అంతా వాళ్లిష్టం.. | Auto Permit Scam In hyderabad | Sakshi
Sakshi News home page

అంతా వాళ్లిష్టం..

Aug 23 2018 9:20 AM | Updated on Sep 4 2018 5:53 PM

Auto Permit Scam In hyderabad - Sakshi

సాక్షి సిటీబ్యూరో: ఆటో పర్మిట్లు ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. సాధారణంగా కొత్త ఆటో ధర రూ.1.60 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు ఉంటుంది. అయితే ఫైనాన్షియర్లు విక్రయించే ధర ఏకంగా రూ.2.7 లక్షలు కావడం గమనార్హం. అంటే ఒక్క ఆటోపై రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ‘ఆటోడ్రైవర్ల సంక్షేమం’ పేరుతో అనేక రకాల చట్టాలను రూపొందించే రవాణాశాఖ ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతోంది. వేల సంఖ్యలో ఆటో పర్మిట్లు ఫైనాన్షియర్ల గుప్పిట్లో ఉండడమే ఇందుకు కారణం. వాహన కాలుష్యం దృష్ట్యా ప్రభుత్వం నగరంలో కొత్త ఆటోపర్మిట్లపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలే  ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి.

ఆంక్షల నేపథ్యంలో ఆటోడ్రైవర్లు నేరుగా షోరూమ్‌కు వెళ్లి ఆటో కొనుగోలు చేసే వీలు లేదు. కాలం చెల్లిన, పాత ఆటో రిక్షాల స్థానంలో మాత్రమే కొత్త వాటిని కొనుగోలు చేయవచ్చు. రవాణా అధికారుల సమక్షంలో పాత ఆటోలను తుక్కు కింద మార్చివేస్తే వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తారు. ఫైనాన్షియర్ల చక్రవడ్డీ వ్యాపారం కారణంగా సకాలంలో డబ్బులు చెల్లించలేక ఆటోరిక్షాలను వదులుకున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. అలాంటి పాత వాహనాల పర్మిట్లను ఫైనాన్షియర్లు రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షలకు విక్రయిస్తున్నారు. అంటే ఒక ఆటోడ్రైవర్‌ కొత్తగా ఆటో కొనుగోలు చేయాలంటే పాత పర్మిట్‌కు రూ.లక్ష చొప్పున, కొత్త ఆటోకు రూ.1.6 లక్షల చొప్పున రూ.2.6 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. డిఫాల్టర్లుగా మారిన ఆటోడ్రైవర్ల నుంచి వచ్చే వాటితో పాటు సహజంగానే కాలం చెల్లిన ఆటోలను కూడా వాటి యజమానుల నుంచి కొనుగోలు చేసి రూ.లక్షల్లో విక్రయిస్తున్నారు.  

అక్రమార్జనకు మూలం ఇక్కడే..
ఒక ఆటోడ్రైవర్‌ ఆటోరిక్షా ద్వారా నగరంలో ఉపాధి పొందాలంటే కనీసం  రూ.2.7 లక్షల వరకు వెచ్చించాలి. ఇది సాధ్యం కాకపోవడంతో తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులకు మరికొంత అప్పు చేయాల్సి వస్తుంది. వీరి అవసరం ఫైనాన్షియర్లకు అక్రమార్జనకు ఊతమిస్తోంది. వడ్డీలపై అప్పులు ఇస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఆంక్షల కారణంగా పర్మిట్లను తమ దగ్గర పెట్టుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్న ఫైనాన్షియర్లు ఆటోల ధరలను భారీగా పెంచేస్తున్నారు. దీంతో ఆటోడ్రైవర్లు పర్మిట్ల కోసం చెల్లించే రూ.లక్షా 10 వేలతో పాటు, వడ్డీ రూపంలో కనీసం మరో రూ.50 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఒక వేళ సకాలంలో చెల్లించలేకపోతే తిరిగి డిఫాల్టర్లుగా మారి ఆటోలను కోల్పోవాల్సి వస్తోంది. అలా స్వాధీనం చేసుకున్న ఆటోలను  మరొకరికి విక్రయిస్తున్నారు. ఒక చట్రంలా సాగుతున్న ఈ సుడిగుండంలో  ఆటోడ్రైవర్లే సమిధలుగా మారుతున్నారు. 

ఆర్టీఏ ప్రేక్షక పాత్రకు పరిమితం..
ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం పన్నుల భారాన్ని తొలగించింది. పర్మిట్లపై ఆంక్షలను సడలిస్తూ కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. అయినా ఫైనాన్షియర్ల కబంధ హస్తాల నుంచి ఆటోడ్రైవర్లకు విముక్తి కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. వందలాది మంది ఫైనాన్షియర్లు కేవలం నామమాత్రపు పత్రాలపైన చేసుకున్న ఒప్పందాలనే ప్రామాణికంగా భావించి ఆర్టీఏ అధికారులు వాహనాల రిజిస్ట్రేషన్‌లకు అనుమతులిచ్చేస్తున్నారు. ఆటోడ్రైవర్‌కు, ఫైనాన్షియర్‌కు మధ్య రుణ ఒప్పందాన్ని (హైపతికేషన్‌) ధృవీకరిస్తున్నారు. అయితే ఫైనాన్షియర్‌ చట్టబద్దతను, ప్రామాణికతను ఆర్టీఏ అధికారులు ఎక్కడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో కోట్లాది రూపాయాల అక్రమ సామ్రాజ్యాన్ని  నిర్మించుకుంటున్నారు. ఆటోడ్రైవర్లపై సాగుతున్న ఈ దారుణ దోపిడీలో  ఆర్టీఏ ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement