సాహస పోలీసు

CI Srujan saved two lives - Sakshi

ఇద్దరి ప్రాణాలు కాపాడిన సీఐ

జమ్మికుంట రూరల్‌: ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ప్రజలతో మమేకమై శాంతి భద్రతలను సంరక్షించడమే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వెనుకాడబోమని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి నిరూపించారు. తాడు సాయంతో చేదబావిలోకి దిగి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాపాడారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంటి సమీపంలో ఉన్న చేదబావిలో మట్టి పూడిక తీత పనులకు మంగళవారం అదే గ్రామానికి చెందిన ఒల్లాల మల్లయ్య, మారపల్లి రవీందర్‌ వెళ్లారు. బావిలోకి దిగి కాసేపు పనులు చేసిన అనంతరం ఇద్దరు వ్యక్తుల నుంచి ఎలాంటి చడీచప్పుడు రాలేదు. దీంతో అక్కడే ఉన్న గ్రామస్తులు వెంటనే పోలీసులు, 108కు సమాచారం అందించారు. స్పందించిన జమ్మికుంట టౌన్‌ సీఐ సృజన్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు.

చేదబావిలో ఉన్న మల్లయ్య, రవీందర్‌లకు ఊపిరాడకపోవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 108 వెంట ఉన్న ఆక్సిజన్‌ను పైపు ద్వారా బావిలోకి పంపించారు. ఈ సమయంలో చేదబావిలోకి దిగడానికి గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. అగ్నిమాపక సిబ్బంది తీసుకొచ్చిన నిచ్చెన సహాయంతో సీఐ సృజన్‌రెడ్డి చేదబావిలోకి దిగి, అందులో ఉన్న ఇద్దరి నడుముకు తాడు కట్టి గ్రామస్తుల సహకారంతో పైకి తీశారు. వెంటనే మల్లయ్య, రవీందర్‌లకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో నుంచి బయట పడ్డారు. ఈ క్రమంలో సీఐకి స్వల్ప గాయాలు కావడంతో 108 సిబ్బంది చికిత్స చేశారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా ఇద్దరి ప్రాణాలను కాపాడిన సీఐ సృజన్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top