శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చైర్మన్‌గా ఉన్న అసెంబ్లీ రూల్స్ కమిటీ ఈ నెల 7న సమావేశం కానుంది.
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చైర్మన్‌గా ఉన్న అసెంబ్లీ రూల్స్ కమిటీ ఈ నెల 7న సమావేశం కానుంది. మార్చి తొలి వారంలో జరగనున్న బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నట్లు సమాచారం. గత నెల 6వ తేదీన జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావు, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు అన్ని పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు రూల్స్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కూడా హాజర వుతారు.
ఇప్పటికే రెండు సమావేశాలు జరిగినా పూర్తి స్థాయి చర్చ జరగకపోవడంతో తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నందున అందుకు సంబంధించిన కీలకాంశాలపై చర్చ జరిగే అవకాశముంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, పిటిషన్లు, డిమాండ్లపై ఎన్ని రోజులు చర్చ జరగాలన్న అంశంతో పాటు పీఏసీ, పీయూసీ అంచనాలు, పలు కమిటీల్లో సభ్యుల సంఖ్య తదితర అంశాలపై చర్చించనున్నారు. సమావేశాల సమయంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది.