breaking news
Assembly Rules Committee
-
ప్రారంభమైన అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చైర్మన్‌గా ఉన్న అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీని డిజిటలైజేషన్ విధానంలో జరిపే అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర తరహాలో గవర్నర్ ప్రసంగాన్ని ఎవరైనా అడ్డుకుంటే ఒక సంవత్సరం పాటు సస్పెన్షన్ వేటు వేయడంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే మార్చి తొలి వారంలో జరగనున్న బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన కీలకాంశాలపై చర్చ జరిగే అవకాశముంది. -
7న అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీ
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చైర్మన్‌గా ఉన్న అసెంబ్లీ రూల్స్ కమిటీ ఈ నెల 7న సమావేశం కానుంది. మార్చి తొలి వారంలో జరగనున్న బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నట్లు సమాచారం. గత నెల 6వ తేదీన జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావు, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు అన్ని పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు రూల్స్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కూడా హాజర వుతారు. ఇప్పటికే రెండు సమావేశాలు జరిగినా పూర్తి స్థాయి చర్చ జరగకపోవడంతో తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నందున అందుకు సంబంధించిన కీలకాంశాలపై చర్చ జరిగే అవకాశముంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, పిటిషన్లు, డిమాండ్లపై ఎన్ని రోజులు చర్చ జరగాలన్న అంశంతో పాటు పీఏసీ, పీయూసీ అంచనాలు, పలు కమిటీల్లో సభ్యుల సంఖ్య తదితర అంశాలపై చర్చించనున్నారు. సమావేశాల సమయంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
మార్చి తొలి వారంలో బడ్జెట్ సమావేశాలు
అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి తొలి వారంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన మంగళవారం జరిగిన అసెంబ్లీ రూల్స్ కమిటీలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. రూల్స్ కమిటీలో 14 మంది సభ్యులుగా ఉన్నప్పటికీ తాజా భేటీకి ఐదుగురే హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిబంధనలనే కొన్ని సవరణలతో తెలంగాణ అసెంబ్లీకి వర్తింపజేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సభా నిర్వహణకు సంబంధించి పార్లమెంటు విధి విధానాలను అధ్యయనం చేసేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్లాలని రూల్స్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోని అసెంబ్లీ నిబంధనలను కూడా పరిశీలించాలని కొందరు సభ్యులు స్పీకర్‌కు సూచించారు. శాసనసభా సమావేశాల్లో ఎక్కువ మంది సభ్యులకు మాట్లాడే అవకాశం వచ్చేలా పని వేళలను పెంచాలని విపక్ష పార్టీల సభ్యులు ప్రతిపాదించారు. పిటిషన్స్, ప్రివిలేజెస్, గవర్నమెంట్ అస్యూరెన్సెస్ కమిటీల్లో ఏడుగురు చొప్పున సభ్యులు, రూల్స్ కమిటీలో 11 మంది సభ్యులు ఉండాలన్న చర్చ జరిగింది. మొత్తం 16 అసెంబ్లీ కమిటీల్లో దాదాపు అందరు సభ్యులకు అవకాశమిచ్చేలా కూర్పు ఉండాలన్న సూచన కూడా వచ్చింది. చివరకు ఈ అన్ని అంశాలపై మరో సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులందరికీ అవకాశం వచ్చేలా సమయాన్ని పెంచాలని కోరినట్లు ఈ భేటీలో పాల్గొన్న బీజేపీఎల్పీ నేత లక్ష్మణ్ చెప్పారు. విభజన చట్టానికి అనుగుణంగా అసెంబ్లీ నిబంధనలు రూపొందించాలని సూచించామన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, వివేకానంద, లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డికి సభ్యులంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.