ఆరు నెలల క్రితం అప్పుల్లో ఉన్న చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం (ఓపెన్ ఎయిర్‌జైలు) ప్రస్తుతం మిగులుతో నడుస్తోంది.
కుషాయిగూడ: ఆరు నెలల క్రితం అప్పుల్లో ఉన్న చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం (ఓపెన్ ఎయిర్‌జైలు) ప్రస్తుతం మిగులుతో నడుస్తోంది. ఈ జైలులో ఖైదీలు కూరగాయల సాగు, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం చేపడుతూ ఆదాయం చూపుతున్నారు. కూరగాయలు, పాలు, చికెన్ వంటి ఉత్పత్తులను చర్లపల్లి కేంద్ర కారాగార ఖైదీలకు సరఫరా చేయడంతో పాటుగా మిగిలిన ఉత్పత్తులను సాధారణ ప్రజానీకానికి విక్రయిస్తున్నారు.
దీంతో పాటు చర్లపల్లి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్ ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. ఆరు నెలల క్రితం ఇదే జైలు సుమారు రూ.12 లక్షల లోటుతో ఉంది. ఈ జైలు పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజేష్‌కుమార్ ఆదాయ పెంపుపై దృష్టి సారించి ఆమేరకు ఫలితాలు రాబట్టారు. పెట్రోలు బంక్ ద్వారా ఐదు లక్షలు, కూరగాయల ద్వారా రూ.1.5 లక్షలు, పాడి, పౌల్ట్రీ ఇతర రంగాల ద్వారా మరో రూ. 2.5 లక్షల ఆదాయం సమకూరుతోందని రాజేష్‌కుమార్ వెల్లడించారు. దీంతో ఆరు నెలల క్రితం 12 లక్షల అప్పుల్లో ఉన్న చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు ప్రస్తుతం రూ.30 లక్షల మిగులులో ఉందన్నారు. ఇది ఖైదీల సమిష్టి కృషితోనే సాధ్యమయిందని తెలిపారు.