వెటర్నరీ వర్సిటీ ముందే ప్రాణం విడిచిన గేదె

Buffalo leaving to life veterinary hospital before - Sakshi

రాజేంద్రనగర్‌: అక్కడ మూగ జీవాలకు ప్రాణం పోసే ఆస్పత్రి ఉంది. దాని పక్కనే రాష్ట్రంలోని మూగ జీవాలకు సోకే రోగాలకు మందులను తయారు చేసే డాక్టర్ల బృందం ఉండే కార్యాలయమూ ఉంది. కానీ, అదే కార్యాలయం ముందు ఒక మూగ జీవం రోడ్డు ప్రమాదంలో గాయపడి నరకయాతన పడి మృతి చెందింది. పదుల సంఖ్యలో డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఆ దారి గుండా వెళ్లారు తప్ప ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రాణం పోసే ఆస్పత్రి ముందే ప్రాణం విడిచింది ఆ జీవి. వివరాలు.. రాజేంద్రనగర్‌ రేడియల్‌ రోడ్డు ప్రాంతంలో పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. ఇందుకు సంబంధించిన కళాశాల, ఆస్పత్రి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వెటర్నరీ మెడిసిన్‌ కార్యాలయాలు ఉన్నాయి.

ప్రధాన రహదారిపైనే ఈ భవనాలు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ గేదెను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలకు గురైన ఆ గేదె.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కార్యాలయం గేటు ముందే పడి విలవిల్లాడింది. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కొట్టుమిట్టాడి ప్రాణాలు విడిచింది. ఉదయం ఈ కార్యాలయానికి శాస్త్రవేత్తలు, డాక్టర్లు వచ్చారు తప్ప అక్కడే ఉన్న గేదెను మాత్రం పట్టించుకోలేదు. మూగ జీవాల ప్రాణాలు కాపాడాల్సిన శాస్త్రవేత్తలు, డాక్టర్లకు నిలయమైన వారి కార్యాలయం ముందే మూగ జీవి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గేదె మృతిచెందిన ప్రాంతానికి కూతవేటు దూరంలో జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్‌ సర్కిల్‌ కార్యాలయం ఉన్నా గేదె కళేబరాన్ని తొలగించే ప్రయత్నం చేయలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top