నయా కండక్టర్లు

Cancellation Of 800 buses in City By TSRTC - Sakshi

బస్సుల నుంచి బస్టాపులకు మారిన కండక్టర్ల విధులు

ఆటోలను తరిమేది వారే..బస్సుల వివరాలు రాసేది వారే

మైక్‌ పట్టుకుని వివరాలు చెప్పేది వారే

ఆర్టీసీ పొదుపులో భాగంగా బస్సుల రద్దుతో రోడ్డున పడిన కండక్టర్లు

విచిత్రమేంటంటే అసలు విధులు కాకుండా కొసరు పనుల్లో బిజీగా ఉన్న ఈ ముగ్గురు ఉన్నది ఉప్పల్‌ బస్టాప్‌లోనే కావటం విశేషం. డిపోలో ఇప్పటికే ఇద్దరు కంట్రోలర్లు ఉన్నారు. వారు కాకుండా కొత్తగా ఇలా ముగ్గురొచ్చారు. ఇలా ప్రధాన ప్రాంతాల్లో కండక్టర్లు ఈ పనుల్లో దర్శనమిస్తున్నారు. అసలు పనులు వదిలి ఇలా రోడ్డెక్కటానికి కారణం ఆర్టీసీ పొదుపు చర్యల్లో భాగమే.

బస్సులు గ్యారేజీకి.. వీరు బస్టాపులకు.. 
ఆర్టీసీ నష్టాలను తగ్గించే క్రమంలో ఇటీవల పెద్ద సంఖ్యలో సొంత బస్సులను ఆర్టీసీ ఉపసంహరించుకుంది. ఇందులో సిటీలో దాదాపు 800 ఉండగా, కొత్తగా జిల్లాల్లో 1,300 అద్దె బస్సులు వచ్చి చేరనుండటంతో అంతే సంఖ్యలో సొంత బస్సులను రద్దు చేసుకుంటోంది. దీంతో పెద్ద సంఖ్యలో కండక్టర్లు, డ్రైవర్లు మిగిలిపోతున్నారు. నగరంలో ఇప్పటికే 800 బస్సుల రద్దు అమల్లోకి వచ్చింది. దీంతో దాదాపు 1,600 మంది వరకు కండక్టర్లు మిగిలిపోతున్నారు.

ఇప్పటివరకు ఉన్న ఖాళీల్లో కొందరిని సర్దుబాటు చేయగా దాదాపు వేయి మందికిపైగా మిగిలిపోయారు. డ్రైవర్లలో మిగిలిన వారిని ఇతర శాఖలకు పంపేందుకు సిద్ధపడగా, ప్రస్తుతానికి ఫైర్‌ సర్వీసెస్‌ 42 మందిని తీసుకుంది. మిగతావారిలో ఎక్కువమందిని కొత్తగా ప్రారంభిస్తున్న సరుకు రవాణా విభాగానికి పంపుతున్నారు. కండక్టర్లకు మాత్రం వేరే శాఖల్లో అవకాశం లేక ఆర్టీసీలోనే అంతర్గతంగా వినియోగించుకోవాల్సి వచ్చింది.

బస్సు రాగానే మైక్‌ పట్టుకుని దాని వివరాలను ప్రయాణికులకు వెల్లడిస్తున్న ఈయన కూడా సీనియర్‌ కండక్టరే. కానీ కండక్టర్‌ విధులు దక్కక ఇలా అదనపు డ్యూటీలో ఉండాల్సి వచ్చింది.
సరుకు రవాణా విభాగంలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా కొందరిని తీసుకోగా, మరికొందరిని ఇలా బస్టాపుల్లో ఉంచి బస్సుల నియంత్రణ, ఆటోలు అడ్డుగా లేకుండా చూడటం, ప్రయాణికులకు సమాచారమివ్వటం లాంటి పనులకు వినియోగిస్తున్నారు. బస్టాపుల్లో ఆటోలు తిష్ట వేయకుండా కొన్ని చోట్ల హోమ్‌గార్డులుండేవారు. ఇప్పుడు మిగిలిపోయిన కండక్టర్లను ఆయా బస్టాపులకు పంపి హోంగార్డుల పనులు వారికే అప్పగించినట్టు సమాచారం. ఉప్పల్‌ బస్టాపులో హోంగార్డులు లేక ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. కండక్టర్లనే బెదిరింపులకు గురిచేస్తూ బస్సులకు అడ్డంగా నిలిపి ప్రయాణికులను మళ్లించుకుంటున్నారు.

ఈయన ఆర్టీసీలో సీనియర్‌ కండక్టర్‌. ప్రస్తుతం అసలు విధులు వదిలి ఉప్పల్‌ బస్టాప్‌లో బస్సుల రాకకు అడ్డుగా ఉన్న ఆటోలను పక్కకు తోలే పనిలో ఇలా నిమగ్నమయ్యాడు.

సిటీలో 800 బస్సుల రద్దు.. 
నిజానికి నగరంలో బస్సులు తగ్గిపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగాయి. అసలే వాటి సంఖ్య చాలక కొన్ని ప్రాంతాలకు బస్సు ట్రిప్పులను నడపలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా 800 బస్సులను తగ్గించటంతో కాలనీలకు వెళ్లే సర్వీసులు చాలా రద్దయ్యాయి. తక్కువ దూరం తిరిగే సర్వీసులను దూరప్రాంతాలకు పొడిగించారు. ఫలితంగా బస్టాపుల్లో పడిగాపులు పెరిగాయి. ఇటు ప్రయాణికులకు అటు మిగిలిపోయిన సిబ్బందికి ఈ చర్య ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం వాస్తవాలు గుర్తించి పునరాలోచించాలన్న డిమాండు ప్రయాణికుల నుంచి బలంగా వస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top