భద్రాద్రి రాముడి తెప్పోత్సవం | Badradhi ramudu Ekadasi celebrations at Badhrachalam | Sakshi
Sakshi News home page

భద్రాద్రి రాముడి తెప్పోత్సవం

Published Thu, Jan 1 2015 1:10 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM

భద్రాద్రి రాముడి తెప్పోత్సవం - Sakshi

పులకించిన గోదారి తీరం
 భద్రాచలం:  ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం స్వామి వారి తెప్పోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. పవిత్ర గోదావరి నదిలో హంసవాహనంపై విహరించిన స్వామి వారిని చూసిన భక్తులు పులకించిపోయారు. వెకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తజనుల రామనామస్మరణల మధ్య శ్రీసీతారామచంద్రస్వామి వారిని ఆలయం నుంచి ప్రత్యేక పల్లకిలో గోదావరి నదీ తీరానికి తీసుకొచ్చారు. స్వామి వారి పల్లకిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న మోసి సేవలో పాల్గొన్నారు. అనంతరం గోదావరి నదిలో ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై స్వామి వారిని ఉంచి వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారికి హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. బాణ సంచా వెలుగులతో శోభాయమానంగా సాగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు. స్వామి వారు తెప్పోత్సవంపై విహరిస్తున్నంత సేపూ గోదావరి తీరాన భక్తులు శ్రీరామ నామ జయజయ ధ్వానాలు చేశారు.
 
 తెప్పోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, సిర్పూర్ కాగజ్‌నగర్, అశ్వారావుపేట, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్ గడపల్లి కవిత, కలెక్టర్ ఇలంబరితి, జేసీ సురేంద్రమోహన్, ఎస్పీ షాన్‌వాజ్ ఖాసీం, ఐటీడీఏ పీవో దివ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement