గజ్వేల్‌ గౌరవం చాటాలె..

Chief Minister KCR, Speaking In The Gajwel Sabha - Sakshi

ఇక్కడ గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం  

తెలంగాణలో మళ్లీ వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే 

రానున్న ఐదేళ్లలో అందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతాం  

పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం  

గజ్వేల్‌ బహిరంగ సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌  

సాక్షి, సిద్దిపేట/గజ్వేల్‌: ‘మీ బిడ్డగా ఇక్కడి నుంచి గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్లా. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు గజ్వేల్‌ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశా. ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి గజ్వేల్‌ గౌరవాన్ని చాటాల’ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వందకు పైగా సీట్లను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌కు ఓ ప్రత్యేకత ఉందని... ఇక్కడ గెలిచిన పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు.

ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గజ్వేల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఇళ్లు లేని కుటుంబం ఉండరాదనేదే లక్ష్యంతో అందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కట్టిస్తామన్నాని హామీ ఇచ్చారు. కొండపోచమ్మ తల్లి దీవెనతో ప్రాజెక్టు పూర్తవుతుందని.. రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

సాగునీరు పుష్కలంగా ఉంటే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. ప్రతి ఇంటికి రెండు పాడి గేదెలు నూరు శాతం సబ్సిడీతో అందజేస్తామని వివరించారు. అవసరమైతే మండలానికో చిల్లింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు లాభసాటిగా ఉండేలా చేస్తామన్నారు. కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పెట్టుకొని పండిన పంటలకు డిమాండ్‌ ధర వచ్చేలా చూస్తామన్నారు.  

కాలుష్యం లేని పరిశ్రమలు తెస్తాం 
రానున్న రోజుల్లో గజ్వేల్‌ రూపురేఖలు మారిపోతాయని.. భూములకు ఆకాశాన్నంటే విధంగా రేట్లు వస్తాయన్నారు. గజ్వేల్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారని కేసీఆర్‌ వివరించారు. అయితే కాలుష్యం లేని పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తామన్నారు. పరిశ్రమలు స్థాపిస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని.. దళితులు, గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నామన్నారు. దేశం మొత్తం బడ్జెట్‌లో మైనార్టీలకు రూ. 4వేల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తే.. ఒక్క తెలంగాణలోనే రూ. 2వేల కోట్ల బడ్జెట్‌ పెట్టినట్లు వివరించారు.

అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు కుట్ర పన్నుతున్నారన్నారు. దొంగ సర్వేలు చూపించి గోల్‌మాల్‌ చేస్తున్నారని.. వారి మాటలు పట్టించుకోవద్దని సూచించారు. ఈ ఎన్నికలు పూర్తి కాగానే గ్రామ పంచాయతీ ఎన్నికలుంటాయని.. గిరిజనుల తండాల్లో వారే సర్పంచ్‌లుగా ఎన్నుకోబడుతారన్నారు. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాజమణి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూక్‌హుస్సేన్, కార్పొరేషన్‌ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లక్ష్మీకాంతారావు, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top