breaking news
cabs strike
-
మూడో రోజుకు చేరిన ఓలా, ఉబర్ స్ట్రైక్
ముంబై: నగరంలో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె మూడో రోజుకి చేరుకుంది. ఓలా, ఉబర్ సంస్థలు తమకు చెల్లించే వాటాను పెంచాలని, దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్లతో ముంబై నగరంలోని క్యాబ్ డ్రైవర్లు సోమవారం నుంచి సమ్మె చేపట్టారు. దీంతో ముంబైలో 80 శాతం వరకు ఓలా, ఉబర్ సంస్థలకు చెందిన క్యాబ్‌లు రోడ్డెక్కడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమేర ఆ సంస్థలకు చెందిన క్యాబ్‌లు నడిచినప్పటికీ.. ధరలు రెండింతలు ఉండటంతోపాటు.. వాటి కోసం అధిక సమయం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు క్యాబ్‌లు నడుపుతున్న వారిపై కూడా స్ట్రైక్‌లో పాల్గొన్న డ్రైవర్లు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ప్రయాణికులు తమ భద్రతపైన ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా క్యాబ్ సర్వీస్‌లకు అలవాటు పడ్డ జనాలు మూడు రోజులుగా ఓలా, ఉబర్ సేవలు పెద్ద ఎత్తున నిలిచి పోవడంతో సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. -
కొలిక్కిరాని క్యాబ్స్ సమ్మె
చర్చలకు రాని ఓలా, ఉబెర్ గాంధీలో కొనసాగుతున్న శివ నిరాహారదీక్ష క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం... సాక్షి, హైదరాబాద్ ఓలా, ఉబెర్ సంస్థల తీరుకు నిరసనగా క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన క్యాబ్‌ల బంద్ ఇంకా కొనసాగుతోంది. సోమవారం నాటి చర్చలకు ఇరు సంస్థల ప్రతినిధులు హాజరు కాకపోవడంతో... ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు ఫైనాన్స్ సంస్థల వేధింపులు, అప్పుల బాధలు తట్టుకోలేక ఓ క్యాబ్ డ్రైవర్ పంజగుట్ట ఫ్లైఓవర్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. చికిత్స అందిస్తున్నా... ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆయన షుగర్, బీపీ లెవెల్స్ పడిపోతున్నాయని వైద్యులు తెలిపారు. కాగా, తమ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని శివ తెలిపారు. గత నెల 30 అర్ధరాత్రి నుంచి క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. తన కారు అద్దాలు తానే ధ్వంసం చేసి... ఈసీఐఎల్‌కు చెందిన గొడుగుల రమేశ్(42) ఉబెర్ ప్రకటనలకు ఆకర్షితుడై గతేడాది ఈఎంఐ పద్ధతిలో కారు కొన్నాడు. అయితే ఆశించిన స్థాయిలో ఆదాయం రాక వాయిదాలు చెల్లించలేని పరిస్థితి. ప్రస్తుతం సమ్మె కొనసాగుతుండటంతో మరింత అప్పుల్లో కూరుకుపోయాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తన కారుతో పంజగుట్ట ఫ్లైఓవర్ ఎక్కాడు. కారు అద్దాలను తానే ధ్వంసం చేసుకుని వెంట తీసుకువెళ్లిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకొనేందుకు యత్నించాడు. అదే మార్గం గుండా వెళ్తున్న ప్రయాణికులు అడ్డుకుని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముప్పు తప్పింది. పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. క్రమంగా రోడ్డెక్కుతున్న కార్లు... ఇదిలావుండగా... గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నా ఎలాంటి పరిష్కారం లేకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు ఒక్కొక్కరే రోడ్డుపైకి వస్తున్నారు. సోమవారం పెద్ద సంఖ్యలోనే క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మూడు రోజుల పాటు జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వకపోవడం, సమ్మెతో పెరిగిన ఆర్థిక ఇబ్బందులు వారిని తీవ్ర నిరాశకు గురిచేయడంతో చేసేది లేక మళ్లీ స్టీరింగ్ పడుతున్నారు.