తల్లీబిడ్డలకు భరోసా! 

Child Care Center Released Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్‌ సర్జన్, జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్‌ సేవలు అందుతున్నాయి. ఈ విభాగాలన్నింటికీ రెండు ఆపరేషన్‌ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. సిజేరియన్లు కూడా ఈ థియేటర్‌లోనే చేస్తున్నారు. ఇకపై ఈ పరిస్థితి మారనుంది. మాతాశిశు సంరక్షణ కేంద్రం మంజూరుతో.. తల్లీబిడ్డలకు వైద్య సేవల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ విభాగానికి విడిగా రెండు ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేస్తారు.

శుభపరిణామం.. 
కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రిని ఇటీవల జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈక్రమంలో వంద నుంచి 250 పడకలకు ఆస్పత్రి సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. ఇది ఇంతవరకు అమలు కాలేదు. వంద పడకల్లోనే గైనకాలజీ, పీడియాట్రిక్‌ విభాగాలకు 25– 30 బెడ్‌లను వినియోగిస్తున్నారు. మిగిలిన పడకలను ఇతర విభాగాల పేషెంట్లకు కేటాయిస్తున్నారు. గైనిక్, పీడియాట్రిక్‌ విభాగాలకు ఆ పడకలు ఏమాత్రం చాలడం లేవు. కేసీఆర్‌ కిట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటి నుంచి జిల్లా ఆస్పత్రికి గైనిక్‌ పేషెంట్లు రాక పెరిగింది. నెలకు సగటున 200లకుపైగా సాధారణ కాన్పులు, సిజేరియన్లు జరుగుతున్నాయి. నిత్యం ఓపీ సంఖ్య 250కి తగ్గడం లేదు. రోజు పది మంది ఇన్‌పేషంట్లు డిశ్చార్జ్‌ అవుతుండగా.. అంతే మొత్తంలో ఇన్‌ పేషెంట్లుగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు కానుండడం శుభపరిణామం. ఫలితంగా విస్తృత స్థాయిలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు వైద్య సేవలు అందనున్నాయి.

మరిన్ని పోస్టులు మంజూరు 
పీడియాట్రిక్, గైనిక్‌ విభాగాల్లో రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేరు. ప్రస్తుతం ఆరుగురు రెగ్యులర్‌ గైనిక్‌ వైద్యులు, మరో ఇద్దరు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. అలాగే చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు ఉన్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం రాకతో మరిన్ని పోస్టులు వచ్చే వీలుంది. అదనంగా గైనిక్‌ వైద్యులు, సిజేరియన్లలో కీలకమైన అనస్థిషియన్, చిన్న పిల్లల వైద్య నిపుణులు నాలుగు చొప్పున మంజూరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వీటితోపాటు నర్సు ఇతర పారామెడికల్‌ పోస్టులు కూడా వచ్చే వీలుందని పేర్కొంటున్నాయి.

స్థలం ఎక్కడ? 
ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి జీ+2 అంతస్తుల్లో కొనసాగుతోంది. ఇదే భవనంపై మరో అంతస్తు నిర్మించి అక్కడ మాతాశిశు సంరక్షణ కేంద్ర ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా ఆస్పత్రి అధికార వర్గాలు భావిస్తున్నాయి. అన్ని రకాల వైద్య సేవలు ఒకే ప్రాంగణంలో లభిస్తాయని, తద్వారా రోగులకు వ్యయప్రయాసాలకు తప్పుతాయని చెబుతున్నారు. అయితే, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు కనీసం అర ఎకరం స్థలం కావాలని వైద్యవిధాన పరిషత్‌ డైరెక్టరేట్‌ పేర్కొంటోంది.

భూముల ధరలు చుక్కలనంటుతున్న శేరిలింగంపల్లిలో ఆమేరకు భూమి అందుబాటులో లేదని అధికారులు పేర్కొంటున్నారు. స్థలం విషయమై త్వరలో కలెక్టర్‌ను సంప్రదించనున్నట్లు సమాచారం. ఒకవేళ స్థలం లభిస్తే మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తారు. స్థల లభ్యత లేకుంటే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి భవనంపైనే ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top