‘కొత్త’ వాళ్ల లెక్క ఇక పక్కా!  | Changes in the Public Safety Act | Sakshi
Sakshi News home page

‘కొత్త’ వాళ్ల లెక్క ఇక పక్కా! 

Aug 16 2018 1:13 AM | Updated on Aug 16 2018 1:13 AM

Changes in the Public Safety Act - Sakshi

2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో బాంబు దాడికి పాల్పడిన ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదులు హబ్సిగూడలోని బంజారా నిలయం అపార్ట్‌మెంట్‌లో విద్యార్థుల ముసుగులో అద్దెకు దిగారు. ఈ ఘటన తర్వాత అద్దెకు ఉండే వారి వివరాలు పక్కాగా తెలుసుకోవాలని పోలీసు విభాగం సూచించినా అమలుకు నోచుకోలేదు. అనంతరం 2013లో ముష్కరులు అబ్దుల్లాపూర్‌మెట్‌లో షెల్టర్‌ తీసుకున్నారు. అక్కడి నుంచే దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లకు పాల్పడి వెళ్లిపోయారు. ఇలా నగరంతో పాటు శివార్లలో ఆశ్రయం పొందుతూ అక్రమంగా గుర్తింపు కార్డులు పొందుతున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు తరచూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం చక్కదిద్దే చర్యలు చేపట్టింది.     
– సాక్షి, హైదరాబాద్‌ 

రాష్ట్రంలో ఇలా... 
విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న హైదరాబాద్, ఇతర జిల్లాలకు నిత్యం వందల మంది వలసలు వస్తున్నారు. ఇలా వచ్చిన వారు అద్దెకు ఇళ్లు తీసుకుని నివసించడంతో పాటు చిన్న చిన్న పనులు చేయడం, ఉద్యోగాలు నిర్వర్తించడం జరుగుతోంది. ఇలా అన్ని రాష్ట్రాలకూ చెందిన వారు వచ్చి ఉంటున్నప్పటికీ వారికి సంబంధించిన వివరాలు ఎక్కడా అందుబాటులో ఉండట్లేదు. ఈ పరిస్థితులు కొన్ని సందర్భాల్లో అసాంఘిక శక్తులకు కలసి వస్తున్నాయి. ప్రత్యేక ‘ఆపరేషన్స్‌’పై వస్తున్న ముష్కరమూకలు షెల్టర్‌ ఏర్పాటు చేసుకుని మరీ తమ ‘పని’పూర్తి చేసి వెళ్లిపోతున్నాయి. ఈ అసాంఘిక శక్తులు చిక్కిన తర్వాత జరిగే విచారణలోనే మకాంకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.  

గోవాలో అలా..
పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే గోవాలో ఈ తనిఖీ పక్కాగా జరుగుతోంది. అక్క డ ఎవరైనా బయటి రాష్ట్రాల వారు వచ్చి అద్దెకు దిగితే యజమాని వారి వివరాలను సమీప పోలీసుస్టేషన్‌లో అందిస్తారు. ఠాణాల్లో ప్రత్యేకంగా టెనింట్స్‌ రిజిస్టర్‌ నిర్వహించే పోలీసులు ఆయా ఇళ్ల వద్దకు వెళ్లి అద్దెకు దిగిన వారిని పరిశీలిస్తారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారు అందించిన గుర్తింపు కార్డు ఆధారంగా స్వస్థలాల్లో తనిఖీలు చేస్తుంటారు. ఈ విధానం అక్కడి అసాంఘిక శక్తులకు చెక్‌ చెప్పడానికి ఉపకరించింది. 

ఇప్పుడేం చేస్తారు.. 
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసించే, ఉద్యోగం చేసే వారి వివరా లు పక్కాగా నమోదు చేయించేలా పోలీసు విభాగం ఏర్పాట్లు చేయనుంది. ప్రజా భద్రతా చట్టంలో మార్పుచేర్పుల ద్వారా ప్రత్యేక పోర్టల్‌ అమలు చేయాలని యోచి స్తోంది. శీతాకాల లేదా వర్షాకాల శాసనసభ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టించాలని భావిస్తోంది. టెనింట్స్, ఎం ప్లాయీ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.  

పోర్టల్‌ పని చేస్తాదిలా..
ఇతర రాష్ట్రాల వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా యజమానులు/సంస్థలు వారి ఫొటోతో సహా గుర్తింపు కార్డులు, ఇతర వివరాలను ఈ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. స్పెషల్‌ బ్రాంచ్‌ అధీనంలో ఏర్పడే ప్రత్యేక విభాగం వీటిని పరిశీలిస్తుంది. అనుమానం వచ్చిన వారి వివ రాలను క్రాస్‌ చెక్‌ చేస్తుంటుంది. ఈ విధానం కచ్చితంగా అమలు చేయడంలో భాగంగా 2014లో అమల్లోకి వచ్చిన ప్రజా భద్రతా చట్టంలో కొన్ని మార్పుచేర్పులు చేయనుంది. వీటి ప్రకారం వివరాలు అప్‌లోడ్‌ చేయడంలో విఫలమైన, నిర్లక్ష్యం వహించిన యజమాని బాధ్యుడవుతాడు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం పోలీసు విభాగానికి ఉండనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement