
మూసీ దాటేందుకు వాహనదారుల పాట్లు
అర్వపల్లి (తుంగతుర్తి) : మూసీ నదిలో బైక్ కొట్టుకుపోయింది. ఈ సంఘటన జాజిరెడ్డిగూడెం – వంగమర్తి గ్రామాల మధ్య గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం ఓగోడుకు చెందిన శివశంకర్ తన గ్లామర్ బైక్‌పై అర్వపల్లికి బయల్దేరాడు. హైదరాబాద్‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మూసీనదికి ఇటీవల వరద ఉధృతి పెరిగింది. మూసీనదిలో జాజిరెడ్డిగూడెం–వంగమర్తి మధ్య వంతెన నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
అయినా.. తుంగతుర్తి–నకిరేకల్ నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. గురువారం ఈ దారి గుండా వెళ్తున్న శివశంకర్ బైక్‌తో సహా మూసీలో కొట్టుకుపోయాడు. దీంతో భయాందోళనకు గురైన శివశంకర్ కొద్ది దూరం వెళ్లాక బైక్‌ను వదిలేసి అతికష్టం మీద బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ బైక్ కనిపించకుండా పోయింది. ఇటీవలే రూ.65వేలు వెచ్చించి బైక్‌కొనుగోలు చేసినట్లు శివశంకర్ వాపోయాడు. బైక్ కోసం స్థానికులు నదిలో గాలిస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున రాకపోకలు సాగించవద్దని రోడ్డు నిర్మాణ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా కోరుతున్నారు.