బయోమెట్రిక్‌తో అక్రమాలకు చెల్లు..!

Biometric Attendance System Will Help To Check Irregularities In Govt Hostels - Sakshi

హాస్టళ్లలో బయోమెట్రిక్‌ విధానంలో విద్యార్థుల హాజరు

సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో యంత్రాల బిగింపు

ఇక హాస్టల్‌లో ఉన్నవారికే బిల్లు

జిల్లాలో 61 ఎస్సీ హాస్టళ్లు

సాక్షి, నల్లగొండ: హాస్టళ్లలో అక్రమాలకు చెక్‌ పడనుంది. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ప్రభుత్వం బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇకనుంచి పిల్లల హాజరు అంతా బయోమెట్రిక్‌ పద్ధతిలోనే తీసుకుంటారు. ఏరోజు ఎంతమంది విద్యార్థులు బయోమెట్రిక్‌ ద్వారా హాజరువేస్తారో వారికే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. తద్వారా అక్రమాలకు చెక్‌ పడనుంది. గతంలో రిజిష్టర్ల ద్వారా హాజరు తీసుకునేవారు. దాంతో పిల్లలు ఉన్నా లేకున్నా ఎక్కువ రాసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్‌ యంత్రాల కారణంగా అలాంటి వాటికి అవకాశాలు ఉండవు. ప్రస్తుతం కళాశాలల్లో చదవని విద్యార్థులు కూడా హాస్టళ్లలో ఉంటూ వస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇక నుంచి చెక్‌ పడనుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం మిగలనుంది. 

జిల్లాలో 61 ఎస్సీ హాస్టళ్లు
జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 హాస్టళ్లు ఉన్నాయి. అందులో 46 ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు ఉండగా 15 కళాశాల హాస్టళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బయోమెట్రిక్‌ యంత్రాలను బిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాకు యంత్రాలను పంపించారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలోని హాస్టళ్లన్నింటికీ బ యోమెట్రిక్‌ మిషన్లను బిగించగా దేవరకొండ డివిజన్‌లో ఇంకా కొనసాగుతోంది. వారం రోజుల్లోగా అన్ని హాస్టళ్లకు బయోమెట్రిక్‌ మిషన్లను బిగించనున్నారు. 

బయోమెట్రిక్‌ ద్వారానే హాజరు..
గతంలో హాస్టళ్లలో విద్యార్థుల హాజరు రిజిస్టర్ల ద్వా రా కొనసాగేది. హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల కంటే ఎ క్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా పేర్లు రాసుకోవడం.. వారు ఇళ్లకు వెళ్లినా ఉన్నట్లుగా నమోదు చేసి.. కొం దరు హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు తప్పుడు బిల్లులు పొందేవారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎంతో గండి పడేది. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్‌ మిషన్ల కారణంగా అలాంటి వాటికి చెక్‌ పడనున్నాయి. 

ఏరోజు బిల్లు ఆరోజే జనరేట్‌
హాస్టల్‌లో విద్యార్థి బయోమెట్రిక్‌ ద్వారా హాజరు వేస్తారు. దాంతో ఆరోజులో ఎంతమంది విద్యార్థులు ఆ హాస్టల్‌ నుంచి బయోమెట్రిక్‌ ద్వారా వేలి ముద్రవేస్తారో వారికి హాజరు ఆన్‌లైన్లో రికార్డు అవుతుంది. ఆ రోజే పిల్లలు చేసిన భోజనానికి సంబంధించిన బిల్లు జనరేట్‌ అవుతుంది. అలా నెల రోజులపాటు హాజరైనటువంటి విద్యార్థులకు సంబంధించి బిల్లులను నెలనాడు సంబంధింత హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారి తీసుకొని బిల్లుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చదివే పిల్లలకే భోజనం..
ప్రస్తుతం మాన్యువల్‌ పద్ధతిన హాజరు తీసుకోవడం వల్ల కొన్ని హాస్టళ్లలో వార్డెన్లకు నచ్చజెప్పి కొందరు విద్యార్థులు ఉంటున్నారు. కొందరు చదువుకుంటుండగా మరికొందరు ఊరికే హాస్టల్‌లో ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు హాస్టల్‌ అధికారులను కూడా బెదిరించిన హాస్టల్‌లో ఉంటున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బయోమెట్రిక్‌ విధానం అమలైతే.. ఇక బయటి వ్యక్తులు హాస్టల్‌లో ఉంటే వారికి భోజనం పెట్టలేని పరిస్థితి. ఒకవేళ పెట్టినా అతనికి సంబంధించిన బిల్లురాదు. దాంతో అధికారే జేబు లో నుంచి కట్టాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో వారు హాస్టల్‌లో భోజనం పెట్టే పరిస్థితి ఉండదు. చదువుకునే పిల్లలే హాస్టల్‌లో ఉండే అవకాశం రానుంది.

బయోమెట్రిక్‌ యంత్రాలు బిగిస్తున్నారు..
జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్‌ యంత్రాలను బిగిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలో యాంత్రాల బిగింపు పూర్తయింది. దేవరకొండ డివిజన్లలో ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పూర్తి కాగానే విద్యార్థులకు నెంబర్‌ అలాట్‌ చేసి ఆతర్వాత బయోమెట్రిక్‌ ద్వారా ప్రతి రోజూ హాజరు నమోదు చేస్తాం.
– రాజ్‌కుమార్, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top