పూటకు లేకున్నా.. పాటే ప్రాణంగా.. | Bandela sadanandam telangna songs writer | Sakshi
Sakshi News home page

పూటకు లేకున్నా.. పాటే ప్రాణంగా..

Sep 15 2014 3:44 AM | Updated on Sep 2 2017 1:22 PM

పూటకు లేకున్నా.. పాటే ప్రాణంగా..

పూటకు లేకున్నా.. పాటే ప్రాణంగా..

తెలంగాణ కోసం ఏమైనా చెయ్యాలనుకున్నారు. పూటకు లేకున్నా ఊరూరూ తిరిగారు.

తెలంగాణ కోసం గజ్జెకట్టిన బందెల సదానందం
తెలంగాణ కోసం ఏమైనా చెయ్యాలనుకున్నారు. పూటకు లేకున్నా ఊరూరూ తిరిగారు. తన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేశారు. కాళ్లకు కట్టిన గజ్జెలు విప్పకుండా 18ఏళ్లపాటు ఆటపాటలతో అందరినీ మెప్పించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రజలను కార్యోన్ముఖుల్ని చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తన కల సాకారమైందని, ఇక తనకే ఆశలు లేవని చెబుతున్న సదానందం పాడిన పాటలు ప్రజలను ఉద్యమంవైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించాయి.
 - మధిర(దుగ్గొండి)
 
దుగ్గొండి మండలం మధిర గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బందెల సదానందం పదో తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత కూడా చదువుకోవాలని అనుకున్నా ఆర్థిక పరిస్థితి సహకరించక చదువు మానేసి కూలి పనులకు వెళ్లారు. సదానందం చదువుకునే రోజుల్లోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని తీవ్రంగా బాధపడేవారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే బాగుండని అనుకునేవారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కావాలనుకున్నారు. ఇందుకోసం తనకున్న పాటలుపాడే కళను ఆయుధంగా చేసుకోవాలనుకునేవారు. చేనుచెలకల్లో కూలి పనులు చేస్తూనే పాటలు పాడడాన్ని సాధన చేశారు. పూటగడిచే స్థితి లేకున్నా పట్టువిడవకుండా పాటే ప్రాణంగా ముందుకుసాగారు.
 
బియ్యాల జనార్దన్‌రావు స్ఫూర్తితో..

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు, నలుమాస స్వామి, కట్టయ్యలు తొలిసారిగా 1997లో మదిర గ్రామానికి వచ్చారు. దీంతో స్ఫూర్తి పొందిన సదానందం సహచర కళాకారులను వెంటబెట్టుకుని చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి పాటలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు కృషి చేసేవారు. ఇలా మొత్తంగా 600 గ్రామాల్లో పర్యటించి పాటలు పాడారు.
 
ప్రజాగాయకులతో ధూంధాం..
ప్రజా గాయకులు గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, జయరాజ్, ప్రముఖ నటుడు నారాయణమూర్తితో కలిసి సదానందం అనేక ధూంధాంలు నిర్వహించారు. తెలంగాణ పది జిల్లాల్లోనూ ప్రదర్శనలిచ్చి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఉద్యమంలో అనేకసార్లు స్వయంగా పాల్గొని పోలీసుల లాఠీదెబ్బలు చవిచూశారు.
 
పాటల రచయితగా..
పాటలు పాడడమే కాకుండా సదానందం అనేక ఉద్యమ, సామాజిక గీతాలను సైతం రచించారు. మొత్తంగా 40వరకు పాటలు రాసిన ఆయన జై బోలో తెలంగాణ సినిమాలో గద్దర్‌తో కలిసి ‘పొడుస్తున్న పొద్దుమీద.. నడుస్తున్న కాలమా..’ పాట పాడారు. తోటి కళాకారులు ఖర్చుల కోసం బాధపడుతున్న సమయంలో తాను కూలికి వెళ్లి వచ్చిన కూలి డబ్బుల నుంచి కొంత మొత్తాన్ని వారి కోసం ఖర్చుపెట్టేవారు. ఉద్యమంలో తానూ ఒక భాగమై ముందుకురికిన సదానందం నేటికీ పూటగడవని స్థితిలోనే ఉండడం బాధాకరం.

అయినా తనలో ఆ బాధన్నదే కనిపించనీయకుండా తెలంగాణ రాకతో తన స్వప్నం సాకారమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలను ైచె తన్యం చేయాలనే దృఢ సంకల్పంతో గ్రామాల్లో తిరిగా. అందరి పోరాటంతో ప్రజల కల నెరవేరింది. ఇప్పుడు నాకు ఏ ఆశలూ లేవు. కొత్త రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలి. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉంటే అంతకంటే కావాల్సిందేముంటుంది’ అని చెప్పే సదానందం కోరిక నెరవేరాలని కోరుకుందాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement