమిన్నట్లే ప్రజలు కూడా సెంటిమెంట్‌పై చర్చించుకోవడం, పందాలు కాయడం చేస్తుంటారు. అలాంటి సెంటిమెంట్‌ ఒక్కటి ఏర్గట్ల మండల కేంద్రంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏర్గట్ల మండల కేంద్రం లోని బస్టాండ్‌ ప్రాంతంలో ఉన్న నక్సల్స్‌ అమరవీరుల స్మారక స్థూపం పక్కన ఉన్న రోడ్డుపై ప్రచారం నిర్వహించిన రెండు పార్టీల ముఖ్య నాయకులు ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్య మంత్రులుగా బాధ్యతలను నిర్వహించిన విషయం పక్కన పెడితే ఇద్దరు నేతలు మాత్రం ఏర్గట్ల వాసులు సెంటిమెంట్‌గా భావిస్తున్న స్థలం వద్ద నుంచి ప్రచారం నిర్వహించడం వల్లనే వారు ముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారని నమ్ముతున్నారు.

1982లో టీడీపీని సినీనటుడు ఎన్టీఆర్‌ స్థాపించి చైతన్యరథంలో పార్టీ గురించి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్గట్లలోని బస్టాండ్‌ వద్ద ఎన్టీఆర్‌ ప్రచారం నిర్వహించారు. 1983లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో ఆయన సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. ఏర్గట్లలో ఎన్టీఆర్‌ ప్రసంగించడం ఆ తరువాతనే ఆయన సీఎం అయ్యారని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే మరోసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విషయంలోనూ రుజువు కావడంతో ఏర్గట్ల ప్రజలకు సెంటిమెంట్‌ బలపడింది. 2004 సాధారణ ఎన్నికల్లో భాగంగా బస్సుయాత్రను నిర్వహించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మోర్తాడ్‌ నుంచి పాలెం, తిమ్మాపూర్‌ల మీదుగా ఏర్గట్లకు చేరుకున్నారు. గతంలో ఎన్టీఆర్‌ నిర్వహించిన స్థలం వద్దనే వైఎస్సార్‌ ప్రచార సభను కొనసాగించారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధిక సంఖ్యలో సీట్లను దక్కించుకోవడంతో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

ఏర్గట్ల బస్టాండ్‌ వద్ద ఒక సారి ఎన్టీఆర్, మరోసారి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలు ప్రచారం నిర్వహించడం వల్లనే వారికి సీఎం అయ్యే అవకాశం లభించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల మాదిరిగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఇక్కడ ప్రచారం నిర్వహించలేదు. ఏర్గట్లలో ప్రచారం నిర్వహించిన ఇద్దరు ముఖ్య నాయకులలో ఆ ఇద్దరు సీఎంలుగా ఎంపిక కావడంతో ఏర్గట్ల స్థల ప్రభావం రాజకీయంగా ఎంతో ఉందని కూడా నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా సెంటిమెంట్‌లకు విలువ ఇచ్చేవారికి అనుగుణంగా పరిస్థితులు అనుకూలించడం విశేషం అని చెప్పవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top