ఓఆర్‌ఆర్‌కు గ్రహణం | But the beginning of the Outer Ring Road works | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌కు గ్రహణం

Oct 30 2014 2:27 AM | Updated on May 25 2018 7:33 PM

ఓఆర్‌ఆర్‌కు గ్రహణం - Sakshi

ఓఆర్‌ఆర్‌కు గ్రహణం

ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభానికి నోచుకోవడం లేదు. పెద్ద అంబర్‌పేట్-ఘట్‌కేసర్ మధ్య ‘ఔటర్’ పనులు పూర్తయి నెలన్నర కావస్తున్నా రోడ్డు ప్రారంభానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఘట్‌కేసర్-పెద్ద అంబర్‌పేట్
* మధ్య ప్రారంభం కాని ఔటర్ రింగ్ రోడ్డు పనులు
* పూర్తయి నెలన్నర దాటిన వైనం
* రోడ్డు ప్రారంభించాలని వాహనదారుల వేడుకోలు
* మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు
ఘట్‌కేసర్: ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభానికి నోచుకోవడం లేదు. పెద్ద అంబర్‌పేట్-ఘట్‌కేసర్ మధ్య ‘ఔటర్’ పనులు పూర్తయి నెలన్నర కావస్తున్నా రోడ్డు ప్రారంభానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద అంబర్‌పేట్- ఘట్‌కేసర్ మధ్య ఉన్న 20 కిలోమీటర్ల దూరం రహదారికి ఆగస్టులోనే తుదిమెరుగులు కూడా దిద్దారు. జంతువులు ప్రవేశించకుండా కంచె, సిగ్నల్స్, సూచికలు ఏర్పాటు చేశారు. గత ఆగస్టు చివరి వారంలోనే ఈ రోడ్డును ప్రారంభించనున్నట్లు హెచ్‌ఎండీఎం అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత రోడ్డు ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వాహనదారులకు షాకినిచ్చారు.
 
వాహనదారుల పాట్లు..
పెద్ద అంబర్‌పేట్-ఘట్‌కేసర్‌ల మధ్య ఔటర్ రింగ్ రోడ్డును ప్రారంభిస్తే వాహనదారులకు తీవ్ర వ్యయప్రయాసాలు తప్పనున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి మధ్య  దూరంతోపాటు సుమారు 45 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న లింగాపూర్, కొర్రెముల, బాచారం, హయాత్‌నగర్ గ్రామాలకు నేరుగా వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం వాహనదారులు ఘట్‌కేసర్ నుంచి పెద్ద అంబర్‌పేటకు వెళ్లాలంటే ప్రయాణికులు మొదటగా ఉప్పల్‌కు చేరుకొని అక్కడినుంచి ఎల్‌బీనగర్ మీదుగా గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ దూర భారంతోపాటు ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అదే ఘట్‌కేసర్-పెద్ద అంబర్‌పేట్ రోడ్డు అందుబాటులోకి వస్తే ఈ వ్యయప్రయాసాలు లేకుండా నేరుగా చేరుకోవచ్చు. ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు తెలియక వాహనదారులు ఔటర్ దారి ఎక్కి ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఒక బైకిస్టు  ఔటర్ రోడ్డుకు అడ్డంగా ఉన్న మట్టిదిబ్బను బైక్ ఎక్కించబోయి ప్రమాదానికి గురై మృతిచెందాడు. గతంలో రాష్ట్ర సీఎం చేతుల మీదుగా రోడ్డు ప్రారంభానికి అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్  నీరబ్‌కుమార్ ప్రయత్నాలు చేశారు. చివర్లో ఇక్కడి నుంచి ఆయన బదలీపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జిగా రమేష్ చంద్ర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కూడా రోడ్డును ప్రారంభించకుంటే నేరుగా వెళ్లి రమేష్ చంద్రను కలుసుకోవాలని స్థానికులు యోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement