
ఇంట్లోంచి బయటకొస్తే మాస్కులు ధరించడం ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో తప్పనిసరి అయింది. జపాన్ లాంటి దేశాల్లో కాలుష్యం కారణంగా ఈ పద్ధతి చాలాకాలంగా అమల్లో ఉంది కూడా. ఇలా కాకుండా ఇకపై భూమ్మీది జనాభా మొత్తం రోజూ మాస్కులు ధరించాల్సి వచ్చిందనుకోండి. ఏమవుతుంది? కళ్లు చెదిరే లెక్కలు మన కళ్లముందు కనిపిస్తాయి. సర్జికల్ మాస్కులు వేసుకోవడం వల్ల మన శరీర ద్రవాలు ఎదుటివారికి వెంటనే సోకవని.. తద్వారా అనేక వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని మనకు తెలుసు. కాలుష్యం బారి నుంచి రక్షణ పొందేందుకు కొంత మేరకు ఇవి ఉపయోగపడతాయి. భూమ్మీద మొత్తం 780 కోట్ల జనాభా ఉంది. వారందరికీ మెడికల్ మాస్కులు ఇవ్వాల్సి వస్తే.. వారానికి దాదాపు 5,500 కోట్ల మాస్కులు అవసరమవుతాయి.
ఇందుకు 300 కోట్ల డాలర్లు లేదా రూ. 22 వేల కోట్లు అవసరం. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి ఈ మాస్కులతో పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రపంచం మొత్తమ్మీద సుమారు 6 కోట్ల మంది వైద్య సిబ్బంది ఉంటారని అంచనా. వారందరికీ ఎన్–95 మాస్కులు ఇవ్వాలంటే ఒక్కో రోజుకు రూ. 229 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డబ్బులెలాగో తెచ్చి పెట్టినా వాటిని తయారు చేసే వాళ్లు కావాల్సి ఉంటుంది కాబట్టి మాస్కుల తయారీ అనేది ఓ కొత్త వృత్తిగా మారిపోతుంది. ప్రభుత్వాలు వాటిని ఉచితంగా ఇవ్వకపోతే ఒక్కొక్కరూ ఏటా మాస్కుల కోసం కనీసం రూ. వెయ్యి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంత సమయం తరువాత మాస్కుల్లో డిజైన్లు, ప్రత్యేక ఫీచర్లు రావడం మొదలవుతుంది. చదవండి: కరోనా కొనసాగితే కష్టమే..
అందరూ రోజంతా మాస్కులేసుకుంటే ముఖ కవళికలేవీ తెలియవు కాబట్టి ఎదుటివారు మన బాడీ లాంగ్వేజీని అర్థం చేసుకునే తీరు మారుతుంది. షేక్‌హ్యాండ్లు గట్రా లేకపోతే వైరస్‌ల వ్యాప్తి కొంత వరకూ తగ్గవచ్చుగానీ చేతులు కడుక్కోవడం, చేతులతో ముఖాన్ని తాకకపోవడం వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని మాస్కుల ప్రయోజనాన్ని లెక్కించాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ప్రపంచం మొత్తమ్మీద ఒక్క రోజులో 800 కోట్ల వాడి వదిలేసిన మాస్కులు చెత్తకుప్పల్లోకి చేరతాయి. వాటిని రీసైకిల్ చేయడం కోసం మరిన్ని ఫ్యాక్టరీలు పెట్టాల్సి వస్తుందన్నమాట!