కొలిక్కిరాని క్యాబ్స్‌ సమ్మె | cabs strike still contues over ola, uber | Sakshi
Sakshi News home page

కొలిక్కిరాని క్యాబ్స్‌ సమ్మె

Jan 10 2017 2:20 AM | Updated on Sep 5 2017 12:49 AM

కొలిక్కిరాని క్యాబ్స్‌ సమ్మె

కొలిక్కిరాని క్యాబ్స్‌ సమ్మె

ఓలా, ఉబెర్‌ సంస్థల తీరుకు నిరసనగా క్యాబ్‌ డ్రైవర్లు చేపట్టిన క్యాబ్‌ల బంద్‌ ఇంకా కొనసాగుతోంది.

చర్చలకు రాని ఓలా, ఉబెర్‌
గాంధీలో కొనసాగుతున్న శివ నిరాహారదీక్ష
క్యాబ్‌ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం...


సాక్షి, హైదరాబాద్‌
ఓలా, ఉబెర్‌ సంస్థల తీరుకు నిరసనగా క్యాబ్‌ డ్రైవర్లు చేపట్టిన క్యాబ్‌ల బంద్‌ ఇంకా కొనసాగుతోంది. సోమవారం నాటి చర్చలకు ఇరు సంస్థల ప్రతినిధులు హాజరు కాకపోవడంతో... ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు ఫైనాన్స్‌ సంస్థల వేధింపులు, అప్పుల బాధలు తట్టుకోలేక ఓ క్యాబ్‌ డ్రైవర్‌ పంజగుట్ట ఫ్లైఓవర్‌ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్‌ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. చికిత్స అందిస్తున్నా... ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆయన షుగర్, బీపీ లెవెల్స్‌ పడిపోతున్నాయని వైద్యులు తెలిపారు. కాగా, తమ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని శివ తెలిపారు. గత నెల 30 అర్ధరాత్రి నుంచి క్యాబ్‌ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు.

తన కారు అద్దాలు తానే ధ్వంసం చేసి...
ఈసీఐఎల్‌కు చెందిన గొడుగుల రమేశ్‌(42) ఉబెర్‌ ప్రకటనలకు ఆకర్షితుడై గతేడాది ఈఎంఐ పద్ధతిలో కారు కొన్నాడు. అయితే ఆశించిన స్థాయిలో ఆదాయం రాక వాయిదాలు చెల్లించలేని పరిస్థితి. ప్రస్తుతం సమ్మె కొనసాగుతుండటంతో మరింత అప్పుల్లో కూరుకుపోయాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తన కారుతో పంజగుట్ట ఫ్లైఓవర్‌ ఎక్కాడు. కారు అద్దాలను తానే ధ్వంసం చేసుకుని వెంట తీసుకువెళ్లిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకొనేందుకు యత్నించాడు. అదే మార్గం గుండా వెళ్తున్న ప్రయాణికులు అడ్డుకుని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముప్పు తప్పింది. పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

క్రమంగా రోడ్డెక్కుతున్న కార్లు...
ఇదిలావుండగా... గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నా ఎలాంటి పరిష్కారం లేకపోవడంతో క్యాబ్‌ డ్రైవర్లు ఒక్కొక్కరే రోడ్డుపైకి వస్తున్నారు. సోమవారం పెద్ద సంఖ్యలోనే క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మూడు రోజుల పాటు జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వకపోవడం, సమ్మెతో పెరిగిన ఆర్థిక ఇబ్బందులు వారిని తీవ్ర నిరాశకు గురిచేయడంతో చేసేది లేక మళ్లీ స్టీరింగ్‌ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement