
స్త్రీ వేషధారణలో బుర్రా
సాక్షి, హైదరాబాద్: నాట్యాచార్య, అభినయ సరస్వతి, నాట్య మయూరిలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ప్రముఖ రంగస్థల నటులు, కవి, కావ్యరచయిత, వెండితెర, బుల్లితెరలపై సుపరిచితులయిన మహాకళాకారుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (83) లంగర్‌హౌస్‌లోని తన స్వగృహంలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. స్త్రీ పాత్రధారణలో గొప్ప నటుడిగా కీర్తి గడించిన శాస్త్రి 1936లో జన్మించారు. ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. శాస్త్రి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో నిర్వహించారు.
ఆయనదీ ‘మహా ప్రస్థానమే’
1936, ఫిబ్రవరి 9న కృష్ణాజిల్లా దివి తాలుకా కోడూరులో బుర్రా పద్మనాభ సోమయాజులు, సీతామహాలక్ష్మి దంపతులకు జన్మించిన ఈయన మేనమామ కోటేశ్వరరావు పర్యవేక్షణలో పద్యాలు నేర్చుకున్నారు. వానపాముల సత్యనారాయణ వద్ద కూడా భావయుక్తంగా పద్యాలు పాడడంపై శిక్షణ తీసుకున్నారు. ఈయనలోని నటనా విశిష్టతను బి.వి.నర్సింహారావు గుర్తించి నూతన ప్రయోగ రీతులను నేర్పారు. అకుంఠిత దీక్షతో నటన నేర్చుకున్న శాస్త్రి, ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి తదితర పాత్రల్లో నటించారు. ఆయన చూపు మన్మథబాణంలా ఉండేదని, ప్రేక్షకుల కరతాళధ్వనులతో మారుమ్రోగిపోయేదని, శృంగార రసాధి దేవతగా ఆయన ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేవారని నాటక ప్రియులు చెబుతుంటారు. ఆయన వేసిన నాటకాల్లో స్త్రీ పాత్రల్లోనే ఎక్కువగా నటించినందున ‘చింతామణి శాస్త్రి’గా గుర్తింపు పొందారు.
సత్యసాయిబాబా నాటక సమాజాన్ని స్థాపించిన ఆయన అనేక ప్రదర్శనల ద్వారా రసజ్ఞులను మెప్పించారు. 1970వ దశకంలో చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన, వీరంకి శర్మ దర్శకత్వంలో ‘నాలాగా ఎందరో’అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన స్వయంకృషి సినిమాలోనూ ఓ పాత్రను పోషించారు. సత్యనారాయణస్వామి అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. శిఖరం, పుత్తడిబొమ్మ, ఆడదే ఆధారం, రుద్రపీఠం సీరియళ్లలో నటించారు. ఈయన దర్శకత్వం వహించిన ‘కృష్ణాతీరం’అనే సీరియల్‌కు నంది అవార్డు కూడా వచ్చింది.
ఈయన నటనలోనే కాదు ప్రవచనాలు చెప్పడంలోనూ సిద్ధహస్తులుగా పేరొందారు. దేవీ భాగవతం, హనుమత్‌చరిత్ర ప్రవచాలను చెప్పేవారు. కవిగా వాల్మీకి రామాయణాన్ని తనదైన పంథాలో రాసిన ఘనత ఈయన సొంతం. ‘అష్టావిధ శృంగార నాయికలు’అనే కావ్యంతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. వేమన చరిత్ర, ప్రణవక్షేత్రం లాంటి ప్రసిద్ధ నాటకాల్లో నటించారు. ఈయన స్వయంగా రాసిన ‘త్యాగయ్య’అనే నాటకం వేదిక ఎక్కకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణ వార్త తెలియడంతో సినీ, సాహితీ, రంగస్థల రంగాలకు చెందిన పలువురు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.