మార్చిలో భగీరథ

bhagiratha project in karimnagar - Sakshi

దసరాలోగా ‘డబుల్‌’ పూర్తి కావాలి

మార్చి 11న పండగలా పాస్‌పుస్తకాల పంపిణీ

ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి

ప్రతిష్టాత్మక పథకాలపై 15 రోజులకోసారి సీఎం సమీక్ష

అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేస్తే సహించం

రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

మిషన్‌ భగీరథ అధికారులపై మంత్రి అసంతృప్తి

సాక్షిప్రతినిధి, కరీంనగర్ ‌: జిల్లాలోని అన్ని గ్రామాలకుమార్చి మొదటివారంలో మిషన్‌ భగీరథ నీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దసరాలోగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడం లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. మార్చి 11న పండగ వాతావరణంలా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. బుధవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మిషన్‌ భగీరథ, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ ప్రగతి, భూరికార్డుల శుద్ధీకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌ భగీరథపై ప్రతి 15రోజులకోసారి సమీక్షిస్తున్నారని తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలో జనవరి 31లోగా అన్ని గ్రామాలకు బల్క్‌వాటర్‌ సరఫరా చేయాలని నిర్ణయించామని, ఈ మేరకు ఎందుకు గ్రామాలకు నీరు సరఫరా చేయడం లేదని మంత్రి మిషన్‌ భగీరథ ఇంజినీర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంకా 160 కిలోమీటర్ల పైపులైన్‌ వేయాల్సి ఉందని, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని మంత్రి ఎస్‌ఈ అమరేంద్రను ప్రశ్నించారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, మిషన్లను ఏర్పాటు చేసి 24 గంటలు పనులు చేయించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఏజెన్సీలు పనులు వేగవంతంగా చేయకుంటే తమకు తెలపాలని, వారిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అన్నారు. నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు సంబంధిత డీఈలు, ఏజెన్సీలతో సమీక్షించాలని ఆదేశించారు. 15రోజులకోసారి పనులను సమీక్షించాలని, వారంవారం పర్యవేక్షించాలని కలెక్టర్‌కు సూచించారు. పనుల్లో నాణ్యతప్రమాణాలు పాటించాలని ఏజెన్సీలను ఆదేశించారు. 

దసరాలోపు ‘డబుల్‌’ పూర్తి చేయాలి
జిల్లాకు మంజూరైన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలన్నింటిని దసరా పండుగ లోపు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. జిల్లాకు 6,454 ఇళ్లకు మంజూరువచ్చిందన్నారు. ఒక గ్రామంలో ఒకేచోట కాకుండా భూమి లభ్యత ప్రకారం కాలనీలవారీగా 5 నుంచి10 ఇళ్లను మంజూరు చేయాలని అదేశించారు. ఎమ్మెల్యేలు నెలకోమారు పనుల ప్రగతిని సమీక్షించాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్‌ తక్కువ ధరకు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

పండుగ వాతావరణంలో పాస్‌పుస్తకాల పంపిణీ
మార్చి 11న రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలన్నారు. జిల్లాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు మంజూరైన ప్రహరీలు, టాయిలెట్ల మరమ్మతు, అదనపు తరగతి గదుల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ఈఈ షఫీమియాను ఆదేశించారు. భవన నిర్మాణాలకు ఏమైనా భూసమస్య ఉంటే సంబంధిత తహసీల్దార్‌ పరిష్కరించి, హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మ ణ్‌రావు, చొప్పదండి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యేలు బొడిగే శోభ, వొడితెల సతీష్‌కుమార్, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రావీణ్య, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ అమరేంద్ర, ఆర్‌అండ్‌బీ ఈఈ రాఘవాచారి, కరీంనగర్, హుజూరాబాద్‌ ఆర్‌డీవోలు రాజాగౌడ్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top