నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ

Banswada Constituency Election Review Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: 1999 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఐదు చోట్ల తెలుగుదేశం పార్టీ, నాలుగు చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందగా, ఎల్లారెడ్డిలో నేరేళ్ల ఆంజనేయులు, బాల్కొండలో సురేశ్‌రెడ్డిలు మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. డిచ్‌పల్లిలో మండవ వెంకటేశ్వరావు నాలుగోసారి, నిజామాబాద్‌లో డి.శ్రీనివాస్‌ రెండోసారి జయకేతనం ఎగురవేశారు.

ఆ‘పాత’ మధురం
బోధన్‌ నియోజకవర్గ పరిధిలోని గోదావరి నదిపై నిర్మించిన అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం ప్రారంబోత్సవ సభలో దివంగత సీఎం వైఎస్సార్‌కు బోధన్‌కు చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్‌ పాషామోహినోద్దీన్‌ నాగలి బహూకరించారు. 2007 నవంబర్‌ 5న అలీసాగర ఎత్తిపోతల పథకం ప్రారంబోత్సవ సభ ఎడపల్లి మండలంలోని పోచారం వద్ద ఎత్తిపోతల పథకం మూడో పంప్‌హౌస్‌ వద్ద జరిగింది. ఈ సభలో వైఎస్సార్‌తో పాటు మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, డి.శ్రీనివాస్, షబ్బీర్‌ అలీ, సురేశ్‌రెడ్డిలు పాల్గొన్నారు.

సోషల్‌ మీడియా వార్తలపై పర్యవేక్షణ చేయాలి 
కామారెడ్డి రూరల్‌: నేను గత ఐదు పర్యాయాలుగా ఎన్నికలను చూశాను. కానీ ఆ రోజుల్లో డబ్బు ప్రభావం తక్కువగా ఉండేది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల వారు ఎన్నికల స్లిప్పులను పంచేవారు. కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర సెల్‌ఫోన్‌ ఉండడం, సామాజిక మాద్యమాల ద్వారా ఆడియో వీడియోల రూపంలో ప్రచారం చేస్తున్నారు. అయితే చిక్కల్లా వారు రూపొందించే వీడియోలు అవస్తావాలు, తమకు అనుకూలంగా రూపొందించుకోవడం వల్ల ప్రామాణికత దెబ్బతింటుంది. అందుకే సోషల్‌ మీడియా వార్తలపై ఎన్నికల సంఘం పర్యవేక్షణ చేయాలి. వివిధ అంశాలపై డిబెట్‌ పెట్టి అభ్యర్థుల సామర్థ్యం నిర్ణయించే స్థితి రావాలి. –ఉమాశేషారావు, లెక్చరర్, కామారెడ్డి 

దేవుడా.. మళ్లీ నన్ను గెలుపించు
మద్నూర్‌(జుక్కల్‌): దేవుడా ఈ సారి ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలుపించు.. ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే దేవుడిని వేడుకున్నారు. మండలంలోని సుల్తాన్‌పేట్‌లోని హనూమాన్‌ ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన దారిలో ఆలయం కనబడడంతో సందర్శించి స్వామివారిని వేడుకున్నారు.

ఎన్నికల అధికారుల విధుల
సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మనది ప్రజాస్వామ్య దేశం. ఓటరు తన ఓటు ద్వారా మంచి వ్యక్తిని ఎంపిక చేసుకుని పీఠం ఎక్కించగలిగే సత్తా ఉంది. ఈ అధికారాన్ని ఓటరుకు రాజ్యాంగం కల్పించింది. అలాంటి విలువైన ఓటును వేయడానికి దాని వెనుక ఎంతో మంది అధికారులు పని చేయాల్సి ఉంటుంది. గ్రామస్థాయిలో బూత్‌లెవల్‌ అధికారి నుంచి జిల్లా ఎన్నికల అధికారి వరకు సమన్వయంతో విధులు నిర్వర్తిస్తేనే ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవుతాయి. అధికారుల్లో సమన్వయం లోపిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల దాఖలు, పోలింగ్, ఎన్నికల నియమావళి అమలు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువరించే వరకు అధికారులు బాధ్యతతో పని చేయాల్సి ఉంటుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు అధికారుల పాత్రే కీలకం.. మరి ఏ అధికారికి ఏయే బాధ్యతలు.. అధికారాలు ఉంటాయనే అంశాలపై ప్రత్యేక కథనం..

ప్రధాన ఎన్నికల అధికారి 
శాసన సభ, పార్లమెంట్‌ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ అధికారిని నియమిస్తుంది. ఆయన సంబంధిత నియోజకవర్గ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. నామినేషన్‌ ప్రక్రియ, తుది జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, వంటి అన్ని అంశాలు ఈ అధికారి పర్యవేక్షణలో జరుగుతాయి. 

సెక్టోరల్‌ అధికారి 
8 నుంచి 10 పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించే అధికారాలు వీరికి ఉంటాయి. 

ఓటర్ల నమోదు అధికారి 
ఓటర్ల నమోదు జాబితాను తయారు చేయడం ఈయన ప్రధాన కర్తవ్యం. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నవారు ఈ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. 

ప్రిసైడింగ్‌ అధికారి 
సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి ప్రిసైడింగ్‌ అధికారితో పూర్తి బాధ్యత ఎన్నికలను అవసరమైన ఈవీఎంలను, వీవీప్యాట్‌లు పోలింగ్‌ కేంద్రానికి  తీసుకువచ్చి, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి, మళ్లీ వాటిని స్ట్రాంగ్‌ రూంకు చేర్చే వరకూ ఈ అధికారి బాధ్యత వహిస్తారు. వీరికి సహాయ పడడానికి సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు ఉంటారు. ఆ పోలింగ్‌ స్టేషన్‌లో జరిగే అన్ని కార్యకలాపాలు ఈయన పర్యవేక్షణలో జరుగుతాయి. 

సూక్ష్మ పరిశీలకులు 
ఎన్నికల నిర్వహణ జరిగిన తీరు, సంబంధిత పర్యవేక్షణపై నివేదికను రూపొందించి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపిస్తారు. 

బూత్‌ లెవల్‌ అధికారి 
కొత్తగా ఓటరు జాబితాలో చేరేవారికి ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పుల సవరణకు అవసరమైన ఫారాలు ఇవ్వడం, అర్హుల ఓటు నమోదు చేసుకునేలా చూడడం, ఓటరు జాబితాల ప్రదర్శన, పోలింగ్‌ కేంద్రాల మార్పునకు సహకరించడం వీరి బాధ్యత. 

పోలింగ్‌ ఏజెంట్లు... 
అసెంబ్లీ/పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులు పోలింగ్‌ జరిగే ప్రతి కేంద్రాన్ని వారు నేరుగా పరిశీలించలేరు. కాబట్టి ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక పోలింగ్‌ ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. పోలింగ్‌ ఏజెంట్‌ ఆ కేంద్రంలో ఓటరై ఉండాలి.  

ఎల్లారెడ్డి.. నేరేళ్ల
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానానికి 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నేరేళ్ల ఆంజనేయులు మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున నేరేళ్ల ఆంజనేయులు, కాంగ్రెస్‌ తరపున జనార్దన్‌గౌడ్, స్వతంత్య్ర అభ్యర్థిగా పొతంగల్‌ కిషన్‌రావు పోటీచేశారు. కాగా టీడీపీ అభ్యర్థి నేరేళ్ల ఆంజనేయులుకు 44,814 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జనార్ధన్‌గౌడ్‌కు 43,497 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి కిషన్‌రావుకు 19,500ఓట్లు వచ్చాయి.

దీంతో టీడీపీ అభ్యర్థి ఆంజనేయులు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి జనార్దన్‌గౌడ్‌పై 1,317 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలుపొందారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేరేళ్ల ఆంజనేయులు ప్రభుత్వ విప్‌గా, సివిల్‌సప్లయ్‌ చైర్మన్‌గా, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పదవులు చేపట్టారు. నేరేళ్ల ఆంజనేయులు వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చారు. నేరేళ్ల ఆంజనేయులు శాసనసభకు ఎన్నిక కాకముందు ఎల్లారెడ్డి పంచాయితీ సమితి కో–ఆప్షన్‌గా, గాంధారి సోసైటీ చైర్మన్‌గా, ఇదేసమయంలో ఎన్‌డీసీసీబీ డైరెక్టర్‌గా, గాంధారి సర్పంచ్‌గా, గాంధారి సర్పంచ్‌లఫోరం మండల ఉపాధ్యక్షుడిగా పలుపదవుల్లో కొనసాగారు. కాగా వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేరేళ్ల ఎల్లారెడ్డి అసెంబ్లీ చరిత్రలో హ్యాట్రిక్‌ సాధించిన నేతగా పేరొందారు.

కామారెడ్డి.. యూసుఫ్‌ అలీ
కామారెడ్డి క్రైం: 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యూసుఫ్‌అలీ విజయం సాధించారు. 1994లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంపగోవర్ధన్‌కు 1999లో టిక్కెట్‌ దక్కలేదు. అప్పటికే వక్ఫ్‌బోర్డు రాష్ట్ర చైర్మన్‌గా ఉన్న యూసుఫ్‌అలీ టీడీపీ టిక్కెట్‌ను దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో యూసుఫ్‌అలీకి 63,949 ఓట్లు రాగా ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌అలీ షబ్బీర్‌కు 60,178 ఓట్లు వచ్చాయి. 3,771 ఓట్ల స్వల్ప మెజారిటీతో యూసుఫ్‌అలీ విజయం సాధించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన విప్‌గా  కూడా పనిచేశారు. 

63,349యూసుఫ్‌అలీ 3,771 మెజారిటీమహమ్మద్‌అలీ షబ్బీర్‌60,178

నిజామాబాద్‌.. డి.శ్రీనివాస్‌
నిజామాబాద్‌అర్బన్‌: 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్లీ డి.శ్రీనివాస్‌ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆయన బరిలో నిలిచారు. తొలిసారిగా బీజేపీ ఈ ఎన్నికల్లో సత్తాను చాటుకుంది. అనూహ్యంగా బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ తరపున యెండల లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున 63,142 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణకు 50,392 ఓట్లు వచ్చాయి. 12,750 ఓట్ల మెజారిటీతో డి.శ్రీనివాస్‌ గెలుపొందారు. టీడీపీ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నిజామాబాద్‌ పట్టణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డి.శ్రీనివాస్‌కు పట్టం గట్టారు. 

63,142 డి.శ్రీనివాస్‌ 12,750మెజారిటీయెండల లక్ష్మీనారాయణ 50,392

జుక్కల్‌.. అరుణతార
నిజాంసాగర్‌(జుక్కల్‌): 1999 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అరుణాతార పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్‌ తరపున ప్రస్తుత ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ బరిలో నిలిచారు. మూడు పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సౌదాగర్‌ గంగారాం ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో టీడీపీ అభ్యర్థి కుమారి అరుణతారకు 39,558 ఓట్లు వచ్చాయి. కాగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సౌదాగర్‌ గంగారాంనకు 29,402 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలో నిలిచిన రాజేశ్వర్‌ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. దాంతో టీడీపీ అభ్యర్థి అరుణాతార స్వతంత్ర అభ్యర్థి సౌదాగర్‌ గంగారాంపై 10,402 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాలుగున్నర దశాబ్దాల అసెంబ్లీ ఎన్నికల సమరంలో జుక్కల్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కుమారి అరుణతార మహిళా ఎమ్మెల్యేగా విజయం సాధించడం గమనార్హం.

39,558అరుణతార 10,402 మెజారిటీసౌదాగర్‌ గంగారాం 29,402

బాన్సువాడ.. పోచారం
బాన్సువాడ: జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1999 ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు. మూడు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలో మంచి గుర్తింపు ఉంది. మూడు సార్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసి రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించారు. 1999లో నియోజకవర్గంలో మొత్తం 1,56,857 మంది ఓటర్లు ఉండగా, 1,17,233 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అందులో 1,13,709 ఓట్లు చెల్లాయి. టీడీపీ తరపున పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరపున మాజీ ఎమ్మెల్యే కిషన్‌సింగ్‌లు ఎన్నికల బరిలో నిలిచారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 72,495 ఓట్లు రాగా, కిషన్‌ సింగ్‌కు 40,495 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి 31,694 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1999–2000లో భూగర్భ గనుల శాఖ మంత్రిగా, 2001–02 గ్రామీణ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో సింగీతం, కళ్యాణి రిజర్వాయర్లు ఆయన హయాంలోనే నిర్మించారు. అలాగే ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, బాన్సువాడలో బస్సుడిపో నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణం తదితర పనులను ఆయన హయాంలోనే చేపట్టారు.

72,495పోచారం శ్రీనివాస్‌రెడ్డి 31,694 .మెజారిటీకిషన్‌సింగ్‌ 40,495

బాల్కొండ.. సురేశ్‌రెడ్డి
మోర్తాడ్‌(బాల్కొండ): రాష్ట్రంలో రెండోసారి వరుసగా టీడీపీ ప్రభంజనం కనిపించినా 1999లో మాత్రం బాల్కొండకు బాద్‌షాగా సురేశ్‌రెడ్డి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1999లో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ బాల్కొండ నియోజకవర్గంలో మాత్రం సురేశ్‌రెడ్డి గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గాను వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో సురేశ్‌రెడ్డిపై టీడీపీ తరపున ఆలూర్‌ గంగారెడ్డి రెండోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సురేశ్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో 54,182 ఓట్లు లభించగా ఆలూర్‌ గంగారెడ్డికి 42,935 ఓట్లు వచ్చాయి. సురేశ్‌రెడ్డికి 11,247 ఓట్ల మెజారిటీ లభించింది. 1989, 1994 ఎన్నికల్లో సాధారణ మెజారిటీ సాధించిన సురేశ్‌రెడ్డి ఈ ఎన్నికల్లో మెజారిటీని పెంచుకున్నారు.

1999లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్, సురేష్‌రెడ్డి వాక్‌చాతుర్యానికి ముగ్ధులయ్యారు. స్టాంపుల కుంభకోణం కేసులో ముంబ యి జైల్‌లో ఉన్న అప్పటి మంత్రి కృష్ణయాదవ్‌ కేసుకు సంబంధించి సురేశ్‌రెడ్డి అసెంబ్లీలో ధారాళాంగా మాట్లాడారు. అప్పటి సీఎం చంద్రబాబును, కృష్ణయాదవ్‌ను ఉద్దేశించి సురేశ్‌రెడ్డి చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. 2004లో సురేశ్‌రెడ్డి స్పీకర్‌గా ఎంపిక కావడానికి అప్పట్లో ఆయన చేసిన ప్రసంగమే కీలకమైంది. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సురేశ్‌రెడ్డి గోదావరి జలాల వినియోగంపై కొన్ని సూచనలు చేయడం వల్లే కొత్త ప్రాజెక్టులకు వైఎస్‌ అంకురార్పన చేశారు.
54,182కేఆర్‌ సురేశ్‌రెడ్డి11,247 మెజారిటీఆలూర్‌ గంగారెడ్డి 42,935

ఆర్మూర్‌.. బాజిరెడ్డి
ఆర్మూర్‌: 1999 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాజిరెడ్డి గోవర్ధన్‌ విజయం సాధిచారు. బాజిరెడ్డి గోవర్ధన్‌కు 72,378 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణకు 48,705 ఓట్లు వచ్చాయి. దీంతో బాజిరెడ్డి గోవర్ధన్‌ 23,673 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిరికొండ మండలం చీమన్‌పల్లికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్‌ మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించారు. చీమన్‌పల్లి సర్పంచ్‌గా 1981లో విజయం సాధించారు. 1987లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి డైరెక్ట్‌ ఎన్నికల్లో భాగంగా సిరికొండ మండల పరిషత్‌ అధ్యక్షుడిగా విజయం సాధించారు. 1995లో స్వతంత్య్ర అభ్యర్థిగా మరోసారి మండల పరిషత్‌ అధ్యక్షుడిగా విజయం సాధించారు. అనంతరం తన రాజకీయ గురువుతో విభేదించి కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి 1994లో ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏలేటి అన్నపూర్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానాన్ని చూసిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం 1999లో ఆర్మూర్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించడంతో సులభంగా విజయం సాధించారు.

72,495బాజిరెడ్డి గోవర్ధన్‌31,694మెజారిటీఏలేటి అన్నపూర్ణ40,495

డిచ్‌పల్లి.. మండవ
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండవ వెంకటేశ్వరరావు 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి విజయం సాధించారు. 1985, 1989, 1994 ఎన్నికల్లో వరసగా హ్యాట్రిక్‌ సాధించిన మండవ 1999 ఎన్నికల్లో మరోసారి గెలిచి తనకు డిచ్‌పల్లిలో తిరుగులేదని  చాటిచెప్పారు. ఈ ఎన్నికలో మండవ వెంకటేశ్వరావుకు 51,641 ఓట్లు రాగా, బాల్‌రెడ్డికి 47355 ఓట్లు వచ్చాయి. 4286 ఓట్ల మెజారిటీతో మండవ విజయం  సాధించారు. 1999 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మండవ వెంకటేశ్వరరావు భారీ నీటి పారుదల శాఖ మంత్రి అయ్యారు. అంతకుముందు ఆయన 1995లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1997లో ఎక్సైజ్‌ శాఖమంత్రిగా పదవులు నిర్వహించారు. మూడేళ్ల పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన మండవ 2002లో విద్యాశాఖ మంత్రి పదవి నిర్వహించారు.

51,641మండవ వెంకటేశ్వరరావు4,286మెజారిటీబాల్‌రెడ్డి 47,355

బోధన్‌.. సుదర్శన్‌ రెడ్డి
బోధన్‌: నియోజక వర్గంలో 1999 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దివంగత కొత్త రమాకాంత్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సుదర్శన్‌ రెడ్డికి 54, 234 ఓట్లు రాగా, రమాకాంత్‌కు 44,945 ఓట్లు వచ్చాయి. 9289 ఓట్లు ఆధిక్యత సాధించి సుదర్శన్‌రెడ్డి విజయం సాధించారు. పట్టణంలోని ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన కొత్త రమాకాంత్, సుదర్శన్‌తో గట్టి పోటీ ఇచ్చారు.

1989 ఎన్నికల్లో కూడా సుదర్శన్‌ రెడ్డి, రమాకాంత్‌లు ప్రత్యర్థులు. 1999లో ఎన్నికలో సుదర్శన్‌రెడ్డి ఆధిక్యత చాటి టీడీపీ సైకిల్‌ స్పీడ్‌కు బ్రేక్‌ వేశారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ రికార్డు సాధించారు. వరుసగా మూడు సార్లు టీడీపీ అభ్యర్థులు సుదర్శన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. నియోజక వర్గ పరిధిలోని నవీపేట మండలంలోని సిరాన్‌పల్లికి చెందిన సుదర్శన్‌రెడ్డి సామాన్య కుటుంబంలో జన్మించారు. 1986లో కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత 1989లో తొలి సారిగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి రమాకాంత్‌ చేతిలో ఓటమి చెందారు. ఉమ్మడి ఏపీ పీసీసీ డెలిగేట్, రెండు పర్యాయాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గ సభ్యుడు బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత సీఎం వైఎస్సార్, మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో కీలకమైన  వైద్యవిద్యశాఖ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా సుదర్శన్‌ రెడ్డి పనిచేశారు.

54,234సుదర్శన్‌రెడ్డి9,289మెజారిటీరమాకాంత్‌44,945

టీఆర్‌ఎస్‌ పాటల సీడీ ఆవిష్కరణ
భిక్కనూరు: తాజా మాజీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేసిన అభివృద్ధి పనులపై టీఆర్‌ఎస్‌ నాయకులు తున్కి వేణు ముదిరాజ్‌ రచించి పాడించిన జనహృదయ నేత గోవన్న పాటల సీడీలను గంప గోవర్ధన్‌ శుక్రవారం భిక్కనూరులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నర్సింగ్‌రావు, తున్కివేణు, పబ్బ శేఖర్, నర్బత్‌సింగ్, సంతోష్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top