డెత్‌ సర్టిఫికెట్‌ రాగానే భారత్‌కు పంపుతాం : బహరాస్‌ ఎంబసీ

Baharas Emigrant Office Agree Send Telangana Person Dead Body India - Sakshi

సాక్షి, కామారెడ్డి : ఈ నెల 2న బహరాస్‌లో జరిగిన ప్రమాదంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన గుండెబోయిన రాజు(37) మృతి చెందాడు. రంజాన్‌ సెలవులు ఉండటంతో మృతదేహాన్ని భారత్‌కు పంపే ప్రక్రియలో జాప్యం జరిగింది. దాంతో మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి పంపించాలని ఎమిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి ఇండియన్‌ ఎంబసీకి, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్య శాఖకు ‘మదద్‌’ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన బహరాస్‌ ఎంబసీ ప్రభుత్వం నుంచి డెత్‌ సర్టిఫికెట్‌ అందాల్సి ఉందని.. అది రాగానే మృత దేహాన్ని భారత్‌కు పంపడానికి తగిన చర్యలు తీసుకుంటామాని భీం రెడ్డికి ఈ మెయిల్‌ ద్వారా తెలిపింది.

పని నిమిత్తం బహరాస్‌ వెళ్లిన రాజు ఈ నెల 2 యాక్సిడెంట్‌కు గురయ్యాడు. డ్రైవర్‌ చూసుకోకుండా ట్రక్కును నడపడం వలన వెనక టైరు కింద పడ్డ రాజు తల నుజ్జు నుజ్జు అయింది. దాంతో రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు రాజుకు భార్య లావణ్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు.

ప్రవాసీ బీమాకు దూరం
ఈసీఆర్‌(ఎమిగ్రేషన్‌ చెక్‌ రిక్వయిర్డ్‌) పాస్‌పోర్టు కలిగిన రాజు.. చట్టబద్దమైన ఇ-మైగ్రేట్‌ సిస్టం ద్వారా కాకుండా అక్రమ పద్దతిలో పుషింగ్‌ ద్వారా బహరాస్‌కు వెళ్లాడు. ఫలితంగా ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 10 లక్షలు విలువ చేసే ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’(పీబీబీవై) ప్రయోజానికి అనర్హుడు కావడంతో బీమా ప్రయోజనం పొందలేకపోతున్నాడు. మూడున్నర నెలల క్రితం ‘జాస్కో’ కంపెనీలో ఉద్యోగంలో చేరిన రాజు.. ఇలా అనూహ్యంగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

రైతుబంధులాగా ప్రవాసీలను ఆదుకోవాలి
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రూ. 5 లక్షల రైతు బీమా ఇచ్చినట్లుగానే గల్ఫ్‌ ప్రవాసీ కార్మికులకు కూడా రూ. 5 లక్షల బీమా లేదా ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని ఎమిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్‌ సురేందర్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో తెలంగాణకు చెందిన సుమారు వెయ్యి మంది ప్రవాసీలు గల్ఫ్‌ దేశాల్లో వివిధ కారణాలతో మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ధన సహాయం అందలేదని పేర్కొన్నారు.ఇబ్బందుల్లో ఉన్న గల్ప్‌ కార్మికులు తన ఫోరం హెల్ప్‌ లైన్‌ నంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు.

హెల్ప్‌లైన్‌ నంబర్‌ - 93912 03187
మంద భీంరెడ్డి     - 98494 22622

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top