రూ. 55 వేల కోట్లతో నగరాల అభివృద్ధి | Cm review on 'Focusing on Urban Telangana' | Sakshi
Sakshi News home page

రూ. 55 వేల కోట్లతో నగరాల అభివృద్ధి

Jul 8 2018 1:33 AM | Updated on Aug 15 2018 9:10 PM

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే మూడేళ్లలో రూ. 55 వేల కోట్లతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఒక్క హైదరాబాద్‌ నగరానికే ఏడాదికి రూ. 15 వేల కోట్ల చొప్పున రూ. 45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని నిజమైన గ్లోబల్‌ సిటీగా మార్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.

మిగతా నగరాల్లో చేపట్టే పనుల కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మూడేళ్లలో రూ. 55 వేల కోట్లతో చేపట్టే పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ‘ఫోకసింగ్‌ ఆన్‌ అర్బన్‌ తెలంగాణ’కార్యక్రమం అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సమగ్ర నివేదిక ఆధారంగా పనులు...
‘వచ్చే ఏడాది నుంచి వరుసగా మూడేళ్లపాటు రాష్ట్రంలోని అన్ని నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రహదారులు, పార్కులు, చెరువులు, మురికి కాలువలను అద్భుతంగా తీర్చిదిద్దాలి. ఈ పనులు చేయడానికి నిధుల కొరత లేదు. ఇందుకోసం రూ. 55 వేల కోట్లు కేటాయిస్తాం. హైదరాబాద్‌కు రూ. 45 వేల కోట్లు, ఇతర నగరాలకు రూ. 10 వేల కోట్లు ఇస్తాం. ఈ నిధులతో ఏ పనులు చేయాలనే విషయంలో మున్సిపల్‌శాఖ సమగ్ర నివేదిక రూపొందించాలి. దాని ప్రకారం పనులు చేసుకుంటూ పోవాలి.

ఆ ప్రణాళిక ప్రకారమే అన్ని రకాల నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి. నగరాలు, పట్టణాల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలి. అక్రమ లే అవుట్లపై కఠినంగా వ్యవహరించాలి. లే అవుట్లలో గ్రీన్‌ల్యాండ్‌ కోసం స్థలం తీసినా, తర్వాత వాటిని రెగ్యులరైజ్‌ చేసే విధానానికి స్వస్తి పలకాలి. గ్రీన్‌ కవర్‌ కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. చెరువులను శుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలి. హైదరాబాద్‌లోని గండిపేట, హియాయత్‌ సాగర్, హుస్సేన్‌ సాగర్‌ లాంటి చెరువులను గోదావరి నీటితో నింపాలి.

మురికినీరు చెరువుల్లో కలవకుండా చూడాలి. మురికినీటిని శుభ్రం చేయడానికి సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు పెట్టాలి. ప్రతి నగరానికీ అవసరమైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి’అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. సమావేశంలో మంత్రి కె. తారక రామారావు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, పురపాలకశాఖ కమిషనర్‌ శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, కరీంనగర్‌ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్, ఖమ్మం మేయర్‌ పాపాలాల్, నిజామాబాద్‌ మేయర్‌ సుజాత, రామగుండం మేయర్‌ కె. లక్ష్మీనారాయణ, కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement