
టీఆర్‌ఎస్‌లో చేరిన చింతల వెంకటేశ్వర్‌రెడ్డి
భువనగిరికి చెందిన కాంగ్రెస్ నేత, పీసీసీ మాజీ కార్యదర్శి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
భువనగిరి :భువనగిరికి చెందిన కాంగ్రెస్ నేత, పీసీసీ మాజీ కార్యదర్శి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చింతలను సీఎం కేసీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చింతల మాట్లాడుతూ బంగారు తెలంగాణ కేసీఆర్ సారధ్యంలోనే సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్‌లో చేరినట్లు చెప్పారు. అందరూ కలిసి బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలని కోరారు.
ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఎదిగిన చింతల
భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎన్‌ఎస్‌యూఐనుంచి ప్రారంభమైంది. 1985లో ఎన్‌ఎస్‌యూఐలో చేరిన చింతల 1986లో హైదరాబాద్ నగర ఉపాధ్యక్షుడిగా, 1988లో రాష్ర్ట ప్రధానకార్యదర్శిగా, 1990లో ఉపాధ్యక్షుడిగా, 1995లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, గాంధీ భవన్ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. 2000సంవత్సరం నుంచి 2014 ఎన్నికల వరకు ఆయన భువనగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. 2000 సంవత్సరంలో భువనగిరి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2007 వరకు పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. గత ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ స్థానానికి టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో కొంత కాలంగా పార్టీపై అలక బూనారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి కాకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా పనిచేశాడని, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్‌లో చేరారు. రానున్న రోజుల్లో ఆయన అనుచరులు మరికొంతమంది టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీనుంచి చింతల సస్పెన్షన్
భువనగిరి అర్బన్ : పీసీసీ మాజీ కార్యదర్శి, భువనగిరి నియోజకవర్గ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేస్తునట్లు అ పార్టీ క్రమశిక్షణ సంఘం గురువారం తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటేశ్వర్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోతంశెట్టి వెంక టేశ్వర్లు క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో చింతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. దీనికి ఆయననుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు క్రమశిక్షణ సంఘం సభ్యులు తెలిపారు.