సూక్ష్మసేద్యం అనుమతులకు బ్రేక్‌

Brake to the subtle permissions - Sakshi

     సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో ఈ దుస్థితి

     దీంతో 1.20 లక్షల మంది రైతుల దరఖాస్తులు పెండింగ్‌

     నాబార్డు రుణం రూ.800 కోట్లు గతేడాది వరకు ఖర్చు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూక్ష్మసేద్యానికి బ్రేక్‌ పడింది. రైతులు చుక్కచుక్కనూ సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి నిధులలేమి సమస్యగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క దరఖాస్తుకు కూడా ఉద్యానశాఖ అనుమతివ్వలేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెండేళ్లుగా నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో సూక్ష్మసేద్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రెండేళ్ల నుంచి రూ.200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.  

భారీ సబ్సిడీతో ప్రోత్సాహం ఇచ్చినా.. 
ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ. 25–30 వేల వరకు ఖర్చు కానుంది. నాలుగు ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ. లక్షకు పైగానే ఖర్చుకానుంది. అయితే ఈ సూక్ష్మసేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కపైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీంతో రైతులు సూక్ష్మసేద్యం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. 2016–17లో కేవలం 10,550 మంది రైతులు 32,710 ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా, 2017–18లో ఏకంగా 3.85 లక్షల ఎకరాలకు 1.16 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరికి సూక్ష్మసేద్యాన్ని మంజూరు చేసింది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం నాబార్డు నుంచి రూ. 800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది నాటికి చెల్లింపులకు పూర్తయింది. ఇంకా రూ.200 కోట్లు కేంద్రం వాటా పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు.  

పెండింగ్‌లో దరఖాస్తులు...  
ఇప్పటివరకు నిధులు పెండింగ్‌లో ఉండిపోవడం, ఈ ఏడాది బడ్జెట్‌లో సూక్ష్మసేద్యం పథకానికి కేటాయించిన రూ.127 కోట్లలో ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో ఉద్యానశాఖ సందిగ్ధంలో పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1.20 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. నిధులు లేకపోవడంతో వాటి అనుమతులకు బ్రేక్‌ పడింది. తమ వాటాగా ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై తమకు కేంద్రం మెమో కూడా ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే సూక్ష్మసేద్యంలో తెలంగాణ వెనుకబడిందని కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ వ్యవసాయ గణాంక నివేదికలోనూ స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ తెలంగాణలో కేవలం 3.31 లక్షల ఎకరాల్లోనే సూక్ష్మసేద్యంతో రైతులు సాగు చేస్తున్నారని వెల్లడించింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. సూక్ష్మసేద్యం అమలుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్ల రుణం తీసుకొచ్చినా పెద్దగా మార్పురాలేదన్న ఆరోపణలున్నాయి.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top