రూ.21 కోట్ల విలువైన దున్నపోతు హఠాన్మరణం
పుష్కర్ పశువుల మేళాలో విషాదం
రాజస్థాన్‌లోని చారిత్రక పుష్కర్ జంతువుల మేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన రూ.21 కోట్ల విలువైన దున్నపోతు హఠాన్మరణం కలకలం రేపింది. లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించిన ఈ మేళాకు, ఆ దున్నపోతే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ భారీ విలువైన దున్నపోతును ప్రత్యేక ఏర్పాట్ల మధ్య రాజస్థాన్‌లోని పుష్కర్‌కు తీసుకువచ్చారు. దాని ఆరోగ్యం శుక్రవారం క్షీణించడంతో, వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్యుల బృందాన్ని హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపారు. కానీ, దాని అధిక శరీర బరువు, వేగంగా క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా వైద్యులు ఎంత ప్రయతి్నంచినా ఆ మూగజీవిని కాపాడలేకపోయారు.
వైరల్ వీడియోపై ప్రజాగ్రహం
దున్నపోతు చనిపోయిన దృశ్యాలున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చనిపోయిన దున్నపోతు చుట్టూ సందర్శకులు, సంరక్షకులున్న ఈ వీడియో వేలాది మంది నెటిజన్లను కదిలించింది. నటి స్నేహ ఉల్లాల్ స్పందిస్తూ.. ‘మరిన్ని హార్మోన్లు, యాంటీబయాటిక్స్, గ్రోత్ హార్మోన్లను ప్రేరేపించండి. ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తూ.. దాన్ని సహజం అని పిలవండి. మీరంతా రోగగ్రస్థ మనుషులు’.. అని మండిపడ్డారు. ‘ఇది వ్యాపారం పేరుతో సాగించిన జంతు హింస’.. అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘ఇది హఠాన్మరణం కాదు. బీమా కోసం దాన్ని చంపాలని ప్లాన్ చేశారు.’.. అని ఇంకో నెటిజన్ ఆరోపించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెలు, పశువుల సంత
పుష్కర్ మేళాగా కూడా పిలిచే ఈ జాతర రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఏటా నిర్వహిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెలు, పశువుల సంతలలో ఒకటి. సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్‌లో జరిగే ఈ వారం రోజుల మేళాకు.. భారతదేశం నలుమూలల నుంచి, విదేశాల నుండి వేలాది మంది సందర్శకులు తరలి వస్తారు. ఇది ఒంటెలు, గుర్రాలు, పశువుల వ్యాపారానికి ఒక ప్రధాన కేంద్రం. ఒంటె పందాలు, జానపద ప్రదర్శనలు, వివిధ రకాల హస్తకళలు, వ్రస్తాలు, స్థానిక రుచికరమైన వంటకాలతో రాజస్థాన్ విశిష్ట సాంస్కృతిక వారసత్వాన్ని ఈ మేళా ప్రదర్శిస్తుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


